సినీ నటుడు విశాల్‌ విడుదల

20 Dec, 2018 19:28 IST|Sakshi
నటుడు విశాల్‌

చెన్నై: సినీ నటుడు, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ను పోలీసులు విడుదల చేశారు. అలాగే టీనగర్‌లోని నిర్మాతల మండలి కార్యాలయానికి ఎవరూ వెళ్లరాదని పోలీసులు ఆంక్షలు విధించారు. నిర్మాతల మండలి కార్యాలయం చుట్టుపక్కల 144 సెక్షన్‌ అమలు చేశారు. టీన‌గ‌ర్‌లో ఉన్న నిర్మాతల మండలి కార్యాలయం త‌లుపులను బ‌ల‌వంతంగా తెరిచేందుకు విశాల్ ప్రయ‌త్నించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు విశాల్‌ను అదుపులోకి తీసుకున్న సంగతి తెల్సిందే. అనంతరం దగ్గరలో ఉన్న తైనాంపేట పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. పైరసీని అడ్డుకోవడంలో విశాల్‌ విఫలమయ్యారని, నిధులను దుర్వినియోగపరచడం, నిర్మాతల సమస్యల్ని పరిషర్కించడంలో కూడా విఫలమయ్యారని ఆరోపిస్తూ కొంత మంది నిర్మాతలు విశాల్‌ను రాజీనామా చేయాలని ఆందోళన చేస్తున్నారు. (హీరో విశాల్‌ అరెస్ట్‌..)

ఈ విషయమై కొంతకాలంగా వివాదం నడుస్తోంది. చినికి చినికి వివాదం ముదిరి పెద్దదిగా మారింది. పోలీస్‌ స్టేషన్‌ నుంచి విడుదలైన అనంతరం విశాల్‌ విలేకరులతో మాట్లాడారు. తమ కార్యాలయానికి ఎవరో తాళాలు వేస్తే అడ్డుకోని పోలీసులు వాటిని తొలగించేందుకు వెళితే అరెస్ట్‌ చేయడం దారుణమన్నారు. నిర్మాతల మండలి ఐక్యతలో చీలికలు తెచ్చేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఇళయరాజా సంగీత విభావరి ద్వారా నిర్మాతల మండలికి నిధుల సేకరణను అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళయరాజా కార్యక్రమం నిర్వహించే తీరుతామని స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు