తెలుగు టీవీ నటికి కరోనా పాజిటివ్‌

1 Jul, 2020 15:30 IST|Sakshi

హైదరాబాద్‌: కరోనాతో తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో టీవీ పరిశ్రమ ముందు వరుసలో ఉంటుంది. లాక్‌డౌన్‌ కారణంగా గత మూడు నెలలుగా వాయిదా పడ్డ షూటింగ్‌లకు ప్రభుత్వం కొన్ని సడలింపులతో అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కరోనా మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే ఇద్దరు టీవీ నటులకు కరోనా  సోకడంతో సినీ పరిశ్రమలో కలకలం రేగింది. ఇక యాంకర్ ఓంకార్‌కి కరోనా అంటూ వార్తలు రాగా.. అవి పుకార్లుగానే తేలాయి. అయితే తాజాగా మరో టీవీ నటికి కరోనా సోకినట్లు తెలిసింది. మా టీవీలో ప్రసారం అవుతోన్న ‘ఆమె కథ’ సీరియల్‌ హీరోయిన్‌ నవ్య స్వామికి కరోనా పాజిటివ్‌గా తేలింది. గత మూడు, నాలుగు రోజులుగా ఆమె తలనొప్పి, అలసటతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కరోనా టెస్టు చేయించగా.. పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌లో ఉన్నారు.('నాకు ఆరు నెలల ముందే కరోనా వచ్చింది')

ఈ సందర్భంగా నవ్య స్వామి మాట్లాడుతూ.. ‘గత రాత్రి నుంచి ఉదయం వరకు నేను ఏడుస్తూనే ఉన్నాను. రాత్రంతా నిద్ర పోలేదు. నా బాధ చూసి మా అమ్మ కూడా ఏడుస్తూనే ఉంది. నా ఫోన్‌ బిజీగా ఉంది. కాల్స్‌ వస్తూనే ఉన్నాయి. చాలా మందితో మాట్లాడాను. నా వాట్సాప్‌ మొత్తం కరోనా లక్షణాలు, చికిత్సకు సంబంధించిన మెసేజ్‌లతో నిండిపోయింది. అంతా గందరగోళంగా ఉంది. నా సహనటులు, ఇతర సిబ్బందిని ఇబ్బందుల్లోకి నెట్టినందుకు చాలా బాధపడుతున్నాను. శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువ బలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారంతా ధైర్యంగా ఉండాలని కోరుతున్నాను’ అన్నారు నవ్య. రెండు వారాల నుంచి ఆమె టీవీ సీరియల్స్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. నవ్యకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమెతో పాటు షూటింగ్‌లో పాల్గొన్న వారందరికి పరీక్షలు చేశారు. ప్రస్తుతం వారంతా హోం క్వారంటైన్‌లో ఉన్నారు.(అనుబంధాలకు ‘కఠిన కారాగార’ శిక్ష)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు