సినీమహా బిజీ

28 Nov, 2016 22:57 IST|Sakshi
సినీమహా బిజీ

సార్... లొకేషన్ షిఫ్ట్ కాదు, సినిమాయే షిఫ్ట్.
ఆ హీరోయిన్ కాదు సార్... ఇంకో హీరోయిన్.
సార్... దాంట్లో కొట్టారు, దీంట్లో డైలాగే.
సార్... డైరెక్టర్-2 లైన్‌లో ఉన్నారు. డైరెక్టర్-3 హాలులో ఉన్నారు.

డైరెక్టర్-1 సెట్‌లో ఉన్నారు.
అమ్మ బాబోయ్... ఒక్కో హీరో ఒకటి... రెండు... మూడు సినిమాలు చేస్తున్నారు.
సినీమహా బిజీ. ఫ్యాన్‌లకు పండగే.. పండగే.. పండగే!
ఎకో ఎఫెక్ట్ కాదు. సినిమాకో పండగ అని మూడుసార్లు చెప్పాం. అంతే.
కమాన్.. కమాన్.. కమాన్!
ఎంజాయ్.. ఎంజాయ్.. ఎంజాయ్!

150 ఆన్ సెట్స్!
151... 52కి రెడీ!!

హీరోగా చిరంజీవి రీ-ఎంట్రీ ఇస్తున్న సినిమా ఏది? అనడిగితే... ‘ఖైదీ నంబర్ 150’కు ముందు ఎక్కడా ఆన్సర్ దొరకలేదు. నయా ఇన్నింగ్స్ షురూ చేయడానికి స్ట్రయిట్ కథలు, రీమేక్ కహానీలు చిరు చాలానే విన్నారు. పలువురు దర్శక - రచయితలతో చర్చలు జరిపారు. చివరకు, తమిళ ‘కత్తి’ రీమేక్‌తో ఆ చర్చలకు కట్ పడింది. ఇప్పుడు ‘ఖైదీ నంబర్ 150’ షూటింగ్ చకచకా జరుగుతోంది. దీని తర్వాత ఏ సినిమా చేయాలో? చిరు అప్పుడే ఫిక్స్ అయ్యారట! దర్శకుడు బోయపాటి శ్రీనుతో గీతా ఆర్ట్స్‌లో సినిమా చేస్తారని టాక్. గతంలో ‘అన్నయ్య’ సినిమాకు బోయపాటి దర్శకత్వ శాఖలో పని చేశారు. ‘సరైనోడు’తో ఆయన మెగా ఫ్యామిలీకి మరింత దగ్గరయ్యారు. ఇటీవలే చిరుని కలసి బోయపాటి కథ చెప్పడం, ఆయన అంగీకరించడం జరిగాయట! మరోవైపు ఆ మధ్య ‘‘150వ సినిమా’’కి కథ రెడీ చేసిన పూరి జగన్నాథ్ కూడా మెగాస్టార్‌తో సినిమా తీయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. చిరుకి చెప్పిన ‘ఆటో జానీ’ కథకు ఇప్పుడు మార్పులూచేర్పులూ చేస్తున్నారట! దీంతో పాటు ఈ ప్రయత్నంలో  విన్న రెండు, మూడు కథల్లో నటించే ఉద్దేశం చిరుకి ఉందట!

101 క్యూలో పట్టాలెక్కేది ఏది?
ఓ క్రికెటర్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఎన్ని ఆడినప్పటికీ.. సెంచరీకి ఉండే స్పెషాలిటీ వేరు. హీరోల అభిమానులూ అంతే. తమ హీరో ఎన్ని హిట్ సిన్మాలు చేసినప్పటికీ.. వందో సిన్మాను చాలా స్పెషల్‌గా ట్రీట్ చేస్తారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో నందమూరి బాలకృష్ణ ప్రేక్షకులకూ, అభిమానులకూ స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. వందో సినిమాగా శాతకర్ణి కథ పట్టాలు ఎక్కడానికి ముందు, బాలకృష్ణ పలు కథలు విన్నారు. దర్శకులు సింగీతం శ్రీనివాసరావుతో ‘ఆదిత్య 999’, కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రైతు’, అనిల్ రావిపూడితో ‘రామారావుగారు’... వందో సినిమాకు పలు కథలు, కాంబినేషన్‌లు తెరపైకి వచ్చాయి. బాలకృష్ణ స్వయంగా పలు సందర్భాల్లో ఆయా సినిమాల గురించి చెప్పారు. బహుశా.. సెంచరీ కొట్టిన తర్వాత వీటిలో ఏదో ఒకటి వెంటనే ప్రారంభం అవుతుందని వినికిడి! బాలకృష్ణతో ‘లెజెండ్’ తీసిన వారాహి చలన చిత్రం, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు వందో చిత్రాన్ని నిర్మించాలనుకున్నాయి. కుదరలేదు కనుక, ఇప్పుడు నెక్స్ట్ సినిమా అయినా నిర్మించాలనుకుంటున్నారట. అయితే.. భవ్య క్రియేషన్స్ అధినేత వి. ఆనంద్ ప్రసాద్ 101వ చిత్రం నిర్మించనున్నారని టాక్.

అదే జోరుతో...
కథ నచ్చితే చాలు.. క్యారెక్టర్‌లో హీరోయిజం ఎంతుంది? దర్శకుడి అనుభవం ఎంత? అనేవి నాగార్జున పట్టించుకోరు. మంచి ముహూర్తం చూసి సినిమాకి కొబ్బరికాయ కొడతారు. సీనియర్ హీరోల్లో మంచి స్పీడు మీదుంది నాగార్జునే. ఈ ఏడాది ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘ఊపిరి’, ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రాల్లో నటించారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటిస్తున్న ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రీకరణ పూర్తి చేశారు. ఇందులో భక్తుడిగా నటించిన ఆయన, దీని తర్వాతి చిత్రంలో జనాలను భయపెడుతూ, నవ్వించనున్నారు. ఓంకార్ దర్శకత్వంలో హారర్ చిత్రం ‘రాజుగారి గది-2’కి రెండు రోజుల క్రితమే పూజచేశారు. తర్వాత ‘సోగ్గాడే చిన్ని నాయనా’ దర్శకుడు కల్యాణ్‌కృష్ణతో ఆ సినిమా ప్రీక్వెల్ ‘బంగార్రాజు’ చేయనున్నారు. 2017లో కూడా జోరు చూపనున్నారు.

గేరు మార్చారు
అరవై దాటిన తర్వాత వెంకటేశ్‌లో మార్పు వచ్చింది. ఆయన వయసు 55 కదా, 60 అంటున్నారేంటి? అనుకుంటున్నారా! వయసు గురించి కాదండీ... ఇక్కడ చెప్పేది సినిమాల సంగతి. అరవై దాటిన తర్వాత కాస్త నెమ్మదించారాయన. గత ఎనిమిదేళ్లలో వెంకీ పది సినిమాలు చేస్తే, అందులో నాలుగు మల్టీస్టారర్‌లే. డెబ్భై సినిమాలు దాటిన తర్వాత మళ్లీ వెంకీ గేరు మార్చారు. సోలో హీరోగా జోరు చూపించాలని డిసైడ్ అయినట్టున్నారు. హిందీ ‘సాలా ఖడూస్’కి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ‘గురు’ షూటింగ్‌ను కేవలం రెండు నెలల్లో పూర్తి చేశారు. మరోవైపు కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్లూ.. మీకు జోహార్లు’ అంగీకరించారు. ఈ రెండిటి తర్వాత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశాలున్నాయి.

స్వీట్ షాక్
పవన్‌కల్యాణ్ ప్రేక్షకులకూ, మరీ ముఖ్యంగా అభిమానులకూ షాకుల మీద షాకులు ఇస్తున్నారు. అవన్నీ  స్వీట్ షాకులు కావడంతో అందరూ హ్యాపీ. ప్రతి రెండు సినిమాల మధ్య ఎక్కువ విరామం తీసుకునే పవన్, ఇప్పుడు మాత్రం ఓ సినిమా షూటింగ్ పూర్తవక ముందే మరో రెండు సినిమాలకు పూజ చేశారు. పవన్‌లో ఈ స్పీడు చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం కిశోర్ పార్థసాని (డాలీ) దర్శకత్వంలో ‘కాటమరాయుడు’ చేస్తున్నారు పవన్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా, ఆర్.టి. నేసన్ దర్శకత్వం మరో సినిమా ఓకే చేశారు. అంతేనా... ఓ పక్క ‘కాటమరాయుడు’ షూటింగ్ చేస్తూనే, మరోపక్క త్రివిక్రమ్ సినిమాకి డేట్స్ ఇచ్చారు. గతంలో రెండు మూడేళ్ల పాటు ఖాళీగా ఉన్న పవన్, ఒక్క ఏడాదిలో 3 సినిమాలకు పవన్ పూజ చేయడం విశేషమే. 

ఫుల్ క్లారిటీ
‘రౌండప్ చేసి కన్‌ఫ్యూజ్ చెయ్యొద్దు. ఎందుకంటే.. కన్‌ఫ్యూజన్‌లో ఎక్కువ కొట్టేస్తాను’ - ‘బిజినెస్‌మేన్’లో మహేశ్‌బాబు చెప్పిన డైలాగ్ ఆ రీల్ వరకూ మాత్రమే పరిమితం. రియల్ లైఫ్‌లో ఆయన దగ్గర కన్‌ఫ్యూజన్ అనేది లేదు. మీతో ఓ సినిమా చేయాలంటూ మహేశ్‌ను చాలా మంది దర్శకులు రౌండప్ చేస్తున్నారు. ఆయన మాత్రం చాలా క్లారిటీగా సినిమాలు చేస్తున్నారు. ఒకటి సెట్స్‌పై ఉండగానే మరో సినిమా ఓకే చేసి పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తోన్న మహేశ్, ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ రెండిటి తర్వాత మహేశ్ ఎవరి దర్శకత్వంలో నటిస్తారనే ఆసక్తి చాలామందిలో ఉంది. ఎందుకంటే... అది హీరోగా మహేశ్ కెరీర్‌లో 25వ సినిమా. ఆల్రెడీ దర్శకులు పూరి జగన్నాథ్, వంశీ పైడిపల్లి ఆయనకు కథలు చెప్పారు. ‘మహేశ్ ‘జన గణ మణ’ కథ నచ్చిందన్నారు. కానీ, ఎప్పుడు చేస్తామనేది చెప్పలేదు’ అన్నారు పూరి. మరి, అదే 25వ సినిమా అవుతుందా?

పక్కా ప్లానింగ్
ఓ ప్లానింగ్ ప్రకారం సినిమాలు చేస్తోన్న యువ హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. మొన్నటి వరకూ అతణ్ణి స్టైలిష్ స్టార్ అనేవారు. ఇప్పుడు సౌతిండియన్ స్టార్ అనాలేమో! ‘సరైనోడు’ తర్వాత తెలుగులో సీన్ మారింది. మాస్ ప్రేక్షకులకి కూడా మరింత దగ్గరయ్యారు. అంతేనా.. మలయాళంలో ఎప్పట్నుంచో అల్లు అర్జున్‌కి మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు తమిళంలో కూడా మార్కెట్ సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాథమ్’ చేస్తున్న బన్నీ, దీని తర్వాత లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ సినిమా చేయనున్నారు. ఆ తర్వాత రచయిత వక్కంతం వంశీ లైన్‌లో ఉన్నారు. వంశీ కథకు బన్నీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట.

ఇకపై, నో బ్రేక్!
‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్‌కు మంచి పేరొచ్చింది. కానీ, మూడేళ్లలో ప్రభాస్‌ది ఒక్క సినిమా మాత్రమే విడుదలైందనే వెలితి అభిమానుల్లో ఉన్నట్టుంది. దాంతో ప్రభాస్ నుంచి ఎప్పుడు కమర్షియల్ సినిమా వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి-2’ చిత్రీకరణ పూర్తయ్యాక... ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా, తర్వాత ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా ప్రభాస్ ఓకే చేశారు. ఇకపై బ్రేక్ లేకుండా ఫిల్మ్స్ చేయాలనుకుంటున్నారు.


ఆల్రెడీ.. ట్యూన్స్ రెడీ!
‘ధృవ’గా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకొస్తున్నారు రామ్‌చరణ్. అప్పుడే ఆయన నెక్స్ట్ సినిమాకి రెండు ట్యూన్స్ రెడీ అయ్యాయి. చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ సంస్థ ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం బాణీలు కడుతున్నారు. కథ, పాటలు, దర్శక నిర్మాతలు అంతా రెడీ. త్వరలో హీరోయిన్‌ను ఫైనలైజ్ చేస్తారట. ఆ వెంటనే షూటింగ్ మొదలవుతుందని టాక్. ‘బ్రూస్‌లీ’ రిలీజ్‌కీ, ‘ధృవ’ చిత్రీకరణ ప్రారంభానికీ మధ్య చరణ్ కొన్ని నెలలు విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు విశ్రాంతి తీసుకునేట్లు కనిపించడం లేదు. మొత్తం మీద ఇప్పుడు హీరోలందరూ ఒక డెరైక్టర్‌తో సెట్‌లో ఉండగానే, మరో ఒకరిద్దరు డెరైక్టర్‌‌సతో తర్వాతి ప్రాజెక్ట్‌లు సెట్ చేసుకుంటున్నారు. పెద్ద హీరోలు ఇలా వరుసగా సినిమాలు చేస్తే, పరిశ్రమకూ మంచిదేగా.

ఆల్‌మోస్ట్ బిజీ  హీరోలందరూ ఆల్‌మోస్ట్ బిజీగా ఉంటున్నారు. జ్యోతికృష్ణ దర్శకత్వంలో ‘ఆక్సిజన్’, సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు గోపీచంద్. యువ హీరోల్లో నాగచైతన్య, శర్వానంద్, నాని, వరుణ్‌తేజ్, శర్వానంద్‌ల చేతిలో కూడా రెండేసి సినిమాలున్నాయి. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న నాగచైతన్య, ఆ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమా ఓకే చేశారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ‘నేను లోకల్’ షూటింగ్ చివరి దశకు వచ్చేసరికి, డీవీవీ దానయ్య నిర్మాణంలో ఓ సినిమా మొదలుపెట్టారు నాని. ‘దిల్’ రాజు నిర్మాణంలో రూపొందుతోన్న ‘శతమానం భవతి’ చేస్తున్న శర్వానంద్, బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఓ సినిమాలో పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. ఓపక్క శ్రీనువైట్లతో ‘మిస్టర్’, మరోపక్క శేఖర్ కమ్ములతో ‘ఫిదా’... వరుణ్‌తేజ్ రెండు సినిమాలను ఒకేసారి సెట్స్‌పైకి తీసుకువెళ్లారు. కృష్ణవంశీ ‘నక్షత్రం’లో అతిథిగా నటించిన సాయిధరమ్ తేజ్, ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు, నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న ‘విన్నర్’లో నటిస్తున్నారు.