బాహుబలి ముహూర్తం ఖరారు

27 Jun, 2013 04:18 IST|Sakshi
బాహుబలి ముహూర్తం ఖరారు
ఒకప్పుడు తెలుగు తెరపై వచ్చినన్ని జానపదాలు, ఇంకే భాషలోనూ రాలేదేమో. అసలు మనలా జానపదాల్ని జనరంజకంగా డీల్ చేయడం ఇంకెవరి వల్లా కాదేమో కూడా. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తెరపై జానపదం సందడి చేయనుంది. వరుస విజయాలతో దర్శకునిగా శిఖరాగ్ర స్థాయికి చేరుకున్న రాజమౌళి ఓ డ్రీమ్ ప్రాజెక్ట్‌లాగా, ఓ తపస్సులాగా జానపద నేపథ్యంలో ‘బాహుబలి’ సినిమా చేస్తున్నారు.
 
  పూర్వ నిర్మాణ పనులు శరవేగంతో జరుగుతున్నాయి. ప్రభాస్ అయితే ఈ సినిమా కోసం ఓ దీక్షతో పని చేస్తున్నారు. వేరే సినిమాలు కమిట్ కాకుండా, చాలా ఎక్కువ కాల్షీట్లు ‘బాహుబలి’ కోసం కేటాయించారు. తన గెటప్‌ను మార్చుకోవడంతో పాటు గుర్రపు స్వారీ, కత్తి విద్య కూడా నేర్చుకున్నారు. ఇంకా ప్రారంభం కాకముందే ఈ సినిమాపై అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. 
 
 దానికి తోడు ఏవేవో ఊహాగానాలు, గాలి వార్తలు. ఇవేవీ పట్టించుకోకుండా రాజమౌళి సెలైంట్‌గా తన పని చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఐమ్యాక్స్ కెమెరాతో ‘బాహుబలి’ని చిత్రీకరించబోతున్నారనే వార్తలను రాజమౌళి ఖండించారు. అయితే అత్యాధునిక డిజిటల్ కెమేరాలు ఉపయోగించబోతున్నామని ఆయన తెలిపారు.
 
  అలాగే మూడు రోజుల షూటింగ్ కోసం పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నామనే వార్త కూడా అవాస్తవమని రాజమౌళి ట్వీట్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ‘బాహుబలి’ రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల 6న హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏక సమయంలో చిత్రీకరణ జరపనున్నారు. హిందీ, మలయాళంతో పాటు విదేశీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.