ఈ సినిమా సమర్పించడం గర్వంగా ఉంది

6 Mar, 2020 02:40 IST|Sakshi
ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ

– తమ్మారెడ్డి భరద్వాజ

‘‘ఇప్పటివర కూ చాలా సినిమాల్లో నా పేరు ఉంది. కానీ వాటన్నింట్లో ‘పలాస’ చాలా ప్రత్యేకమైన సినిమా. నాకు బాగా సంతృప్తి కలిగించిన సినిమా. ‘పలాస’ సినిమాను సమర్పించడం గర్వంగా ఉంది’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యా¯Œ  అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా సమర్పకులు తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత ప్రసాద్‌ పలు విషయాలు పంచుకున్నారు.  తమ్మారెడ్డి భరద్వాజ మాట్లా డుతూ – ‘‘కరుణకుమార్‌ కథ చెప్పగానే నాకు చాలా నచ్చింది. ఎక్కడా వంకలు పెట్టలేని విధంగా చెప్పాడు. గతంలో వచ్చిన ‘మా భూమి’ వంటి సినిమాలా అనిపించింది.

ఈ కథను ప్రసాద్‌గారి దగ్గరకు తీసుకెళ్లాం. ఆయనకు కూడా నచ్చింది. కరుణ కథ చెప్పినట్టే తెరకెక్కించాడు. ఎక్కడా తప్పులు కనిపించలేదు. వర్గ విబేధాలను కరుణ అద్భుతంగా తెరకెక్కించాడు. వాస్తవ సంఘటనలకు కాస్త కమర్షియల్‌ అంశాలు జోడించి ఈ సినిమా తెరకెక్కించాడు. అల్లు అరవింద్‌గారు ఈ సినిమా చూసి కరుణకు వాళ్ల బ్యానర్‌లో సినిమా చేసే అవకాçశం ఇచ్చారు’’ అన్నారు.  ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘భరద్వాజగారు ఈ ప్రాజెక్ట్‌ పూర్తయ్యేవరకూ మా నీడలా మాతోనే ఉన్నారు. ఆయన మా వెనక ఉండటం వల్ల చాలా సమస్యలు సులువుగా పరిష్కారం అయ్యాయి. మా ఇద్దరి ఆలోచనా విధానం చాలా దగ్గరగా ఉంటుంది. ప్రతిసారీ మన సినిమాల్లో గెలిచిన వాళ్ల కథనే చూపిస్తుంటాం. ఇందులో ఓడినవాళ్ల కథను చెప్పాం. అణచివేయబడుతున్నవాళ్ల కథను చెప్పాం’’ అన్నారు.

మరిన్ని వార్తలు