నిర్మాతలకు దండం పెట్టాలనిపించింది – తమ్మారెడ్డి భరద్వాజ

26 Mar, 2018 00:18 IST|Sakshi
తమ్మారెడ్డి భరద్వాజ, శ్రీవిష్ణు, నారా రోహిత్, వేణు ఊడుగుల, దేవిప్రసాద్‌

‘‘నీదీ నాదీ ఒకే కథ’ టైటిల్‌ విని ఈరోజుల్లో ఇటువంటి సినిమాలు ఎవరు చూస్తారులే అనుకున్నా. రివ్యూస్‌ చూశాక సినిమా చూడాలనిపించింది. ఈ సినిమా చూశాక నా మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. ఇంత మంచి సినిమా నిర్మించిన నిర్మాతలకు దండం పెట్టాలనిపించింది’’ అని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. శ్రీ విష్ణు, సాట్నా టైటస్‌ జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రశాంతి, కృష్ణ విజయ్‌ నిర్మించిన ‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమా శుక్రవారం విడుదలైంది.

ఈ సందర్భంగా చిత్రబృందం థ్యాంక్స్‌ మీట్‌ నిర్వహించింది. చిత్ర సమర్పకుడు నారా రోహిత్‌ మాట్లాడుతూ– ‘‘మా ఆరాన్‌ మీడియా వర్క్స్‌ బేనర్‌లో కొత్తదనం ఉన్న కథలతో మరిన్ని సినిమాలు వస్తాయి. ఈరోజుల్లో ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తారు? అని చెప్పారు. అయినా నా డబ్బు, నా ఇష్టం. నాకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను. ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘నా సినిమాలకు వేణు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు.

ఇలాంటి కొత్త కాన్సెప్ట్‌ సినిమాలు చేయడానికి నాలాంటి దర్శకులందరికీ కొత్త ఉత్సాహాన్ని కలిగించిన చిత్రమిది’’ అన్నారు దర్శకుడు మదన్‌. ‘‘సినిమా చూస్తున్నంత సేపు నాకు దర్శకుడు వేణు, శ్రీవిష్ణులే కన్పించారు’’ అన్నారు దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి. ‘‘సినిమా చూస్తున్నంత సేపు నాకు బాలచందర్‌గారే గుర్తుకొచ్చారు’’ అని దర్శకుడు వీఎన్‌ ఆదిత్య అన్నారు. ‘‘ఈ సినిమా చేయకపోయుంటే జీవితంలో ఒక గొప్ప గౌరవాన్ని మిస్‌ అయ్యేవాణ్ణి’’ అన్నారు దేవిప్రసాద్‌.

‘‘ప్రతి ఒక్కరూ ఇది నా కథ, మా ఇంట్లో జరిగిన కథ అని ఓన్‌ చేసుకుంటున్నారు. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు శ్రీవిష్ణు. ‘‘రివ్యూస్‌ బాగున్నాయి. కొన్ని విమర్శలూ ఉన్నాయి. అవన్నీ సరిదిద్దుకొని తర్వాత ఓ మంచి సినిమా తీయడానికి కృషి చేస్తా’’ అన్నారు వేణు ఊడుగుల. సంగీత దర్శకుడు సురేష్‌ బొబ్బిలి, కెమెరామెన్‌ రాజ్‌ తోట, ఎడిటర్‌ బొంతల నాగేశ్వరరెడ్డి, శ్రీ వైష్ణవి క్రియేషన్స్‌ అధినేత నారాయణరావు, నిర్మాతలు రాజ్‌ కందుకూరి, బెక్కం వేణుగోపాల్‌  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు