నేటి నుంచి షూటింగులు బంద్

19 Oct, 2014 23:27 IST|Sakshi

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సోమవారం నుంచి షూటింగ్స్ జరపరాదని తెలుగు ఫిలిం ఫెడరేషన్ నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం నాడు తమ నిర్ణయాన్ని ఓ ప్రకటనలో తెలియజేసింది.  సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంలో నిర్మాతలకు, ఫెడరేషన్ ప్రతినిథులకు మధ్య కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో ఫిలిం ఫెడరేషన్ ఈ నిర్ణయం తీసుకుందని అధ్యక్షుడు కొమర వెంకటేశ్ పేర్కొన్నారు.  నటీనటులెవరూ ఈ బంద్ కాలంలో చలన చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొనరాదని, ఆ మేరకు సినీ కార్మికులకు సహకరించాలని కోరారు. బంద్ నిర్ణయాన్ని చిత్రపరిశ్రమకు సంబంధించిన వర్గీయులందరికీ ఫ్యాక్స్ ద్వారా తెలియజేస్తున్నామని చెప్పారు. గడచిన నాలుగు రోజులుగా తెలుగు చలన చిత్రాల షూటింగులు జరగడంలేదు. కేవలం ‘బాహుబలి’, గిన్నిస్ రికార్డ్ కోసం తీస్తున్న ‘సరదాగా ఒక సాయంత్రం’ చిత్రాలు ప్రత్యేక అనుమతితో మాత్రమే  షూటింగ్ జరుపుకుంటూ వచ్చాయి. తాజా పరిణామాల వల్ల వీటికి కూడా ఆటంకం కలిగే అవకాశం ఉంది. షూటింగ్ నిలుపు చేయాల్సిందిగా ‘బాహుబలి’ చిత్రబృందానికి కూడా సమాచారం పంపుతున్నామని కొమర వెంకటేశ్ తెలిపారు.