ఉదయ్‌ పదిలంగా జనం గుండెల్లో

26 Jun, 2020 19:55 IST|Sakshi

నేడు ఉదయ్‌ కిరణ్‌ 40వ జయంతి

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండానే చిత్రసీమలోకి ప్రవేశం.. అనతికాలంలోనే స్టార్‌డమ్‌.. ఆఫర్లు క్యూ కట్టాయి.. విజయాలు అతడి వాకిట నిలిచాయి.. అవార్డులు దాసోహయ్యాయి.. ‘హ్యాట్రిక్‌ హీరో’ అనే పదం పురుడుపోసుకుంది అతడిని చూశాకనే.. చిన్న వయసులోనే అసాధ్యం అనుకున్న ఎన్నో రికార్డులను తిరగరాశాడు.. కమల్‌హాసన్‌ తర్వాత అతిచిన్న వయసులో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్న తెలుగు హీరోగా గుర్తింపు పొందాడు.. కానీ ఎవరూ ఊహించని విధంగా త్వరగానే తనువు చాలించాడు.. అతడే హీరో ఉదయ్‌ కిరణ్‌.. మరణానికి కారణాలు ఏంటో తెలియవు.. ఉన్న అనుమానాలకు సాక్ష్యాలు లేవు.. నేడు ఉదయ్‌ కిరణ్‌ 40వ జయంతి.. ఫిల్మ్‌ ఇండస్ట్రీ మర్చిపోయినా.. హీరోహీరోయిన్లు తలచుకోకున్నా.. అభిమానులు తమ గుండెల నిండా ఊపిరి పీల్చుకుంటూ తమ అభిమాన హీరోను ఒక్కసారిగా గుర్తుచేసుకుంటూ శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. (మనసును కలిచివేస్తోంది: చిరంజీవి)

‘చిత్రం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఉదయ్‌ కిరణ్‌ ఆ తర్వాత చేసిన నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలు బ్లాక్‌ బస్టర్ హిట్‌గా నిలవడంతో హ్యాట్రిక్‌ హీరోగా గుర్తింపు పొందారు. అంతేకాకుండా అనతికాలంలోనే స్టార్‌ హీరోగా ఎదిగిపోయారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా స్టార్‌ డైరెక్టర్లు, పెద్ద నిర్మాణ సంస్థలు, క్రేజీ హీరోయిన్లతో సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో సంచలనాలకు నాంది పలికాడు. సహచర నటీనటులతో మంచి సాన్నిహిత్యం.. ఎలాంటి రిమార్క్‌ లేని నటుడిగా పేరు గాంచాడు. కేరీర్‌ గ్రాఫ్‌ హైలెవల్లో ఉండగా కొన్ని ఊహించని మలపులు అతడి భవిష్యత్‌ను చిన్నాభిన్నం చేశాయి. ఆ తర్వాత కోలుకోలేదు. సినిమా ఆఫర్లు తగ్గిపోయాయి. నిర్మాణంలో ఉన్న సినిమాలు ఆగిపోయాయి. స్టార్‌డమ్‌ పోయింది.. చేతిలో సినిమాలు లేవు. దీంతో డిప్రెషన్‌ ఆవహించింది. జనవరి 5,2014న శ్రీనగర్‌లోని తన నివాసంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.  ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్య తెలుగునాట పెద్ద సంచలనంగా మారింది. (మరి మీరు ఎటువైపు?: నాని)

ఉదయ్‌ కిరణ్‌ తనువు చాలించి ఆరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ జనం గుండెల్లో భద్రంగా నిలిచే ఉన్నాడు. ఏ యువ హీరో (బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా) సినిమా వచ్చినా.. సినిమా వాళ్లు ఎవరు మరణించినా.. ఆ క్షణం అందరికీ ఉదయ్‌ కిరణే గుర్తొస్తాడు. అభిమానులు కన్నీరు కారుస్తారు. తాజాగా బాలీవుడ్‌ యువ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత ఉదయ్‌ కిరణ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. వీరిద్దరికి దగ్గరి పోలికలు ఉన్నాయి. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే చిన్నవయసులోనే అర్థంతరంగా వాలిపోయారు. ఇద్దరి మరణానికి ఒక్కటే కారణం డిప్రెషన్‌(అందరూ బయటకు చెప్పే కారణం). సుశాంత్‌ చివరి సినిమా దిల్‌ బెచారా మాదిరిగానే ఈ తెలుగు హీరో నటించిన చివరి చిత్రం ‘చిత్రం చెప్పిన కథ’ కూడా ఓటీటీలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. (మాహిష్మతీ రాజ్యమైనా అవి తప్పవు..)

Poll
Loading...
మరిన్ని వార్తలు