కావాలంటే నా బ్యానర్లు తీసేయండి : విజయ్‌

21 Sep, 2019 07:57 IST|Sakshi

జీవితం కూడా ఫుట్‌బాల్‌ క్రీడలాంటిదేనని నటుడు విజయ్‌ పేర్కొన్నారు. ఈయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం బిగిల్‌. మహిళా ఫుట్‌బాల్‌ ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ తండ్రికొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. నయనతార నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో ఏజీఎస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం రాత్రి చెన్నైలోని ఒక ప్రైవేట్‌ కళాశాలలో జరిగింది.

విజయ్‌ అభిమానుల కోలాహలం మధ్య జరిగిన ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు విజయ్‌ మాట్లాడుతూ జీవితం కూడా ఫుట్‌బాల్‌ క్రీడలాంటిదేనన్నారు. మనం గోల్‌ వేయడానికి ప్రయత్నించినప్పుడు దాన్ని అడ్డుకోవడానికి ఒక టీమ్‌ వస్తుందన్నారు. మనలో ఉన్న వాడే పోటీ జట్టు కోసం గోల్‌ వేస్తాడన్నారు. ఎవరి గుర్తింపును సొంతం చేసుకోవద్దని, మీ కంటూ ఒక గుర్తింపును పొందే ప్రయత్నం చేయాలని అన్నారు. కష్టపడి పని చేసిన వారిని వేదిక ఎక్కించి సంతోషపడే అభిమానులే యజమానులని పేర్కొన్నారు.

ఈ వేడుకలోఇటీవల కటౌట్‌ పడటంతో మరణించిన శుభశ్రీ కుటుంబానికి తన సానుభూతి తెలిపారు విజయ్‌. ఇక్కడ ఎవరిని అరెస్ట్‌ చేయాలో వారిని వదిలేసి బ్యానర్లను అతికించిన వారిని, పోస్టర్లను చింపిన వారిని అరెస్ట్‌ చేస్తున్నారని అధికారులపై చురకలు వేశారు. తన బ్యానర్లు, కటౌట్లు చింపుతున్నప్పుడు అభిమానులు పడే బాధ తనకు కలుగుతుందన్నారు.

అభిమానులను కొట్టకండి
తన సినిమాల బ్యానర్లను తొలగించండి. అయితే అభిమానులపై చెయ్యి చేసుకోకండని కోరారు. అభిమానులు ఆశగా, ఇష్టంగా బ్యానర్లు కడుతున్నారని, వాటిని చించితే వారికి కోపం రావడం న్యాయమేనని అన్నారు. ఈ వేడుకకు నయనతార డుమ్మా కొట్టడం అభిమానులను ఒకింత నిరాశకు గురిచేసింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా