ఆమె కాళ్లు 250 కోట్లు!

12 Mar, 2015 22:27 IST|Sakshi
ఆమె కాళ్లు 250 కోట్లు!

వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం! హాలీవుడ్ గాయని, నటి, నిర్మాత టేలర్ స్విఫ్ట్ తన కాళ్లను దాదాపు 250 కోట్ల రూపాయలకు బీమా చేయించారు. రెండు కాళ్లకు అంత మొత్తమా? అని ఆశ్చర్యంగా ఉంది కదూ. టేలర్ మంచి గాయని. వేదికలపై పాటలు పాడుతూ, ఆమె చేసే నృత్యాలకు విదేశాల్లో బోల్డంత క్రేజ్ ఉంది. పైగా.. ఈవిడ చేసే ఓ ప్రత్యేకమైన స్టెప్‌ని కళ్లార్పకుండా చూసే అభిమానులు ఉన్నారు. ఆ స్టెప్ వేస్తున్నప్పుడు టేలర్ కాళ్లు చూస్తూ ఉండాలనిపిస్తుంటుందని ఆమె అభిమానులు బహిరంగంగా పేర్కొన్న సందర్భాలు న్నాయి.
 
 ఈ మధ్య ఎందుకో టేలర్‌కి, ఒకవేళ తన కాళ్లకు ఏమైనా అయితే, అప్పుడు తన జీవితం ఏం కానూ అనిపించిందట. ఈ ఆలోచనే ఆమె తన కాళ్లను బీమా చేయించేలా చేసింది. మేలో ఓ మ్యూజికల్ టూర్ ప్లాన్ చేసుకున్నారామె. ఆ లోపు బీమా చేయించేయాలని అనుకున్నారట. మామూలుగా తన కాళ్లు 60 కోట్లు వరకూ పలుకుతాయని టేలర్ అనుకున్నారట. కానీ, బీమా కంపెనీవారు ‘మీ కాళ్ల విలువ మీకు తెలియడంలేదు. 250 కోట్ల వరకూ బీమా చేయొచ్చు’ అన్నారట. ఆ మొత్తం విని షాకయ్యారట టేలర్. ‘హమ్మయ్య ఒకవేళ కాళ్లకు ఏమైనా అయ్యి, డాన్స్ చేయడానికి సహకరించకపోతే.. భయపడాల్సిన అవసరంలేదు. జీవితాంతం కాలు మీద కాలేసుకుని బతికేయొచ్చు’ అని చిరునవ్వు నవ్వుకున్నారట టేలర్.