అలా ఉండడం నా వల్ల కాదు

13 Sep, 2017 01:30 IST|Sakshi
అలా ఉండడం నా వల్ల కాదు

కామ్‌గా ఉండడం నా వల్ల కాదు అంటోంది నటి నిక్కీగల్రాణి. డార్లింగ్‌ చిత్రంతో కోలీవుడ్‌కు రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉంది. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నిక్కీగల్రాణి విక్రమ్‌ప్రభుకు జంటగా నటించిన నెరుప్పుడా
చిత్రం గత శుక్రవారం తెరపైకి విచ్చి సక్సెస్‌ఫుల్‌గా పరిగెడుతోంది.  గౌతమ్‌ కార్తీక్‌ సరసన నటించిన హర హర మహాదేవకి చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తున్న నిక్కీగల్రాణి మాటామంతి..  – తమిళసినిమా


ప్ర: నెరుప్పుడా చిత్రంలో మీ పాత్ర గురించి?
జ:  ఈ చిత్రంలో వైద్యవిద్యార్థినిగా నటించాను. ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి పాత్రను పోషించలేదు. చాలా వైవిధ్యం కలిగిన పాత్ర. ఇందులో నా పాత్ర నిప్పుల్లో నుంచే ప్రారంభం అవుతుంది. ఇంకా చెప్పాలంటే చాలా రిస్క్‌ తీసుకుని నటించాను. మరో విషయం ఏమిటంటే నేను డాక్టరు కావాలన్నది మా అమ్మ ఆశ. అలా వైద్యవిద్యను చదివిన నేను దిశ మారి సినిమా రంగంలోకి ప్రవేశించాను. ఇదీ మంచికే అనుకుంటున్నాను.

ప్ర:  విక్రమ్‌ప్రభుతో నటించిన అనుభవం?
జ:  చాలా మంచి అనుభవం. విక్రమ్‌ప్రభు సెట్‌లో చాలా ప్రశాంతంగా ఉంటారు. నెరుప్పుడా చిత్రానికి ఆయనే నిర్మాత. అయినా ఎలాంటి టెన్షన్‌ పడ్డట్టు నేను చూడలేదు. ఇక మర్యాద, ప్రేమ విషయాల్లో విక్రమ్‌ప్రభు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ప్ర: చిత్రాల ఎంపికలో మీరు తీసుకునే జాగ్రత్తలు?
జ:   అందర్నీ ఆలోచింపజేసే కథా పాత్రలను ఎంపిక చేసుకుని నటించాలన్నదే నా కోరిక. అలాంటి పాత్రలను చాలెంజింగ్‌గా తీసుకుని నటిస్తాను. ఒక సారి నటించిన పాత్రలో మళ్లీ నటించకుండా వైవిధ్యంగా ఉండే పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్నాను. అందుకే సక్సెస్‌ఫుల్‌ నటిగా కొనసాగిస్తున్నాను.

ప్ర: ఇంత సక్సెస్‌ఫుల్‌ నటిగా రాణిస్తారని ముందుగా ఊహించారా?
జ:  నిజం చెప్పాలంటే నేను నటినవుతానని ఊహించలేదు. నటి అయిన తరువాత ఇంతగా నిలదొక్కుకుంటానని అనుకోలేదు. నాలుగు తమిళ చిత్రాలు, రెండు మలయాళం, తెలుగు అంటూ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది.

ప్ర: సంగీతదర్శకుడు, నటుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌ మిమ్మల్ని చూసి భయపడతారట?
జ:  షూటింగ్‌ సెట్‌లో గానీ, బయట గానీ కామ్‌గా ఉండడం అన్నది నా వల్ల కాని పని. సరదాగా మాట్లాడుతూ సందడి చేస్తుంటాను. అందుకు విరుద్ధంగా జీవీ.ప్రకాశ్‌కుమార్‌ ప్రశాంతంగా ఉంటే నేనేం చేయను.