అలాంటి కథ ఉంటే చెప్పండి!

11 Jan, 2018 01:15 IST|Sakshi

తమిళసినిమా: సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకీయాలకు రహదారి సినిమా అనే భావం చాలా మందిలో ఉంది.ముఖ్యంగా తమిళనాడులో జరుగుతున్నది ఇదే అయినా అనాధిగా జరుగుతున్నదే. కాగా రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తారా? రారా? అన్న మీమాంసను బద్దలు కొడుతూ సుదీర్ఘకాలం తరువాత ఎట్టకేలకు ఆయన రాజకీయరంగప్రవేశం చేశారు. అందుకు అభిమానులు స్వాగతిస్తున్నా, కొందరు సినీ, రాజకీయవాదులు మాత్రం రజనీకాంత్‌ రాజకీయాల్లో రాణించలేదని బాహటంగానే అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన రాజకీయ పునాదులను బలంగా నాటుకునే ప్రయత్నంలో వ్యూహాలు రచిస్తున్నారు రజనీ అండ్‌ కో. అందులో భాగంగా అభిమానులను కార్యకర్తలుగా మార్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నా, మరో పక్క తనను ఉన్నత శిఖరాలకు చేర్చిన సినిమాను వాడుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్లు టాక్‌. రజనీకాంత్‌ నటించిన 2.ఓ చిత్రం ఏప్రిల్‌లో విడుదలమ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి ఆయన అల్లుడు ధనుష్‌ నిర్మిస్తున్న కాలా చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

అయితే 2.ఓ బ్రహ్మండ చిత్రమే అయినా అది అభిమానులను మాత్రమే సంతృప్తి కలిగించగలదు. ఇక కాలా చిత్రంలో రజనీకాంత్‌ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నారు. ఇది ఆయనకు రాజకీయంగా ఎంత వరకు పనికొస్తుందో ఊహించలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో మరో రెండేళ్లలో పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించి తమిళనాడులోని 234 నియోజిక వర్గాల్లోనూ పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు. అందువల్ల తన రాజకీయ భవిష్యత్‌కు బ్రహ్మాస్త్రంలా పనికొచ్చే రాజకీయ నేపథ్యంతో కూడిన ఒక చిత్రాన్ని చేయాలన్న ఆలోచనతో మన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఉన్నట్లు తాజా సమాచారం. ఇదే భావనతో కబాలి, కాలా చిత్ర దర్శకుడు పా.రంజిత్‌ను ఆ తరహా కథ ఉందా? లేకపోతే అలాంటి కథను సిద్ధం చేయండి  అని రజనీ చెప్పారట. అదే విధంగా శివాజీ, ఎందిరన్, 2.ఓ చిత్రాల దర్శకుడు శంకర్‌తో కలిసి ముదల్వన్‌–2 చేయాలని ఆయన భావిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్‌ అవుతోంది.   

మరిన్ని వార్తలు