రజనీ విముఖత చూపారా?

5 Feb, 2019 08:36 IST|Sakshi

పెరంబూరు: నటుడు రజనీకాంత్, కేంద్ర మంత్రి పక్కన కూర్చునేందుకు విముఖత చూపారా? ప్రస్తుతం ఇదే అంశం చర్చనీయంశంగా మీడియాలో వైరల్‌ అవుతోంది. సంగీతజ్ఞాని ఇళయరాజా 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన్ని నిర్మాతల మండలి ఘనంగా సత్కరించింది. శని, ఆదివారాల్లో నందనంలోని వైఎంసీఏ మైదానంలో జరిగిన ఈ బ్రహ్మండ సంగీత కార్యక్రమంలో ఆదివారం సూపర్‌స్టార్‌ రజనీకాంత్, కమల్‌హాసన్, కేంద్ర మంత్రి పొన్‌.రాధాకృష్ణన్, సంగీత దర్శకుడు ఏఆర్‌.రెహ్మాన్, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా నటుడు రజనీకాంత్‌ విశ్చేశారు. ఆ తరువాత వచ్చిన కేంద్ర మంత్రి పొన్‌.రాధాకృష్ణన్‌ రజనీకాంత్‌ను చూసి చిరునవ్వుతో ఆయన పక్కన కూర్చోవడానికి వచ్చారు.

ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించడానికి నిశ్చల ఛాయాగ్రహకులు, వారి మధ్య సంభాషణలను సేకరించడానికి విలేకరులు వారి వైపు వేగంగా రావడం మొదలెట్టారు. దీంతో రజనీకాంత్‌ కాస్త ఇబ్బందిగా ఫీలయ్యారు. ఈ లోగానే కార్య నిర్వాహకులు రజనీకాంత్‌ను వేదికపైకి ఆహ్వానించడంతో అబ్బా.. తప్పించుకున్నాం రా బాబూ అన్నంత రిలీఫ్‌ అయినట్లు కనిపించింది. రజనీ మాట్లాడిన తరువాత నటుడు కమల్‌హాసన్‌ రావడంతో ఆయన పక్కన కూర్చున్నారు. ఇదంతా గమనిస్తున్న మీడియా రజనీకాంత్, కేంద్ర మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ పక్కన కూర్చోవడానికి విముఖత చూపారా? అన్న ప్రచారానికి తెరలేపింది.

కానరాని ప్రముఖులు: 
ఇళయరాజా 75 వసంతాల వేడుకకు చిత్ర పరిశ్రమ ప్రముఖులు పలువురు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. నటుడు విజయ్, అజిత్, సూర్య, ధనుష్, జీవా, ఎస్‌జే.సూర్య, జీవీ ప్రకాశ్‌కుమార్, అరుణ్‌విజయ్, అధర్వ, సతీష్, సంతానం, శశికుమార్, సముద్రఖని, సూరి, యోగిబాబు, ప్రకాశ్‌రాజ్, సమంత, హన్సిక, కాజల్, అంజలి, అమలాపాల్, దర్శకుడు భారతీరాజా, రామ్, రంజిత్, పాండిరాజ్, అట్లీ, విఘ్నేశ్‌శివన్, సంగీత దర్శకుడు అనిరుధ్, తమన్, శ్యామ్‌.సీఎస్, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, యేసుదాస్, హరిహరన్, శంకర్‌మహదేవన్, గాయని పి.సుశీల, జానకి, సైంధవి, ప్రముఖ నిర్మాత ఏవీఎం.శరవణన్, కలైపులి ఎస్‌.థాను వంటి ప్రముఖులు అభినందన సభకు దూరంగా ఉన్నారు. దీంతో కార్యక్రమ నిర్వహణలో కొన్ని లోటుపాట్లు జరిగాయన్నది వాస్తవం. అందరినీ కలుపుకునిపోవడంలో నిర్మాతల మండలి విఫలమైందనే అంశం వినిపిస్తోంది.  

వారికీ ధన్యవాదాలు
ఆదివారం జరిగిన వేడుకలో చివరిగా సంగీతజ్ఞాని మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కొందరు ఎంతగా కృషి చేశారో, ఆపడానికి మరికొందరు అంతగా శ్రమించారన్నారు. వారికీ, వీరికీ అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఆపడానికి ప్రయత్నించిన వారికి ధన్యవాదాలు ఎందుకో అనుకోవచ్చని, వారు అలా చేయడం వల్లే ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి ఈ కార్యక్రమాన్ని నిషేధించరాదని తీర్పు ఇచ్చారన్నారు. 

న్యాయస్థానమే అండగా ఉంది
కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యహరించిన నటి సుహాసిని మాట్లాడుతూ.. తాను ఇంటి నుంచి ఇళయరాజా వేడుకకు బయలుదేరుతున్న సమయంలో ఇంటి పనిమనిషి వచ్చి, సంగీతజ్ఞాని సన్మాన కార్యక్రమానికి న్యాయమూర్తే అండగా నిలిచారు. సంతోషంగా వెళ్లి రండమ్మా అని చెప్పిందన్న విషయాన్ని ప్రస్తావించారు. అంతగా పోరాడిన గెలిచిన నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ను అభినందిస్తున్నానని అన్నారు. నటి రోహిణీ ప్రశ్నిస్తూ దర్శకుడు శంకర్‌తో మీరు చేసే చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు. వారి ఆశ ఎప్పుడు నెరవేరుతుందని ఇళయరాజాను ప్రశ్నించడంతో ఆయన కాస్త చిరాకు పడ్డారు. అవన్నీ ఇప్పుడెందుకమ్మా? దర్శకులు ఏ సంగీత దర్శకుడితే కంఫర్టుబుల్‌గా ఉంటే వారితో పని చేయించుకుంటారు అని అన్నారు. ఏదేమైనా విశాల్‌ ముందు నుంచి చెబుతున్నట్లు గానే ఇళయరాజాకు అభినందన సభను చరిత్రలో గుర్తుండిపోయేటట్లు నిర్వహించి చూపించారు. అదేవిధంగా ఒక సంగీత పుత్రుడి అభినందన కార్యక్రమం అశేష సంగీత ప్రియులను ఆనందడోలికల్లో ముంచెత్తిందన్నది నిజం. 

మరిన్ని వార్తలు