‘వైజాగ్‌’ ప్రసాద్‌ ఇకలేరు

22 Oct, 2018 01:45 IST|Sakshi
‘వైజాగ్‌’ ప్రసాద్‌

ప్రముఖ నటుడు ‘వైజాగ్‌’ ప్రసాద్‌(75) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం గుండెపోటుతో మృతిచెందారు. తెల్లవారుజామున బాత్‌రూంకు వెళ్లిన ఆయన అక్కడే పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రసాద్‌ స్వస్థలం విశాఖపట్నంలోని గోపాలపురం. ఆయన అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు. కళా రంగంలో ‘వైజాగ్‌’ ప్రసాద్‌గా స్థిరపడ్డారు. 

1963లో నాటక రంగంలోకి ప్రవేశించిన ఆయన ‘అప్పు పత్రం, భలే పెళ్లి, భజంత్రీలు, కాల ధర్మం, ఆకలి రాజ్యం, హెచ్చరిక, వేట కుక్కలు, కాలకూటం, ఋత్విక్, గరీబీ హఠావో’ లాంటి నాటికలతో ప్రేక్షకులను అలరించారు. సుమారు 700 నాటికల్లో నటించిన ఆయన 1983లో ‘బాబాయ్‌ అబ్బాయ్‌’ చిత్రం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించారు. ‘నువ్వు నేను, భద్ర, జై చిరంజీవా, గౌరి, నీరాజనం, జెమిని, అల్లరి బుల్లోడు, సుందరకాండ, రాణిగారి బంగ్లా, శివరామ రాజు’ తదితర చిత్రాల్లో ఆయన నటించారు. ప్రసాద్‌కి కుమార్తె రత్నప్రభ, కుమారుడు రత్నకుమార్‌ ఉన్నారు. విషయం తెలుసుకున్న వారు అమెరికా నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కి బయలుదేరారు. ‘వైజాగ్‌’ ప్రసాద్‌ మృతికి ‘మా’ అధ్యక్షులు శివాజీరాజా, జనరల్‌ సెక్రటరీ డా. నరేష్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

మరిన్ని వార్తలు