ఉత్తరాదికీ... డిస్ట్రిబ్యూటర్ల తాకిడి?

21 Feb, 2015 22:58 IST|Sakshi
ఉత్తరాదికీ... డిస్ట్రిబ్యూటర్ల తాకిడి?

 ఒకరికి తెద్దునా... ఇద్దరికి తెద్దునా... అందరికీ తెద్దునా... అంటే ఇదే కావచ్చు! దక్షిణాది మొత్తంలో  రికార్డు స్థాయి వసూళ్ళు సాధించే హీరో రజనీకాంత్‌కే ఇలా జరిగిందంటే, ఇక మామూలు హీరోల మాటేమిటని ఉత్తరాది హీరోలు ఇప్పుడు బెంబేలెత్తుతున్నారట! ఆ మధ్య విడుదలైన ‘లింగ’ చిత్రం పరాజయం పాలై, భారీ నష్టాలు మిగిల్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా వల్ల తమకు భారీ నష్టం వచ్చిందనీ, తమకు డబ్బులు వెనక్కి ఇవ్వాలనీ డిమాండ్ చేస్తూ తమిళ సినీ పంపిణీదారులు రజనీకాంత్ ఇంటి ముందే సామూహిక భిక్షాటన చేస్తామంటూ హెచ్చరించారు.
 
 తమిళనాట మొదలైన ఈ ‘ట్రెండ్’ ఎక్కడ ఉత్తరాదికి పాకుతుందోనని హిందీ హీరోలు సతమతమవుతున్నారని హిందీ సినీ వర్గాల కథనం. దక్షిణాదిలో కన్నా హిందీ సినీ రంగంలో ఫ్లాపుల రేటు, నష్టాలు ప్రస్తుతం భారీగా ఉన్నాయి. పెపైచ్చు, చాలామంది హిందీ హీరోలు ఇప్పుడు సొంతంగా సినిమాలు నిర్మిస్తున్నారు. రేపు పొద్దున రజనీకాంత్ చిత్రాల లాగానే తమ చిత్రాలకూ డిస్ట్రిబ్యూటర్లు వచ్చి గొంతు మీద కూర్చుంటే ఏం చేయాల్రా అని ఉత్తరాది తారలు తలపట్టుకు కూర్చున్నారు. మొత్తానికి, హిట్‌ల విషయంలోనే కాదు... ఈ విషయంలోనూ రజనీకాంత్ దెబ్బ హిందీ వాళ్ళకు తప్పదులా ఉంది.
 

>