టికెట్‌ ధరలు పెంచుకోండి:  రాష్ట్ర ప్రభుత్వం

8 Oct, 2017 11:04 IST|Sakshi

పెరంబూరు(తమిళనాడు): ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు అనే సగటు జనం ఇప్పుడు కూసంత వినోదం కోసం సినిమాకు వెళ్లేటట్టూ లేదని పాడుకునే రోజు వచ్చింది. సినిమా టికెట్‌ ధరలకు ప్రభుత్వం గేట్లేసింది. ముందుగా థియేటర్లపై వినోదపు పన్ను భారం మొపేసి ఇప్పుడు టికెట్‌ ధరను పెంచుకోండంటూ థియేటర్ల యాజమాన్యానికి అనుమతి ఇచ్చింది. సినిమాలపై జీఎస్టీ 28 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వినోదపు పన్ను 10 శాతం వేసేసింది. దీంతో బాబోయ్‌ మా వల్ల కాదంటూ ఆ 10 శాతం పన్నును రద్దు చేయాలని, లేని పక్షంలో థియేటర్లను మూసివేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని థియేటర్ల యాజమాన్యాలు గగ్గోలు పెట్టాయి. ఇక నిర్మాతలమండలి వినోదపు పన్నును వ్యతిరేకిస్తూ శుక్రవారం విడుదల కావలసిన కొత్త చిత్రాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రప్రభుత్వం సినిమా టికెట్‌ ధరలను పెంచుకోవచ్చునని శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.  ఈ ప్రకటనలో చెన్నై నగరంలోని మల్టీప్లెక్స్‌ థియేటర్లలో టికెట్‌ ధరను గరిష్టంగా రూ. 160 వరకూ పెంచుకోవచ్చుని తెలిపింది. ఇతర నగరాల్లో రూ.140 వరకూ పెంచుకోవచ్చుకోవడానికి అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో థియేటర్ల యాజమాన్యాలు సమ్మెను విరమిస్తాయా? లేదా? అన్నది వేచి చూడాల్సి ఉంది. ఏతా వాతా ప్రభుత్వం వినోదపు పన్ను వేసినా, థియేటర్లు టికెట్‌ ధరను పెంచినా ఆ భారం మోయాల్సింది ప్రజలే. ఇక సగటు ప్రేక్షకుడికి సినిమా మరింత ప్రియం అయింది. మొత్తం మీద ప్రభుత్వం, సినీ థియేటర్ల మధ్య వివాదంతో మధ్య తరగతి ప్రేక్షకులకు చుక్కలంటే ధరలతో నిజంగానే సినిమా చూపిస్తున్నారు. 

మరిన్ని వార్తలు