జుట్టు తక్కువ, పొట్ట ఎక్కువ.. నేను హీరో ఏంటి?

29 Oct, 2019 00:56 IST|Sakshi
అభినవ్, తరుణ్‌భాస్కర్‌

– తరుణ్‌ భాస్కర్‌

‘‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో నువ్వే హీరో అని విజయ్‌ దేవరకొండ అన్నప్పుడు, నేను హీరో ఏంటి? అనుకున్నాను. ‘నాకు జుట్టు తక్కువ, పొట్ట ఎక్కువ’ అని విజయ్‌తో చెప్పాను. ‘ఏం ఫర్వాలేదు’ అన్నాడు’’ అని అన్నారు తరుణ్‌ భాస్కర్‌. ‘పెళ్ళి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న తరుణ్‌ భాస్కర్‌ ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. వాణీ భోజన్, అనసూయ, అభినవ్‌ గోమటం ముఖ్యపాత్రల్లో  షమ్మీర్‌ సుల్తాన్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. హీరో విజయ్‌ దేవరకొండ, వర్థన్‌ దేవరకొండ నిర్మించిన ఈ చిత్రం నవంబర్‌ 1న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా తరుణ్‌ భాస్కర్, చిత్రంలో కీలక పాత్ర చేసిన అభినవ్‌ గోమటం చెప్పిన విశేషాలు.  

తరుణ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ – ‘‘విజయ్‌ దేవరకొండ కోసం తమిళ దర్శకుడు షమ్మీర్‌ సుల్తాన్‌ ఈ కథను వినిపించారు. విజయ్‌కి కథ చాలా నచ్చింది కానీ తనకు సెట్‌ కాదనిపించింది. ఈ కథ మిస్‌ అవ్వకూడదనుకున్నాడు. నన్ను కథ వినమన్నాడు. ఫ్రెండ్లీగా విన్నాను. ఆ తర్వాత నువ్వే హీరో అన్నాడు. నిర్మాతగా విజయ్‌ ఎక్కడ వరకూ ఇన్వాల్వ్‌ అవ్వాలో అక్కడి వరకే ఉండేవాడు. ఈ సినిమా ప్రీ–ప్రొడక్షన్‌ అంతా ముగిసిన తర్వాత ‘బరువు తగ్గాలి తరుణ్‌’ అని విజయ్‌ చెప్పాడు. ‘పెరగడం తప్ప తగ్గడం నాకు తెలియదు’ అన్నాను. ఆ తర్వాత మెల్లిగా తగ్గాను.

– నేను హీరోగా చేయాలనుకున్నప్పుడు మా ఆవిడ నాతో మాట్లాడలేదు (నవ్వుతూ). చిన్న చిన్న పాత్రలు చేస్తునప్పుడు ఎంకరేజ్‌ చేసింది. కానీ హీరోగా చేయడం నచ్చలేదు. అయితే మా అమ్మ ప్రోత్సహించారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ‘ఫిదా’ సినిమాలో మా అమ్మకు నటించే అవకాశం వచ్చింది. ‘విధవరాలికి ఇవన్నీ ఎందుకు?’ అని కొందరు బంధువులు కామెంట్‌ చేశారు. ‘అమ్మా ఇది నీ లైఫ్‌. నువ్వు చేయాలనుకుంది చెయ్‌. పక్కనోళ్ల మాటలు పట్టించుకోకు’ అని ధైర్యం చెప్పాను. అవే మాటలు నాకు మళ్లీ గుర్తు చేసింది అమ్మ. కొడుకు హీరో అంటే ఏ అమ్మకైనా ఆనందమే కదా.
– ప్రస్తుతం వెంకటేశ్‌గారి కోసం ఒక కథ సిద్ధం చేస్తున్నాను. ‘ఈ నగరానికి ఏమైంది’ కొనసాగింపుగా వెబ్‌ సిరీస్‌ చేస్తున్నాం. ‘లస్ట్‌ స్టోరీస్‌’ వెబ్‌ సిరీస్‌లో నా పోర్షన్‌కి కథ సిద్ధం చేసుకున్నాను.

సెల్‌ఫోన్‌ వల్ల ఇబ్బందులు
అభినవ్‌ గోమటం మాట్లాడుతూ – ‘‘నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. సినిమాలంటే ఆసక్తితో థియేటర్‌ ఆర్టిస్ట్‌గా చేశాను. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాను. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం హిట్‌ కావడంతో పాటు నా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. తరుణ్‌ భాస్కర్‌తో నాకున్న ప్రయాణంతో ‘మీకు మాత్రమే చెప్తా’లో చేయమని అడిగినప్పుడు వెంటనే ఒప్పుకున్నాను. ఈ కాన్సెప్ట్‌ని షమ్మీర్‌ మొదట విజయ్‌కు చెప్పాడు. ‘అర్జున్‌ రెడ్డి’ విడుదల తర్వాత విజయ్‌ చేద్దామనుకున్న ప్రాజెక్ట్‌ ఇది. తరుణ్‌ భాస్కర్‌లో డైరెక్షన్‌ స్కిల్స్‌తో పాటు యాక్టింగ్‌ స్కిల్స్‌ ఉన్నాయని తెలియడంతో హీరోగా నటించాడు. మొబైల్‌ వాడకం వల్ల ఎలా ఇబ్బందులు పడ్డారనే విషయాన్ని వినోదాత్మకంగా చెప్పాం.ప్రస్తుతం నితిన్‌ ‘రంగ్‌ దే’, జయంత్‌ సి. పరాన్జీగారి సినిమాతో పాటు సుశాంత్‌ సినిమాలో నటిస్తున్నాను’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా