డ్రగ్స్‌ అమ్మేవాళ్లను పట్టుకోవాలి... తీసుకునేవాళ్లను కరెక్ట్‌ చేయాలి

12 Jul, 2017 23:24 IST|Sakshi
డ్రగ్స్‌ అమ్మేవాళ్లను పట్టుకోవాలి... తీసుకునేవాళ్లను కరెక్ట్‌ చేయాలి

– డి. సురేశ్‌బాబు
ఓ స్టంట్‌ మాస్టర్‌... ఇద్దరు నిర్మాతలు... ముగ్గురు యువ హీరోలు... నలుగురు దర్శకులు... మొత్తం పది మంది సినీ ప్రముఖులకు డ్రగ్స్‌ కేసులో తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ నోటీసులు జారీ చేసిందనే వార్త తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనూ, ప్రజల్లోనూ సంచలనమైంది. ఈ వార్తలపై తెలుగు సినిమా పెద్దలు స్పందించారు. డ్రగ్‌ కల్చర్‌ను ప్రోత్సహించేది లేదని స్పష్టం చేశారు.

బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత డి. సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘డ్రగ్స్‌ విషయంలో ప్రభుత్వం, పోలీసులు ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్న తీరు అభినందనీయం. స్కూల్స్, ఐటీ కంపెనీలు, ప్రతిచోటా చాలా సెన్సిబుల్‌గా హ్యాండిల్‌ చేస్తున్నారు. సమస్యను సమూలంగా నిర్మూలించేందుకు కృషి చేస్తున్నారు. ముందు డ్రగ్స్‌ సప్లై చేసేవారిని పట్టుకోవాలి. తర్వాత డ్రగ్స్‌ తీసుకునేవాళ్లను కరెక్ట్‌ చేయాలి. మా ఇండస్ట్రీలోనూ అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే సరి చేయాలి. దీనికోసం అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తాం. మా తరఫున ఎలాంటి సహాయం చేయడానికైనా రెడీ’’ అన్నారు.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘‘సమాజంలోనూ, చిత్ర పరిశ్రమలోనూ 0.001 శాతం మంది డ్రగ్స్‌కి బానిసలయ్యారనే వార్త విచారకరం. దాన్ని కూడా నిర్మూలించాలి. ప్రభుత్వ సూచనలను సీరియస్‌గా తీసుకోవాలి. అయితే... ఈ సమస్యను సెన్సేషన్‌ చేసి, వాళ్లనూ–వీళ్లనూ అరెస్ట్‌ చేసి, హడావిడి చేయకుండా ప్రభుత్వాధికారులు ఎంతో సెన్సిబుల్‌గా వ్యవహరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. చిత్ర పరిశ్రమలోని పది–పదిహేను మంది వల్ల సినిమా రంగం అంతటికీ చెడ్డ పేరొస్తుంది. దీనిపై వాళ్లంతా ఆలోచించుకోవాలి. తొలిసారి డ్రగ్స్‌ను టేస్ట్‌ చేయాలనుకుని, తర్వాత వాటికి బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అసలు డ్రగ్స్‌ను టేస్ట్‌ చేయకుండా ఉండడమే ఉత్తమం’’ అన్నారు.

‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ– ‘‘మంచి పనులు చేయడంలో తెలుగు చిత్రసీమ ఎప్పుడూ ముందుంటుంది. గతంలో ‘నీరు–మీరు’, ‘హుదూద్‌’, మొక్కలు నాటే కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు డ్రగ్స్‌ మహమ్మారిని తరిమేయాలని అనుకుంటున్నాం. తెలుగు చిత్రసీమలో ముప్ఫైవేలమంది కార్మికులున్నారు. వాళ్లలో 0.001 శాతం మంది డ్రగ్స్‌ వాడటం వల్ల ఆ ప్రభావం అందరి మీదా పడుతోంది. దీనికి పరిష్కార మార్గం ఆలోచించే ప్రయత్నంలో ఉన్నాం’’ అన్నారు.

రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘మన సొసైటీలో సినిమా జనాల సంఖ్య చాలా తక్కువైనా... ఇండస్ట్రీ అంతా పర్‌ఫెక్ట్‌గా ఉండాలన్నది మా తాపత్రయం. అలాగే, ప్రజలు కూడా మన ఇంట్లో ఎవరూ డ్రగ్స్‌ తీసుకోవడం లేదు కదా.. పక్కింటి పిల్లలు తీసుకుంటే మనకేంటి? అని వదిలేయొద్దు. వాళ్లను మందలించండి. వాళ్ల పేరెంట్స్‌కి చెప్పండి. అందులో తప్పు లేదు. వాళ్లూ మన పిల్లలే అనుకుని, ముందడుగు వేస్తే సొసైటీ నుంచి డ్రగ్స్‌ మహమ్మారిని తరిమేయొచ్చు’’ అన్నారు. ‘మా’ సభ్యులు శ్రీకాంత్, ‘సీనియర్‌’ నరేశ్, ఏడిద రాజా పాల్గొన్నారు.

ముంబయ్‌ టు హైదరాబాద్‌ వయా రేవ్‌ పార్టీస్‌!
డ్రగ్‌ కల్చర్‌ రేవ్‌ పార్టీల ద్వారా ముంబయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిందని అల్లు అరవింద్‌ అన్నారు. డ్రగ్స్‌కు యంగ్‌స్టర్స్‌ ఎలా ఎడిక్ట్‌ అవుతున్నారనే విషయం గురించి ఆయన మాట్లాడుతూ– ‘‘ముంబయ్‌లోని ఓ యంగ్‌స్టర్‌ను నేను ఓసారి ఏంటిది? అని ప్రశ్నిస్తే... ‘అంకుల్‌! రేవ్‌ పార్టీలకు వందలమంది వెళ్తుంటారు. అందులో నలుగురో... పది మందో... సపరేట్‌గా పక్కకు వెళ్లి డ్రగ్స్‌ తీసుకుంటారు. తర్వాత మళ్లీ కలిసినప్పుడు డ్రగ్స్‌ అంటే ఆసక్తి ఉన్నోళ్లను తమ బ్యాచ్‌లోకి లాక్కునేందుకు ప్రయత్నిస్తారు.

ఇదంతా వందలో 20, 30 మందికి తెలుస్తుంది’ అన్నాడు. అలాంటి రేవ్‌ పార్టీలు మన దగ్గర కూడా జరుగుతున్నాయని చెప్పడానికి విచారిస్తున్నా. యువతకు నేను చేసే హెచ్చరిక ఏంటంటే... రేవ్‌ అండ్‌ డ్రగ్స్‌ పార్టీల నుంచి తప్పుకోండి. ‘మేం కళ్లు మూసుకుని పాలు తాగుతున్నాం. ఏం ఫర్వాలేదు’ అనుకోకండి. డ్రగ్స్‌ వలలో ఎవరెవరు ఇన్వాల్వ్‌ అయ్యారనేది ప్రభుత్వానికి తెలుసు. వాళ్ల దగ్గర మీ లిస్టుంది. మీ జీవితాలు నాశనమవుతాయి. మీ ఫ్యామిలీ బాధ్యత తీసుకుని మిమ్మల్ని (డ్రగ్‌ ఎడిక్ట్‌ యంగ్‌స్టర్స్‌) కంట్రోల్‌ చేస్తుందో... మిమ్మల్ని మీరు కంట్రోల్‌ చేసుకుంటారో మీ ఇష్టం’’ అన్నారు.