చిత్రపరిశ్రమ అభివృద్ధికి జగన్‌గారు ముందుంటానన్నారు

10 Jun, 2020 01:13 IST|Sakshi
మంగళవారం తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమైన సినీ ప్రముఖులు చిరంజీవి, సురేశ్‌బాబు, నాగార్జున, కల్యాణ్, దామోదర్, రాజమౌళి, దిల్‌రాజు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంగీకారం

జూలై 15 తర్వాత షూటింగ్‌లకు అనుమతి

ఆన్‌లైన్‌లోనే సినిమా టికెట్ల జారీ

విశాఖలో స్టూడియోల నిర్మాణం

సీఎంతో సినీ ప్రముఖుల భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని వెల్లడి

థియేటర్ల ఫిక్స్‌డ్‌ పవర్‌ చార్జీల రద్దు అభినందనీయం: చిరంజీవి

‘ఆంధ్రప్రదేశ్‌లో సినిమాల చిత్రీకరణకు సింగిల్‌ విండో విధానం తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిగారికి తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాం. టాలీవుడ్‌ ప్రముఖులంతా ఏడాదిగా జగన్‌గారిని కలవాలనుకున్నాం కానీ కుదరలేదు. ఈ రోజు కలిశాం’ అని హీరో చిరంజీవి అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు పెద్దలు మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ– ‘‘కరోనా లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం.ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ఈ నెల 15నుంచి చిత్రీకరణలు జరుపుకునేందుకు సీఎం కేసీఆర్‌గారు వెసులుబాటు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చిత్రీకరణలకు అనుమతి ఇవ్వాలని జగన్‌గారిని కోరగానే అనుమతి ఇవ్వడం సంతోషం. షూటింగ్‌లకు సంబంధించి విధి విధానాలు రూపొందించేందుకు మంత్రి పేర్ని నాని, అధికారులతో చర్చిస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లలో మినిమమ్‌ ఫిక్స్‌డ్‌ ఛార్జీలు భారంగా మారాయని, వాటిని ఎత్తేయాలని కోరగానే సానుకూలంగా స్పందించినందుకు జగన్‌గారికి కృతజ్ఞతలు. నంది అవార్డుల పంపిణీ చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి మేం ప్రోత్సాహం కోరుకుంటున్నామనగానే 2019–20కి అవార్డులు ఇవ్వడానికి నిర్ణయించారు. ఈ ఏడాదిలోనే ఆ వేడుక జరుగుతుందనుకుంటున్నాం.

సినిమా టికెట్ల విషయంలో పారదర్శకత రావాలని కోరాం. టికెట్ల ధరల ఫ్లెక్సీ రేట్లపై దృష్టి పెట్టాలని విన్నవించాం. చెన్నై, ముంబై వంటి నగరాల్లో ఆయా సినిమాలను బట్టి టికెట్ల ధర పెరుగుతూ ఉంటుంది. దీని మూలంగా పెద్ద బడ్జెట్‌ పెట్టే నిర్మాతలకి లాభం ఉంటుంది. ఫ్లెక్సీ రేట్లపై తగు సమయంలో నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. దానివల్ల చిత్ర పరిశ్రమకి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. రానున్న రోజుల్లో అధికారులతో మాట్లాడి, మా సినీ పెద్దలతో మరోసారి మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. అదే జరిగితే పారదర్శకత ఉంటుంది.. ఎక్కడా బ్లాక్‌ మార్కెట్‌ అనేది ఉండదు. మేం అడిగిన చాలా విషయాలకు ఆయన సానుకూలంగా స్పందించారు.

తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చెందడానికి ఎప్పుడూ ముందుంటానని సీఎం చెప్పడం మాకు ఎంతో ఆనందం కలిగించింది. ముఖ్యంగా దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డిగారు వైజాగ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం 300 ఎకరాలు భూమి కేటాయించారు.. ఆ భూమి అలాగే ఉంది. దాన్ని మరోసారి పరిశీలిస్తామని జగన్‌గారు అన్నారు. వైజాగ్‌లో సినిమాల నిర్మాణం చేపట్టాలి, స్టూడియోలు నిర్మించాలి, ఔట్‌ డోర్‌ యూనిట్లు పెట్టాలనుకునేవారిని అన్ని రకాలుగా ప్రోత్సహించి ఉత్సాహపరిచే విధంగా జగన్‌గారు స్పందించిన తీరు చాలా అభినందనీయం. అలా చేస్తే ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతుందనే ఆశాభావం అందరిలోనూ ఉంది. మేం అడిగిన వాటన్నింటికీ సానుకూలంగా స్పందించిన ఆయనకు మా తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాం’’ అన్నారు.


దామోదర్‌ ప్రసాద్, ‘దిల్‌’రాజు, డి.సురేష్‌బాబు, రాజమౌళి, నాగార్జున, చిరంజీవి, పేర్ని నాని, సి. కల్యాణ్‌

విశాఖలో స్టూడియోల నిర్మాణానికి అనుమతి – మంత్రి పేర్ని నాని
సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ– ‘‘సినిమాలకు సంబంధించి ఆన్‌లైన్‌లోనే టికెట్లు జారీ చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిగారు ఆదేశించారు. ఆన్‌లైన్‌ బుకింగ్‌ వల్ల అటు ప్రభుత్వానికి, ఇటు సినీ పరిశ్రమకూ మేలు జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తప్పనిసరి. ఎఫ్‌డీసీ ద్వారా 2000 సంవత్సరం నుంచి చిన్న సినిమాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన  సబ్సిడీ పెండింగ్‌లో ఉందని, దాన్ని విడుదల చేయాలని చేసిన వినతికి జగన్‌గారు సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో సినీ రంగాన్ని ప్రోత్సహించడానికి వీలుగా విశాఖపట్టణంలో సినిమా స్టూడియోలు నిర్మించుకోవాలనుకునే వారికి తక్కువ ధరకు స్థలాలు కేటాయించడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు.

వైజాగ్‌లో స్టూడియోలు, నివాసాలకు సంబంధించి తామంతా మాట్లాడుకుని మరో మారు చెబుతామని సినీ ప్రముఖులు ముఖ్యమంత్రికి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో జూలై 15 తర్వాత సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వనున్నాం. ఇందుకు సంబంధించి త్వరలో విధి విధానాలు విడుదల చేయనున్నాం. సినిమాహాళ్ల పునఃప్రారంభం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తేదీ నుంచే ఉంటుంది.  కరోనా లాక్‌డౌన్‌ సమయంలో సినిమా థియేటర్లు ఫిక్స్‌డ్‌ విద్యుత్‌ ఛార్జీలు చెల్లించాల్సి ఉందని, వాటిని రద్దు చేయాలని సినీ ప్రముఖులు కోరగా జగన్‌గారు అంగీకరించారు. తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించినందుకు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు’’ అన్నారు. సీఎం జగన్‌తో జరిగిన ఈ భేటీలో చిరంజీవితో పాటు హీరో నాగార్జున, నిర్మాతలు సురేశ్‌ బాబు, సి, కల్యాణ్, దామోదర్‌ ప్రసాద్, ‘దిల్‌’ రాజు, డైరెక్టర్‌ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు