దొంగ కథతో బోగస్‌ ఓట్ల గురించి చిత్రమా?

6 Nov, 2018 11:21 IST|Sakshi
విజయ్‌ ,బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌రాజన్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌రాజన్‌

చెన్నై, పెరంబూరు: దొంగిలించిన కథతో దొంగ ఓట్ల గురించి చిత్రం చేస్తారా? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌రాజన్‌ విమర్శించారు. విజయ్‌ నటించిన చిత్రం అంటేనే విమర్శల పర్వం మొదలవుతుంది. తాజా చిత్రం సర్కార్‌ కథ విషయం వివాదంగా మారినా దాన్ని సమరస్య పూర్వకంగా పరిష్కరించుకున్నారు. అయితే రాజకీ య పరమైన విమర్శలెక్కడా రావడంలేదే అనుకుంటున్న తరుణంలో బీజేపీ దాడి మొదలెట్టింది. ఇంతకు ముందు కూడా మెర్శల్‌ చిత్ర విషయంలో బీజేపీ రాద్దాంతం చేసిన విషయం తెలిసిందే. తాజగా అలాంటి రచ్చకే తెర లేసిందని చెప్పవచ్చు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌రాజన్‌ సోమవారం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొందరు సినిమాల్లో నటించి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోదామని బయలుదేరారని విమర్శించారు. అలాంటి వాళ్లు సినిమాల్లో ముఖ్య మంత్రులు అవ్వవచ్చుగానీ.. ధరణిలో నరేంద్రమోదీనే ప్రధా ని అని పేర్కొన్నారు. ఆయన ఎవరిని భుజం తట్టి చూపిస్తారో ఆయనే ముఖ్యమంత్రి అవుతారన్నారు.

రాజకీయ పరిస్థితి బాగానే ఉంది..
ఇక్కడ రాజకీయా పరిస్థితి బాగానే ఉందని, నటులెవరూ వచ్చి బాగు చేయాల్సిన అవసరం లేదన్నారు. తమిళనాడులో భారతీయ జనతా పార్టీ మాత్రమే మార్పు తీసుకురాగలదని తమిళిసై ఉద్ఘాటించారు. బీజేపీ ఒక మంచి సర్కార్‌ అని,  దొంగిలించిన కథతో దొంగ ఓట్ల గురించి చిత్రాన్ని నిర్మిస్తారా? అం టూ ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలు సర్కార్‌ చిత్రంలో నటించిన విజయ్‌ గురించేనా అన్న విలేకర్ల ప్రశ్నకు బదులిస్తూ, నటుడు విజయ్‌పై దాడి చేయాలన్నది ఉద్ధేశం కాదన్నారు. ఆ చిత్ర కథే తస్కరించబడ్డదని, అలాంటిది దొంగ ఓట్ల గురించి ఎందుకు చర్చించాలని తమిళిసై ప్రశ్నించారు.

అభిమానులపై లాఠీఛార్జ్‌..
విజయ్‌ అభిమానులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేసిన సంఘటన కలకలానికి దారి తీసింది. విజయ్‌ నటించిన సర్కార్‌ చిత్రం దీపావళి పండుగ సందర్భంగా  మంగళవారం తెరపైకి రానుంది. దీంతో గత కొద్ది రోజుల నుంచే ఆయన అభిమానుల హంగామా మొదలైంది. గుడవాంఛేరి ప్రాంతంలోని, చెన్నై– తిరుచ్చి రహదారిలో వెంకటేశ్వర థియేటర్‌ ఉంది. ఆ థియేటర్‌లో సర్కార్‌ చిత్రం విడుదల కానుం ది. దీంతో సోమవారం అడ్వాన్స్‌ బుకింగ్‌ ఓపెన్‌ చేశారు. దీంతో విజయ్‌ అభిమానులు వేకువజాము నుంచే టిక్కెట్‌ కొనుగోలు కోసం ఆ థియేటర్‌ ముందు పోటెత్తారు. అభిమానుల మధ్య తోపులాట జరిగింది. అంతే ఆ ప్రాంతంలో  ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిం ది. సమాచారం అందుకున్న పోలీసులు ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌ నేతృత్వంలో అక్కడికి చేరుకుని అభిమానుల్ని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. దీంతో అభిమానులు అక్కడినుంచి పరుగులు తీశారు. కొందరైతే గోడలు దూకి పారిపోయారు. లాఠీఛార్జ్‌లో పలువురు అభిమానులకు గాయాలయ్యాయి. కొంతసేపు ఆ ప్రాంతంలో కలకలం రేగింది.

మరిన్ని వార్తలు