రచయితలే లేకపోతే మేము లేము

4 Nov, 2019 02:57 IST|Sakshi
పరుచూరి వెంకటేశ్వరరావు, భువన చంద్ర, కాశీ విశ్వనాథ్, సత్యానంద్, చిరంజీవి, సుద్దాల అశోక్‌తేజ

– చిరంజీవి

‘‘నేను పరిచయం చేసిన రచయితలు.. ముఖ్యంగా సత్యానంద్, పరుచూరి బ్రదర్స్, భారవి, హరనాథ్‌బాబు, జంధ్యాలతో పాటు ఇతర రచయితలకు ధన్యవాదాలు. రాబోయే దర్శకులకు కష్టకాలం వచ్చింది. రచయితలు అందరూ దర్శకులయ్యారు. అందుకనే కొత్త రచయితల్ని నమ్ముకోవాల్సిందే’’ అని ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు అన్నారు. ‘తెలుగు సినీ రచయితల సంఘం’ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం ‘వజ్రోత్సవ వేడుకలు’ ఘనంగా జరిగాయి.

ముఖ్య అతిథిగా హాజరైన హీరో చిరంజీవి చేతులమీదుగా సీనియర్‌ రచయితలు ఆదివిష్ణు, రావికొండలరావు, సత్యానంద్, భువనచంద్రలకు జీవిత సాఫల్య పురస్కారాలు అందజేశారు. చిరంజీవి మాట్లాడుతూ– ‘‘సినీపరిశ్రమలో దర్శక–నిర్మాతల తర్వాత అత్యధికంగా గౌరవించేది, సన్నిహితంగా ఉండేది రచయితలతోనే. పరుచూరి బ్రదర్స్, సత్యానంద్‌గారికి అది తెలిసిందే. రచయితలే లేకపోతే మేం లేం అనేది వాస్తవం. ఈ మధ్య దీపావళికి మోహన్‌బాబు ఇంటికి వెళ్లాం. అక్కడ వెండి సింహాసనంపై సత్యానంద్‌ను కూర్చోబెట్టారు రాఘవేంద్రరావుగారు.

అది చూశాక.. కరెక్టేకదా.. ఆ స్థానం అలంకరించే అర్హుడు సత్యానంద్‌ అనిపించింది. సింగీతం శ్రీనివాసరావు, విశ్వనాథ్‌గారు రాకపోవడం లోటుగా భావిస్తున్నా. వారిద్దరూ మనకు నిధి లాంటివారు. ‘మాయాబజార్‌’ నుంచి ఈ కాలం వరకు ఉన్నారు. వారిని సన్మానించుకునే అవకాశం నాకు ఇస్తే బాగుంటుంది’’ అన్నారు. నటుడు మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘ రచయితలు సరస్వతీ పుత్రులు. వారిని సన్మానించే కార్యక్రమంలో పాల్గొంటానని కలలో కూడా ఊహించలేదు. నేను మొదట అప్రెంటీస్‌గా పనిచేసింది ఎం.ఎం. భట్‌గారి దగ్గర. అక్కడే శ్రీశ్రీగారు పరిచయం. ఆ తర్వాత ఆరుద్రగారు. ఆయన ఎన్నో సిల్వర్‌జూబ్లీలు ఇచ్చారు. కానీ ఆరుద్రగారి చివరిరోజు ఏ నిర్మాత రాలేదు.

తొలి అవకాశం కోసం నేను వెంటపడింది సత్యానంద్‌గారినే. నాకు తండ్రిలాంటి దాసరి నారాయణరావుగారు, సోదరుడు రాఘవేంద్రావుగారితో పాటు దర్శకుల ఆశీస్సులతోనే ఈ స్థితిలో ఉన్నా. మనకంటే ఎందరో అందగాళ్లు, మేథావులున్నారు. కళామతల్లి మనకు అవకాశం ఇచ్చింది.. దాన్ని కాపాడుకుందాం’’ అన్నారు.  ఈ కార్యక్రమంలో తనికెళ్ల భరణి, డా.పాలకేడేటి సత్యనారాయణ, విజయేంద్రప్రసాద్‌లకు గౌరవ పురస్కారాలు అందజేశారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, పోసాని కృష్ణమురళీ, ఆకుల చంద్రబోసు, సుద్దాల అశోక్‌తేజ, జెకె. భారవి, ఆకుల చిన్నికృష్ణ, అనంత శ్రీరామ్, భాస్కరభట్ల, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌లతో పాటు పలువురు రచయితలకు విశిష్ట రచనా పురస్కారాలు అందించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా