సినిమా పరిశ్రమ ఏ ఒక్క కుటుంబానికో చెందినది కాదు

18 Jan, 2014 00:50 IST|Sakshi

- ‘రేయ్’ ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్
‘‘ఈ సినిమా కోసం నేను చేసిందేమీ లేదు. చౌదరి, తేజ్ ఓ పట్టుదలతో చేస్తున్నారు కాబట్టి, మానసిక స్థయిర్యం ఇచ్చా. మాట సహాయం చేశా. తేజ్ నా అక్క కొడుకు. తను ఏంబీఎ చేస్తున్నప్పుడు సినిమాల్లో యాక్ట్ చేస్తానంటూ సలహా అడిగాడు. సలహాలిచ్చే స్థాయిలో లేనన్నాను. కాకపోతే, నాకు తెలిసిన యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి పంపించాను. ఓ నటుడు ఏదైనా సాధించాలంటే అతని పట్టుదల, కృషి మీదే ఆధారపడి ఉంటుంది. వారసత్వం, కుటుంబంవల్లా సాధించలేరు. అదే తేజ్‌తో చెప్పాను’’ అన్నారు పవన్ కళ్యాణ్. సాయిధరమ్ తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ యలమంచిలి గీత సమ ర్పణలో బొమ్మరిల్లువారి పతాకంపై స్వీయదర్శకత్వంలో వైవీయస్ చౌదరి నిర్మించిన చిత్రం ‘రేయ్’.
 
 చక్రి స్వరపరిచిన ఈ చిత్రం పాటలను ముఖ్యఅతిథిగా పాల్గొన్న పవన్‌కళ్యాణ్ ఆవిష్కరించి, వైవీయస్ తనయ యుక్తాకి అందించారు. ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ - ‘‘సినిమా పరిశ్రమ ఏ ఒక్క కుటుంబానికో చెందినది కాదు. మా కుటుంబానిది కూడా కాదు. అందుకే, మా కుటుంబం నుంచి వస్తున్న హీరో అనడానికి నేను ఇష్టపడటంలేదు. ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్న కొత్త హీరోకి శుభాకాంక్షలు చెబుతున్నాను. ఈ సినిమాకి రకరకాల కష్టాలొచ్చాయి. మామూలుగా ఎవరైనా నీరసపడిపోతారు.
 
కానీ, వైవీయస్ చౌదరి ఎంతో పట్టుదలతో ఈ సినిమాని పూర్తి చేశారు. ఆయనలో నాకు నచ్చింది ఆయన బలమే. చక్రి పాటలంటే నాకు చాలా ఇష్టం. మంచి ఊపుగా ఉంటాయి. ఈ పాటలు విన్నాను. బాగున్నాయి’’ అన్నారు. వైవీయస్ చౌదరి మాట్లాడుతూ -‘‘స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి ఆదర్శంతో సినిమాల్లోకొచ్చి, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. నేనూ మీలానే పవన్‌కళ్యాణ్‌గారి అభిమానిని. నిజాయితీగా నడుచుకోవడం, నిస్వార్థంగా సహాయం చేయడం, ఎంత పెద్దదైనా సాధించగలమనే స్థయిర్యం పవన్‌కళ్యాణ్ లక్షణాలు. అదే హ్యుమనిజం,.. అదే పవనిజమ్. చాలామంది హీరోల్లా ఆయనకు అభద్రతాభావం లేదు. అలా అభద్రాతాభావం లేకుండా సరైన సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలిగేవారే నిజమైన హీరో. నేను ఆయన్ను కలిసి, మీ మేనల్లుడితో సినిమా చేస్తానన్నాను. పదిహేను, ఇరవై నిమిషాల కథ విని నమ్మకంతో ఈ సినిమా ఒప్పుకున్నారు’’ అన్నారు.
 
 ‘‘చిరంజీవిగారి పట్టుదల, కృషిని, నాగబాబుగారి నిదానాన్ని, నవ్వులను, కళ్యాణ్‌గారి క్రమశిక్షణ, నిబద్ధతను నేర్చుకున్నాను. వీళ్ల చేతుల మీద పెరిగాను. నేను మిమ్మల్ని నిరాశపరచను. ‘రేయ్.. షౌట్ ఫర్ సక్సెస్’ అంటూ మా కళ్యాణ్ మామయ్య నన్ను ప్రోత్సహించారు. ఈ సినిమాకి అవకాశం ఇచ్చిన చౌదరిగారికి ఎన్నిసారు కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు ’’ అని సాయిధరమ్ తేజ్ అన్నారు. ‘‘నా మనవడికి నా పోలిక అంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. తనకు పెద్ద మేనమామ చిరంజీవి పోలిక వచ్చింది’’ అని అంజనా దేవి అన్నారు. ఈ వేడుకలో రమేష్‌ప్రసాద్, జెమినికిరణ్, సుజనా చౌదరి, కొమ్మినేని వెంకటేశ్వరరావు, నరేష్, చక్రి, చంద్రబోస్, శ్రద్ధాదాస్, సయామీ ఖేర్ తదితరులు పాల్గొన్నారు.