‘దిల్‌’ రాజు రాంగ్‌ స్టేట్‌మెంట్‌ ఇవ్వడు!

18 Jul, 2017 03:02 IST|Sakshi
‘దిల్‌’ రాజు రాంగ్‌ స్టేట్‌మెంట్‌ ఇవ్వడు!

‘‘ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు తీయడమే నా సక్సెస్‌ సీక్రెట్‌’’ అన్నారు ‘దిల్‌’ రాజు. వరుణ్‌తేజ్, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన సినిమా ‘ఫిదా’. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా ‘దిల్‌’ రాజు చెప్పిన ముచ్చట్లు...

ఓ పెళ్లిలో కలసిన వరుణ్‌ (హీరో), భానుమతి (హీరోయిన్‌) తమ కలలను ఎలా నెరవేర్చుకున్నారనేది చిత్రకథ. తెలంగాణ భాన్సువాడ అమ్మాయి, అమెరికాలో సెటిలైన ఆంధ్రా అబ్బాయి నేపథ్యంలో సినిమా సాగుతుంది. అయితే ప్రాంతాలతో ముడిపడిన ప్రేమకథ కాదిది. వేర్వేరు మనస్తత్వాలున్న వీళ్ల మధ్య జరిగే కథ. హీరో సాఫ్ట్‌ అయితే... హీరోయిన్‌ రెబల్‌.

పవన్‌కల్యాణ్‌కు ‘తొలిప్రేమ’ 4వ సిన్మా. అప్పుడాయనకు ఎలాంటి ఇమేజ్‌ లేదు. ‘ఆర్య’ టైమ్‌లో బన్నీకి ఎలాంటి ఇమేజ్‌ లేదు. ఇప్పుడు వరుణ్‌ సేమ్‌ పొజిషన్‌లో ఉన్నాడు. ఓ నలుగురిని కొట్టాలని, హీరోయిజమ్‌ చూపించాలని అనుకోవడం లేదు. ‘సీతమ్మ వాటిట్లో సిరిమల్లె చెట్టు’ కోసం మహేశ్‌బాబు, ‘బృందావనం’ కోసం ఎన్టీఆర్, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ కోసం ప్రభాస్‌... ఇలా స్టార్స్‌ తమ ఇమేజ్‌ పక్కనపెట్టినప్పుడు మంచి సినిమాలొస్తాయి. వరుణ్‌కి ఈ సిన్మా మంచి కమర్షియల్‌ హిట్‌ ఇస్తుంది.

సాయిపల్లవి సెలక్షన్‌ శేఖర్‌ కమ్ములదే. మేం సంప్రదించే టైమ్‌కి ఆమె మెడిసిన్‌ చదువుతోంది. అది పూర్తయ్యే వరకు సినిమాలు చేయనని చెప్పింది. మాకు స్క్రిప్ట్‌ డెవలప్‌మెంట్‌కు ఆర్నెల్లు టైమ్‌ పట్టింది. అప్పటివరకు ఆమె కోసం వెయిట్‌ చేశాం. సాయి పల్లవి బాగా నటించడంతో పాటు తెలంగాణ యాసలో సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకుంది.

శేఖర్‌ కమ్ముల కథను గొప్పగా రాయడు. సీన్‌ను గొప్పగా తీస్తాడు. ఎప్పట్నుంచో ఆయనతో సినిమా చేయాలనుకుంటున్నా. కానీ, మాకు సెట్‌ అవుతుందా? లేదా? అనుకునేవాణ్ణి. ‘హ్యాపీడేస్‌’ రిలీజ్‌ టైమ్‌లో మా ఆలోచనలు కలిశాయి. ‘లీడర్‌’ టైమ్‌లో ఈ కథ చెప్పారు. ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ఆయన స్టైల్‌లోనే సినిమా తీయమన్నా. నాగబాబుగారు సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. చిరంజీవిగారికి సినిమాను చూపించాలనుకుంటున్నారు.

రవితేజతో తీస్తున్న ‘రాజా ది గ్రేట్‌’ చిత్రీకరణ 30 శాతం పూర్తయింది. అక్టోబర్‌ 12న చిత్రాన్ని విడుదల చేస్తాం. నాని ‘ఎంసీఏ’ను డిసెంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం. మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్‌గారితో కలసి నిర్మించనున్న సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జనవరిలో మొదలవుతుంది. రామ్‌చరణ్‌తో సినిమా డిస్కషన్స్‌లో ఉంది.

‘డీజే–దువ్వాడ జగన్నాథమ్‌’ వసూళ్ల వివాదం గురించి ‘దిల్‌’ రాజును ప్రశ్నించగా... ‘‘బన్నీ (అల్లు అర్జున్‌) కెరీర్‌లోనే బెస్ట్‌ మూవీ ‘సరైనోడు’ రెవెన్యూను ‘డీజే’ క్రాస్‌ చేసిందంటే ఆ సినిమా హిట్టా? ఫెయిలా? అనేది ఆలోచించుకోవాలి. సినిమాల విషయంలో నేను నిర్మాతగా, ఎగ్జిబిటర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా ఆలోచిస్తా. నా డిస్ట్రిబ్యూటర్స్‌ లాభనష్టాల గురించి కూడా ఆలోచిస్తా. ‘డీజే’ విషయంలో నిర్మాతగా హ్యాపీ. నేను సక్సెస్‌ అయ్యాను కాబట్టే సక్సెస్‌ మీట్‌ రోజున హ్యాట్రిక్‌ మూవీ అని ప్రకటించా. నేనో స్టేట్‌మెంట్‌ ఇస్తే వేల్యూ ఉంటుంది. వసూళ్లను ఎక్కువ చేసి చూపించే అలవాటు నా జీవితంలో లేదు. భవిష్యత్తులోనూ చేయను. ‘దిల్‌’ రాజు ఎప్పుడూ రాంగ్‌ స్టేట్‌మెంట్‌ ఇవ్వడు’’ అన్నారు.

⇒  ‘డీజే’ విడుదల తర్వాత నేను అమెరికా వెళ్లడంతో ఇక్కడ (డ్రగ్స్‌ వ్యవహారం) ఏం జరిగిందో నాకు తెలియదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గతంతో పోలిస్తే ‘జీఎస్టీ’ వల్ల నిర్మాతలపై పది శాతం భారం పెరిగింది. షేర్‌ వసూళ్లపై జీఎస్టీ ప్రభావం ఎక్కువ పడుతోంది. దీనిపై తెలుగు ప్రభుత్వాల స్పందన కోసం ఎదురుచూస్తున్నాం.