చిచ్చురేపిన సినీ శత వసంతాల వేడుకలు

26 Sep, 2013 03:23 IST|Sakshi
భారతీయ సినిమా శత వసంతాల వేడుకలు సినీ పరిశ్రమలో చిచ్చురేపాయి. పలువురు సినీ  ప్రముఖులకు ఉద్దేశపూర్వకంగానే ఆహ్వానాలను ఆలస్యంగా పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే హాజరైన వారికీ అవమానం జరిగింది. గ్రూపులు, విభేదాలతో కునారిల్లుతున్న టాలీవుడ్‌ను వందేళ్ల వేడుకలైనా ఒకటి చేస్తాయని భావించిన వారికి నిరాశే మిగిలింది.
 
చెన్నై, సాక్షి ప్రతినిధి: భారతీయ సినిమా శత వసంతాల వేడుకలు దక్షిణ భారత సినీ వాణిజ్యమండలి ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు చెన్నైలో జరిగాయి. ఈ సంబరాలు నిర్వాహకులకు సంతోషాన్ని, లబ్ధిని చేకూర్చినా, ఆహ్వాన గ్రహీతలకు అవమానం మిగిల్చాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వందేళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే ఇటువంటి వేడుకలకు హాజరుకాని వారిది దౌర్భాగ్యం అంటూ మండలి అధ్యక్షులు సి.కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను పరిశ్రమ పెద్దలు మరోరకంగా స్వీకరించారు. హాజరై అవమానానికి గురైనవారు తమది దౌర్భాగ్యమని, హాజరుకాకపోవడమే భాగ్యమని కల్యాణ్ మాటలను తిప్పికొట్టారు. 
 
అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, దాసరి నారాయణరావులది దౌర్భాగ్యమా అని ప్రశ్నిస్తున్నారు. కొందరు సినీ ప్రముఖులకు ఉద్దేశపూర్వకంగానే ఆహ్వానాలను ఆలస్యంగా పంపినట్లు చెబుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమ వేడుకల్లో కనీసం తెలుగుతల్లి గీతం, ప్రార్థనా గీతం ప్రదర్శించలేదు. పైగా సుమారు గంటసేపు తమిళ కళాకారుడైన శివమణి డ్రమ్స్ వాయిద్యం ఎబ్బెట్టుగా మారింది. ఆహ్వానితుల్లో కె.విశ్వనాథ్, కె.రాఘవేంద్రరావు తదితర సినీ ప్రముఖులను విస్మరించి తమిళ దర్శకులు కె.బాలచందర్‌ను ప్రథమంగా సన్మానించడంపై నటులు, నిర్మాత, దర్శకులు ఆర్.నారాయణమూర్తి అభ్యంతరం లేవనెత్తారు. పెద్దలందరూ కలిసి బలవంతంగా ఆయన్ను నిలువరించారు. నిర్వాహకుల తీరుతో దాసరి, విజయనిర్మల, బ్రహ్మానందం రాష్ట్రపతి సన్మానానికి హాజరుకాలేదు. పరిశ్రమ పెద్దలను సముచితరీతిలో ఆహ్వానించి, సన్మానించకపోగా వారిని తీసి పారేసినట్లు కల్యాణ్ వ్యాఖ్యానించడంపై పరిశ్రమ యావత్తు ఆగ్రహంతో ఊగిపోతోంది. 
 
ఆనాటి సినీ కళాకారులు ఎందరో చెన్నైలో కనీసం తిండికి నోచుకోక అల్లాడుతున్నారు. అలాంటి వారిని వేడుకలకు ఆహ్వానించి ఆర్థిక సహాయం చేయాలన్న మానవతా దృక్పథం మండలి పెద్దలకు లేకుండా పోయిందనే విమర్శలు వచ్చాయి. వేడుకల నిర్వహణకు పీవీపీ సంస్థ రూ.13.5 కోట్లు, తమిళనాడు ప్రభుత్వం రూ.10 కోట్లు, స్పాన్సర్ల ద్వారా జయ టీవీ నుంచి రూ.2 కోట్లు, మరో రూ.3 కోట్లు నిధుల సేకరణ జరిగినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద ఎత్తున నిధుల వసూళ్లు జరిగితే ఖర్చుపెట్టింది పాతిక శాతమేననే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆరు గంటలు సేపు నిర్వహించిన తెలుగు వేడుకల్లో పెద్దలను స్మరించుకునే ప్రసంగాలకే చోటులేకుండా పోయింది. శాటిలైట్ హక్కులను దృష్టిలో ఉంచుకునే డ్యాన్సులు, పాటలకే 90 శాతం చోటిచ్చినట్లు అందరూ భావించారు. దక్షిణాది నాలుగుభాషల్లో మలయాళ పరిశ్రమ మాతృభాష పరిమళాలు ఉట్టిపడే కార్యక్రమాలతో అగ్రతాంబూలం పొందింది. తర్వాతి మూడు స్థానాలు తమిళ, కన్నడ, తెలుగు పరిశ్రమలు పొందాయి.
 
పరిశ్రమ పెద్దల బాయ్‌కాట్
తెలుగుసినీ వేడుకల్లో పొడసూపిన పొరపాట్లను మంగళవారం నాటి ముగింపు సంబరాల్లో సరిదిద్దుకుంటారని అందరూ ఆశించారు. అయితే అంతకు మించి అవమానం ఎదురైంది. ప్రముఖులను గ్యాలరీలో కూర్చొబెట్టారు. రాష్ట్రపతి అవార్డు ఇస్తారని ఒక నిర్మాత చెప్పడంతో లెజండ్ నిర్మాత, నటుడు ముందు వరుస కుర్చీలో కూర్చునేందుకు వచ్చారు. జాబితాలో మీ పేరు లేదంటూ సెక్యూరిటీ సిబ్బంది లేవదీసే ప్రయత్నం చేయడంతో వారు అవమానానికి గురయ్యూరు. మరికొందరు పెద్దలు అప్పటికప్పుడు నిర్ణయించుకుని మంగళవారం మధ్యాహ్నమే హైదరాబాద్ వెళ్లిపోయారు. తెలుగు వేడుకల్లో పాల్గొనాల్సిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, ముగింపు వేడుకలకు హాజరుకావాల్సిన ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి గైర్హాజరు కావడం నిర్వాహకుల డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. ఇలాంటి వేదిక మరో వందేళ్లకు మాత్రమే వస్తుందని మండలి అధ్యక్షులు సి.కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఇటువంటి అరుదైన వేదిక వందేళ్లకు సరిపడా చేదు జ్ఞాపకాలను చరిత్రలో నిలిచిపోయేలా చేసింది.    
 
అనుకున్న స్థాయిలో గౌరవం దక్కలేదు: అంబికా కృష్ణ
శత వసంతాల భారతీయ సినిమా వేడుకల ముగింపు సభలో తెలుగు సినీ పరిశ్రమకు అనుకున్న స్థాయిలో గౌరవం దక్కలేదని సినీ నిర్మాత అంబికా కృష్ణ అన్నారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది ప్రముఖులున్నా వారిని గుర్తించకుండానే కార్యక్రమం జరిగిందని ఆరోపించారు. మరోసారైనా ఇలాంటి పొరపాట్లు జరగకుండా ప్రణాళికను రూపొందించాలని కోరారు. తెలుగు సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న అనిశ్చితి తొలగిపోవాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు చెప్పారు. అంబికా కృష్ణకు ఆలయాధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, లడ్డూ ప్రసాదాలు అందజేశారు.