వీళ్లను బాగా వెతికారు!

15 Dec, 2016 23:31 IST|Sakshi
వీళ్లను బాగా వెతికారు!

‘నిప్పురా.. తాకరా’ అంటూ రజనీకాంత్‌ ‘కబాలి’లో రెచ్చిపోతే.. అభిమానులు ఆనందం పట్టలేక థియేటర్లో కేకలు పెట్టారు. ఇక, ‘సుల్తాన్‌’లో మల్లయోధుడిగా సల్మాన్‌ ఖాన్‌ ప్రత్యర్థిపై పిడిగుద్దులు సంధిస్తే.. ఆయన అభిమానులు ‘అదీ మా బాస్‌ పవర్‌’ అన్నారు. థియేటర్లో చూడటం మాత్రమే కాదు.. ఇంటర్నెట్‌లో కూడా వెతికి మరీ ఈ రెండు చిత్రాలనూ చూశారు. అందుకే ఈ ఏడాది ‘గూగుల్‌’ టాప్‌ ట్రెండింగ్‌ హిందీ మూవీస్‌లో ‘సుల్తాన్‌’ మొదటి స్థానం, ‘కబాలి’ రెండో స్థానం దక్కించుకున్నాయి. సినిమా రంగానికి చెందిన వివిధ విభాగాల్లో ఈ ఏడాది ‘టాప్‌ ట్రెండింగ్‌’ జాబితాను ‘గూగుల్‌’ విడుదల చేసింది. ఇంకా ‘ఉడ్తా పంజాబ్‌’, ‘ఎయిర్‌ లిఫ్ట్‌’, ‘ఏ దిల్‌ హై ముష్కిల్‌’, ‘సనమ్‌ రే’, ‘సైరత్‌’, ‘రుస్తుమ్‌’, ‘హౌస్‌ఫుల్‌ 3’, ‘మొహెంజొదారో’ టాప్‌ టెన్‌ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి.

హిందీ రంగానికి చెందిన నటుల్లో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్, కబీర్‌ బేడి, హర్షవర్థన్‌ కపూర్, పుల్కిత్‌ సామ్రాట్, సల్మాన్‌ఖాన్, అర్షద్‌ వార్సి, సూరజ్‌ పాంచోలి, అనుపమ్‌ ఖేర్, రణ్‌వీర్‌ సింగ్, విక్కీ కౌశల్‌ టాప్‌ టెన్‌లో ఉన్నారు. కథానాయికల్లో దిశా పాట్ని, ఊర్వశి రౌటేలా, పూజా హెగ్డే, మందనా కరిమి, ఊర్మిళ మాటోండ్కర్, నిమ్రత్‌ కౌర్, వాణీ కపూర్, నోరా ఫతేహి, కైరా అద్వాని, సయామీ ఖేర్‌లు ఎక్కువగా గూగుల్‌ సెర్చ్‌ చేయబడిన తారలుగా గుర్తింపు పొందారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఆస్కార్‌ అవార్డ్స్‌ వేడుకల్లో ప్రియాంకా చోప్రా పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది జరిగిన వేడుకల్లో ఆస్కార్‌ అవార్డ్స్‌ వేడుకను పలువురు ఆన్‌లైన్‌లో వీక్షించారు. ఆ విధంగా ఈ వేడుక ట్రెండింగ్‌ అయింది. ఇదే వేడుకలో పాల్గొన్న ప్రియాంకా చోప్రా ‘ఆస్కార్‌ రెడ్‌ కార్పెట్‌’ విభాగంలో గూగుల్‌
సెర్చ్‌ పరంగా ఏడో స్థానంలో, ఫ్యాషన్‌ విభాగంలో డిజైనర్‌ అనితా డోంగ్రే ఏడో స్థానంలో నిలిచారు.