మంచిరోజులు వస్తాయని ఏదో దురాశ

16 Jun, 2015 13:36 IST|Sakshi
మంచిరోజులు వస్తాయని ఏదో దురాశ

కొవ్వూరు : గోదావరి గలగలలు.. పచ్చని పైర్లు.. పాపికొండల అందాలంటే తనకెంతో ఇష్టమని సీనియర్ నటుడు, రచరుుత తనికెళ్ల భరణి అన్నారు. మండలంలోని కుమారదేవంలో ‘గోదారి.. నవ్వింది’ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు సోమవారం వచ్చిన ఆయన కొద్దిసేపు ముచ్చటించారు.
 
మీ సినీ జీవితం ఎలా ఉంది

చాలా హ్యాపీగా సాగిపోతోంది. అభిమానులు ఆదరిస్తున్నంత సేపూ ఇలా నటిస్తూనే ఉంటా.
 
ఇప్పటి వరకూ ఎన్ని సినిమాల్లో నటించారు
30 ఏళ్ల క్రితం వంశీ డెరైక్షన్‌లో నటించిన లేడీస్ టైలర్ నుంచి ఇప్పటి వరకూ సుమారు 800 సినిమాల్లో నటించా.
 
 మీకు చాలా ఇష్టమైన, పేరు తెచ్చిపెట్టిన సినిమాలు
చాలా ఉన్నాయి. అంకురం, మాతృదేవోభవ, కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్, శివ, వారసుడొచ్చాడు, అన్నమయ్య, అతడు, ఆమె, యమలీల ఇలా చాలా ఉన్నారుు.  
 
 మీ సొంతూరు
 పాలకొల్లు దగ్గర ఉన్న జగన్నాథపురం మా సొంతూరు
 
 ప్రస్తుతం నటిస్తున్న, నటించిన  సినిమాలు
 కిక్-2, బెంగాల్ టైగర్, బాహుబలి, గోదారి నవ్వింది, రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న మైనేమ్ ఈజ్ రాజులో నటిస్తున్నా.
 
 ఇంటర్వ్యూలలో శివుడు గురించి ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు. సమాజం గురించి ఏమైనా చెబుతారా
అవును నాకు భోళాశంకరుడంటే ఇష్టం. సమాజంలో స్వార్థం పెరిగిపోరుుంది. ఎక్కడ చూసినా మోసం, దగా, కుట్ర కనిపిస్తున్నారుు. మనిషి తాను చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి దేవుడిని నమ్ముతున్నాడు. దీంతో దేవుడు కూడా వెళ్లలేనంతగా ఆలయాలు కిక్కిరిసిపోతున్నాయి.
 
ప్రస్తుత సినిమాల్లో హింస ఎక్కువగా ఉందంటారా
లేదు సినిమాల్లో కన్నా బయట ప్రపంచంలోనే హింస ఎక్కువగా ఉందని నా భావన. పెరుగుట విరుగుట కొరకే అన్న సామెతగా దుర్మార్గం పోయి మంచిరోజులు వస్తాయని ఏదో దురాశ.
 
ప్రస్తుతం వస్తున్న సినిమాలపై మీ అభిప్రాయం
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలోని తినుబండారాల మాదిరిగా త్వరత్వరగా సినిమాలు తీస్తున్నారు. దీంతో సక్సెస్‌రేటు పడిపోయింది. బాహుబలి సినిమా మొదలు పెట్టి రెండేళ్లు గడుస్తుంది. ఈ మధ్యలో పదుల సంఖ్యలో వచ్చాయి... వెళ్లాయి అంతే.  
 
కొత్తగా సినీ పరిశ్రమకు వచ్చే వారికి మీరిచ్చే సలహా
సలహా ఇచ్చే అంత నా దగ్గర ఏమీ లేదు. అయితే ప్రతి దాంట్లోను కొత్త నీరు వస్తూనే ఉంటుంది. ఇక్కడ టాలెంట్ ఉంటే నూరు శాతం సక్సెస్ అవుతారు.
 
గోదారి.. నవ్వింది సినిమా గురించి
మంచి కథ, కథపై పట్టున్న దర్శకుడు భీమ్‌జీ, అభిరుచి గల నిర్మాత బలగ ప్రకాశరావు. సినిమా తప్పక విజయం సాధిస్తుంది.
 
 భరణీ విలనిజం
 కుమారదేవంలో షూటింగ్ సందడి
 కుమారదేవం (కొవ్వూరు రూరల్) : ‘గోదారి నవ్వింది’ చిత్రంలో సీనియర్ నటుడు తనికెళ్ల భరణి మరోసారి తన విలనిజాన్ని ప్రదర్శించారు. సినిమా షూటింగ్‌లో భాగంగా పోరాట సన్నివేశాలను కుమారదేవంలోని ఇసుక తిన్నెలపై దర్శకుడు భీమ్‌జీ యజ్జల సోమవారం తెరకెక్కించారు. చిత్రంలో ఎమ్మెల్యేగా నటిస్తున్న తనికెళ్ల భరణి తన అనుచరులతో కలిసి మైనింగ్ అధికారిని శిక్షించే సన్నివేశాన్ని కెమెరామెన్ సలీమ్ చిత్రీకరించారు.