'తేరా సురూర్' మూవీ రివ్యూ

11 Mar, 2016 14:33 IST|Sakshi
'తేరా సురూర్' మూవీ రివ్యూ

టైటిల్ : తేరా సురూర్
జానర్ : రొమాంటిక్ థ్రిల్లర్
తారాగణం : హిమేష్ రేష్మియా, ఫరా, నసీరుద్దీన్ షా,  
సంగీతం : హిమేష్ రేష్మియా
దర్శకత్వం : షాన్ అర్రాన్హ్
నిర్మాత : విపిన్ రేష్మియా, సోనియా కపూర్


బాలీవుడ్లో సింగర్గా ఎంట్రీ ఇచ్చి తరువాత నటుడిగా మారిన హిమేష్ రేష్మియా, దాదాపు దశాబ్ద కాలంగా స్టార్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే ఆప్ సురూర్, కర్జ్, ద ఎక్స్పోజ్ లాంటి సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన హిమేష్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా మాత్రం ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉన్నాడు. తాజాగా ఆప్ కా సురూర్ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కిన తేరా సురూర్ సినిమాతో హిమేష్ సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ సారైనా హిమేష్ కోరుకుంటున్న సక్సెస్ సాధించాడా..?  లేక సంగీత దర్శకుడిగానే మిగిలిపోయాడా..?

2007లో రిలీజ్ అయిన మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ఆప్ కా సురూర్ కు సీక్వెల్గా తెరకెక్కిన సినిమా తేరా సురూర్. ఆ సినిమా కథకు ఎలాంటి కంటిన్యూటీ కాకపోయినా దాదాపు అదే తరహా కథాంశంతో ఈ సీక్వెల్ను తెరకెక్కించారు. రఘు ( హిమేష్ రేష్మియా) తనకు కాబోయే భార్యను జైలు నుంచి విడిపించడానికి చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ. డ్రగ్స్ కేసులో అరెస్టై డబ్లిన్ జైల్లో శిక్ష అనుభవిస్తుంటుంది తారా( ఫరా). తారాను జైలు నుంచి తప్పించడానికి సాంటినో( నసీరుద్దీన్ షా) సాయం తీసుకుంటాడు రఘు. ఈ పాయింట్నే భారీ యాక్షన్ సీన్లు, లావిష్ లోకేషన్లతో గ్రాండ్గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ బాడీతో డిఫరెంట్ లుక్లో కనిపించిన హిమేష్ సినిమాకు మరో ఎట్రాక్షన్.
 
తన ప్రతీ సినిమా లాగే మరోసారి అద్భుతమైన మ్యూజిక్తో ఆకట్టుకున్నాడు హిమేష్. ఈ సారి కూడా హిమేష్లోని నటుడిపై తనలో సంగీత దర్శకుడిదే పై చేయి అయ్యింది. ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన ఫరా స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. పర్ఫామెన్స్కు పెద్దగా స్కోప్ ఉన్న పాత్ర కాకపోవటంతో ఉన్నంతలో పరవాలేదనిపించింది. సీనియర్ నటులు నసీరుద్దీన్ షా, శేఖర్ కపూర్ల నటన సినిమాకు ప్లస్ అయ్యింది. అయితే సినిమాకు ఎంచుకున్న కథ అంత బలంగా లేదు. చిన్న పాయింట్ను భారీ ఖర్చుతో తెర మీద చూపించే ప్రయత్నం చేశారు. కానీ అది పెద్దగా వర్క్ అవుట్ అయినట్టుగా కనిపించలేదు. ఆప్ కా సురూర్ సినిమా నచ్చిన వారిని తేరా సురూర్ కూడా ఆకట్టుకునే అవకాశం ఉన్నా భారీ సక్సెస్ సాధించే స్థాయి మాత్రం సాధ్యం కాకపోవచ్చు.