రోడ్డు ప్రమాదంలో యువ సినీ హీరో దుర్మరణం

30 Jun, 2017 08:21 IST|Sakshi


► బీబీనగర్‌ వద్ద ఘటన
► మృతుడి స్వస్థలం వరంగల్‌లోని శివనగర్‌
► స్వగృహానికి చేరుకున్న మృతదేహం


ఖిలా వరంగల్‌:  సినీరంగంలో హీరో స్థాయికి ఎదిగిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన ఓరుగల్లు బిడ్డను చిరుప్రాయంలోనే మృత్యువు కబళించింది. తన ఆశయం నెరవేరకుండానే రోడ్డు ప్రమాదంతో అనంతలోకాలకు వెళ్లిపోయాడు. ఈ ఘటన వరంగల్‌–హైదారాబాద్‌ జాతీయ రహదారిపై యదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ వద్ద బుధవారం రాత్రి జరిగింది. బంధువులు, మిత్రులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వరంగల్‌ రైల్వేగేట్‌ ప్రాంతం 18వ డివిజన్‌ శివనగర్‌కు చెందిన సరోహా రూపేష్, ఫరిజానా(ఫాతిమా) దంపతులకు ఇద్దరు కుమారులు అస్లాం (ఖరన్‌సింగ్‌) (21), సల్మాన్‌ఉన్నా రు. మూడేళ్ల కిత్రం చిన్నపాటి ఉద్యోగం  చేసేందుకు అస్లాం హైదరాబాద్‌కు వెళ్లాడు.

అక్కడ మిత్రుడి సహకారంతో సినిమా రంగంలో ఆర్టిస్టుగా పని చేస్తున్నాడు. గత ఏడాది నుంచి ప్రేమమయం సినిమాకు హీరోగా నటిస్తున్నాడు.  ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని ఆడియో ప్రారంభం, వచ్చే నెల సినిమా విడుదలకు సిద్ధం చేశారు. రంజాన్‌ పండుకు అస్లాం హైదరాబాద్‌ నుంచి శివనగర్‌లోని తన  ఇంటికి వచ్చాడు. బుధవారం సాయంత్రం కాజీపేటకు చెందిన తన బాల్యమిత్రుడితో కలిసి ఇద్దరు ద్విచక్రవాహనంపై హైదారాబాద్‌కు బయల్దేరారు. ఈక్రమంలో హన్మకొండ–హైదరాబాద్‌ ప్రధాన జాతీయ రహదారిపై బిబీనగర్‌ సమీపంలో ద్విచక్రవాహనం ఆదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.


ఈ ఘటనలో అస్లాంకు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా అతడి మిత్రుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రున్ని వెంటనే సికిందరాబాద్‌లోని ఎంజీఎంకు తరలించారు. అస్లాం మృతదేహం పోస్టుమార్టం పూర్తి చేసుకుని గురువారం సాయంత్రం శివనగర్‌లోని తన స్వగృహానికి చేరుకుంది. పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు, సినిమా ప్రముఖులు తరలివచ్చి మృతదేహాన్ని సందర్శించి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పరామర్శించిన వారిలో మెట్టు శ్రీనివాస్, మర్రి శ్రీనివాస్,ప్రవీణ్, శ్రీరాం రాజేష్, కార్పొరేటర్‌ శామంతుల ఉషశ్రీపద్మ, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.