పార్కింగ్‌ నుంచి థియేటర్లను మినహాయించాలి

29 Jun, 2018 00:41 IST|Sakshi
మురళీ మోహన్, కిరణ్, సునీల్‌ నారంగ్, సదానంద గౌడ్, శ్రీధర్, బాలగోవింద్‌ రాజ్‌

‘‘గ్రేటర్‌ హైదరాబాద్‌లోని రైల్వే స్టేషన్స్, బస్‌ స్టాండ్స్, కొన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, మున్సిపల్‌ ఆఫీసుల్లో వాహన దారుల నుంచి పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తున్నారు. కానీ, థియేటర్స్‌లో, మల్టీప్లెక్స్‌లలో పార్కింగ్‌ రుసం వసూలు చేయొద్దని చెప్పడం వల్ల యాజమాన్యానికి నిర్వహణ భారం మరింత పెరిగింది’’ అని తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌(టీ.ఎస్‌.ఎఫ్‌.సీ.సీ.) అధ్యక్షుడు కె.మురళీ మోహన్‌ అన్నారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో గురువారం తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో ఎగ్జిబిటర్లు, థియేటర్ల యజమానులు ప్రెస్‌మీట్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా కె.మురళీ మోహన్‌ మాట్లాడుతూ– ‘‘తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 852 థియేటర్స్‌ ఉండేవి. ప్రస్తుతం 400 మాత్రమే ఉన్నాయి. మిగిలినవి నిర్వహణ భారం వల్ల మూత పడ్డాయి. జీవీకే, ఇన్‌ఆర్బిట్‌ మాల్‌లో పార్కింగ్‌ రుసం అధికంగా వసూలు చే శారు. దాన్ని సాకుగా చూపి జీహెచ్‌ఎంసీ నార్మ్స్‌ ప్రకారం థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో పార్కింగ్‌ వసూలు చేయకూడదని చెప్పడం యజమానులకు ఇబ్బందిగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పార్కింగ్‌పై ఆధారపడిన 6000 మంది ఉపాధి కోల్పోయారు.

మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌గారికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమస్యను విన్నవించాం. ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించాలని కోరుకుంటున్నాం’’ అన్నారు. ‘‘థియేటర్స్‌లో రెండు మూడు గంటలకు నామినల్‌ పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తున్నాం. ఈ ఫీజు తీసేయడం వల్ల పార్కింగ్‌లో పనిచేసే వారికి ఉపాధి లేకుండా పోయింది. పైగా ప్రేక్షకుల వాహనాలకు భద్రత కరువైంది. పార్కింగ్‌ వసూలు నుంచి థియేటర్లను మినహాయించాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం’’ అని  టీ.ఎస్‌.ఎఫ్‌.సీ.సీ. జాయింట్‌ సెక్రటరీ బాలగోవింద్‌ రాజ్‌ అన్నారు.

‘‘థియేటర్, వాహనాల భద్రత, పార్కింగ్‌ పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు మాత్రమే పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తున్నారు. ఉచిత పార్కింగ్‌ కావడంతో బయటి వారు కూడా పార్క్‌ చేసి వెళ్లిపోతున్నారు. వాహనాల పార్కింగ్‌కి ప్రభుత్వం ఓ ధర నిర్ణయించి, ఎక్కువ వసూలు చేసిన వారికి భారీ జరిమానాలు విధించినా మేం సిద్ధమే. మల్టీప్లెక్స్‌లలోని క్యాంటీన్‌లలో అధిక ధరలు వసూలు చేస్తున్నారు కానీ, థియేటర్స్‌లో ఎక్కడా ఎక్కువ వసూలు చేయడం లేదు’’ అని టీ.ఎస్‌.ఎఫ్‌.సీ.సీ. సెక్రటరీ సునీల్‌ నారంగ్‌ అన్నారు.  ఈ సమావేశంలో నిర్మాతల మండలి అధ్యక్షుడు కిరణ్, టీ.ఎస్‌.ఎఫ్‌.సీ.సీ. ఉపాధ్యక్షుడు వి.ఎల్‌. శ్రీధర్, ఈసీ మెంబర్‌ శేఖర్, పలువురు థియేటర్ల యజమానులు, ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు