నా మనసుకు నచ్చిన చిత్రమిది

5 Sep, 2019 05:52 IST|Sakshi
ఆండ్రియా

జె.ఎస్‌.కె ఫిలింస్‌ కార్పొరేషన్‌ సమర్పణలో అంజలి, ఆండ్రియా, వసంత్‌ రవి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘తారామణి’. రామ్‌ దర్శకుడు. డి.వి.వెంకటేశ్, ఉదయ్‌ హర్ష వడ్డేల్ల ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. రేపు ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ వేడుకలో నిర్మాత కె.ఎల్‌. దామోదర ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘వెంకటేశ్, ఉదయ్‌ ఎంతో అభిరుచి ఉన్న నిర్మాతలు. ట్రైలర్‌ చూశాక ఇది రియలిస్టిక్‌ ఫిల్మ్‌ అని అర్థమైంది. మనం బయటకు చెప్పుకోలేని ఎన్నో ఎమోషన్స్‌ని ఇప్పటి  సినిమాలు చెబుతున్నాయి. ఇది అలాంటి సినిమానే’’ అన్నారు. డీవీ వెంకటేశ్‌ మాట్లాడుతూ– ‘‘తమిళ్‌లో పెద్ద హిటై్టన చిత్రమిది.

తెలుగులో రీమేక్‌ చేద్దాం అనుకున్నాం, కానీ కుదర్లేదు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఎక్కడా రాజీపడకుండా అనువాదం చేశాం’’ అన్నారు. మరో నిర్మాత ఉదయ్‌ మాట్లాడుతూ– ‘‘సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో సినిమా ఉంటుంది. టెక్నాలజీ మాయలో పడి యువత ఎలాంటి ప్రలోభాలకు లోనవుతున్నారు? అనేది ప్రధానాంశం’’ అన్నారు. హీరోయిన్‌ ఆండ్రియా మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం తమిళ్‌లో చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయం సాధించింది. నా మనసుకు నచ్చిన చిత్రమిది. తెలుగు ట్రైలర్‌ చూశాక చాలా ఎగ్జయిట్‌ అయ్యాను. తెలుగులో ఈ సినిమా విడుదల అవటం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు డి.ఎస్‌. రావు, పద్మిని తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు