ఎక్కడకు వెళ్లినా సాకేత్‌ అనే పిలుస్తారు

11 Mar, 2020 08:03 IST|Sakshi

సీ‘రియల్‌’

‘మంగమ్మగారి మనవరాలు’ సీరియల్‌లో సాకేత్‌గా బుల్లితెరకు పరిచయం అయిన గుడిబోయిన మధుబాబు అతి త్వరలోనే అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ‘అభిషేకం’, ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు’, ‘రెండు రెళ్లు ఆరు’... ఇలా వరుస సీరియల్స్‌తో ఏడేళ్లుగా బుల్లితెర నటుడిగా బిజీ బిజీగా ఉన్న మధుబాబు తన గురించి పంచుకున్న ముచ్చట్లివి. 

‘‘మంగమ్మగారి మనవరాలు’ సీరియల్‌ వెయ్యికి పైగా ఎపిసోడ్స్‌లో నటించాను. ఆ తర్వాత అభిషేకం సీరియల్‌ మూడువేలకు పైగా దాటింది. దీంతోపాటు జీ టీవీలో వచ్చే అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, జెమినీలో వచ్చే రెండు రెళ్లు ఆరు సీరియల్స్‌లో నటిస్తున్నాను. అన్ని సీరియల్స్‌ టాప్‌ రేటింగ్‌లో నన్ను నిలబెట్టాయి. ఇంతగా బుల్లితెర అభిమానులను సంపాదించుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఎక్కడకు వెళ్లినా నా అసలు పేరుకన్నా సాకేత్‌ అని పిలిచేవారు. ఆ పేరుతోనే ఇప్పటికీ పిలిచేవారున్నారు. 

బీటెక్‌ చేస్తూ..
పుట్టి పెరిగింది వరంగల్‌లోని హన్మకొండలో. చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే పిచ్చి. స్కూల్, కాలేజీల్లో ఏ చిన్న సందర్భం వచ్చినా డ్యాన్స్‌లో ముందుండేవాడిని. హైదరాబాద్‌లో బీటెక్‌ చేశాను. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకున్నాను. కానీ, ఈ ఇండస్ట్రీకి రావాలని ఆలోచనా ఎక్కువ ఉండేది. దానికితోడు స్నేహితుల ప్రోత్సాహం నన్ను ‘యంగ్‌ ఇండియా’ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లేలా చేసింది. సెలక్ట్‌ అయ్యాను. ఆ తర్వాత ‘పవనిజం’ సినిమా చేశాను. ఇప్పుడు ‘సత్యాగ్రాహి’ సినిమాలోనూ నేనే హీరోని. డ్యాన్స్‌ బాగా వచ్చినా నటన కోసం రెండు నెలల పాటు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్‌ నేర్చుకున్నా. 


‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు’ సీరియల్‌లో...

ఉద్యోగం చేయకపోయినా ఏమీ అనలేదు
హైదరాబాద్‌కి వచ్చి పన్నెండేళ్లు అయ్యింది. నేను బీటెక్‌ చదువుకుని ఉద్యోగం చేయకుండా ఈ ఫీల్డ్‌కి వచ్చినందుకు మా ఇంట్లో వాళ్లు ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు. పిల్లల ఇష్టాలకే వదిలేశారు. మా తమ్ముడికి ఆర్ట్‌ అంటే చాలా ఇష్టం. యానిమేషన్‌ నేర్చుకొని ఇప్పుడు జాబ్‌ చేసుకుంటున్నాడు. మాకు ఒక చెల్లి. తను ఇప్పుడు కెనడాలో ఉంటోంది. మా బావ, తను ఇద్దరూ ఫిజియో థెరపిస్ట్‌లు. వాళ్లన్నా, వాళ్ల బాబు లక్కీ అన్నా నాకు చాలా ఇష్టం. 

మద్యం తెచ్చిన ముప్పు
మా నాన్నగారు రైల్వేలో పనిచేసేవారు. అమ్మ గృహిణి. జాలి గుండె. మా నాన్న మందుకు బానిసవడంతో కుటుంబం మొత్తం చాలా సఫర్‌ అయ్యాం. ఆ సమయంలో కొండంత అండగా నిలిచి మా బాగోగులు చూసుకున్న దేవతలాంటి మా అమ్మమ్మ మూడేళ్ల క్రితం దేవుడి దగ్గరకు వెళ్లిపోవడంతో ఆమెను బాగా చూసుకోవా లనుకున్న నాకు చాలా బాధగా ఉంది. మా నాన్న తాగుడు వ్యసనం మూలంగా మా బంధువులు మమ్మల్ని చులకనగా చూసేవారు. అలాంటి తండ్రి మీద ఆశ వదిలేసుకోమనేవారు. కానీ, వదిలిపెట్టకుండా కౌన్సెలింగ్‌ ఇప్పిస్తూ, విరుగుడు మందులు వాడుతూ ఆ మద్యం చెర నుంచి విడిపించి హైదరాబాద్‌ తీసుకువచ్చాను. మంచి ప్లాట్‌ కొనుక్కొని అందరం సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు అమ్మానాన్నలు నా సీరియల్స్‌ చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. మా నాన్నలో వచ్చిన ఈ మార్పు చూసి మా బంధువులంతా ఆశ్చర్యపోతుంటారు. గతంలో వెలివేసినట్టుగా చూసిన వారే ఇప్పుడు మమ్మల్ని గౌరవంగా చూస్తున్నారు. వాళ్లు అప్పుడు మమ్మల్ని అలా నిరుత్సాహపరచడం వల్లే మేము పట్టుదలతో ఎదిగాం అనిపిస్తుంది.

చాలా నిరుత్సాపడ్డాను
టీవీ సీరియల్స్‌ ద్వారా ఇంత పేరు వస్తుందని మొదట్లో అనుకోలేదు. సినిమాలో నిలదొక్కుకోవడానికి చాలానే ప్రయత్నాలు చేశాను. కానీ, కొన్ని సినిమాలు సగం షూటింగ్‌తోనే ఆగిపోయి చాలా నిరుత్సాహపడ్డాను. ముందుగానే అనుకున్న సీరియల్‌ ఆఫర్‌ ఆగిపోయింది. అవకాశాలు లేనప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూశాను. ఓర్పు వహించాను. ఆ తర్వాత ఒకటొకటిగా అవకాశాలు వచ్చాయి. సినిమాల మీద ఉన్న ఇష్టంతో ఆ ప్రయత్నాలూ మానుకోలేదు. పవనిజం తర్వాత ఇప్పుడు సత్యాగ్రాహి సినిమా చేస్తున్నాను. 

సంతోషమే బలం
ఇప్పుడు ఇంట్లో అందరం సంతోషంగా ఉన్నాం. మా అమ్మ జీవితంలో చాలా బాధలు పడింది. ఆమెను సంతోషంగా చూసుకోవాలి. మా కుటుంబాన్ని అర్ధం చేసుకుని మాతో ఫ్రీగా కలిసిపోయే అమ్మాయి భార్యగా రావాలనుకుంటున్నాను.  వస్తున్న అవకాశాలు అందుకుంటూ ఇలా సీరియల్స్, సినిమాలు చేసుకుంటూ రోజులు హ్యాపీగా గడిపేయాలనుకుంటున్నాను.’’
– సంభాషణ: నిర్మలారెడ్డి


 

మరిన్ని వార్తలు