దూ..రం.. అ..యి..తే.. నష్టమే!

4 Jun, 2020 03:41 IST|Sakshi

‘స్పేస్‌’ వద్దన్నప్పుడే థియేటర్‌ ఓపెన్‌ అవ్వాలి

మనిషికీ మనిషికీ మధ్య మూడు సీట్ల దూరం ఉంటుందా? ఒకే కుటుంబానికి చెందినవారు వెళితే నాలుగు సీట్లు ఒకేచోట ఉంటాయా? కపుల్‌ అయితే రెండు సీట్లు కేటాయిస్తారా? సింగిల్‌గా వెళ్లినవాళ్లు సీటు సీటుకి మధ్య గ్యాప్‌ ఉండే వరుసలో కూర్చోవాలా? కలిసికట్టుగా థియేటర్‌కి వెళ్లినా దూరం దూరంగా కూర్చుని సినిమా చూడాలా? లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్లు ఏ విధంగా మారబోతున్నాయి? ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఏమంటున్నారు? తెలుసుకుందాం.

‘ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్‌ దిగిందా? లేదా?...’ ‘పోకిరి’లో మహేశ్‌బాబు చెప్పిన డైలాగ్‌ ఇది. కరెక్టే.. ఎప్పుడొచ్చామన్నది కాదు.. రైట్‌ టైమ్‌లో వచ్చామా? లేదా? అన్నదే ముఖ్యం.
‘కొంచెం జరగరా.. నాకు స్పేస్‌ కావాలి’ అంటుంది పూజా హెగ్డే.
ఎన్టీఆర్‌ స్పేస్‌ ఇస్తాడు. ‘అరవిందసమేత వీర రాఘవ’ సినిమాలో సీన్‌ ఇది. కరెక్టే.. ఇప్పుడు అందరికీ స్పేస్‌ కావాలి. దూరం పాటించాలి.
వినోదం కోసం కుటుంబమంతా కలిసి సినిమాకెళ్లినా... దూరం దూరంగా కూర్చోవాలా?
పిల్లలిద్దరికీ కలిపి ఒక్క పాప్‌కార్న్‌ కొంటే.. ఒక కుర్చీ అవతల ఉన్న తమ్ముడికో లేదా చెల్లెలికో చేతులు సాగదీసుకుంటూ పాప్‌కార్న్‌ షేర్‌ చేయాలా?
ప్రేమికులైతే... ఒకే కూల్‌డ్రింక్‌లో రెండు స్ట్రాలు వేసుకుని పక్కపక్కనే కూర్చుని సినిమాని ఆస్వాదించలేరా? ‘భౌతిక దూరం పాటించాలి’ అంటూ థియేటర్లలో సీటు సీటుకి మధ్య గ్యాప్‌ ఇస్తే పరిస్థితి ఇదే.
‘నీదో దారి నాదో దారి’ అన్నట్లు సినిమా చూడాల్సిందే.
‘ఇలానూ సినిమా చూడాలా?’.. అని చాలామంది ప్రేక్షకులు ఫిక్స్‌ అయ్యే ప్రమాదం ఉంది.
మరి.. థియేటర్‌ అధినేతల పరిస్థితి ఏంటి?
‘సినిమా హాల్‌’ నిండటానికి లేదు. 500 సీట్లు ఉంటే 250కే పరిమితం చేయాలన్నప్పుడు నష్టమే?
అందుకే ‘థియేటర్‌లో మార్పులు’ చేయడానికి చాలామంది సుముఖంగా లేరు.
‘నో గ్యాప్‌’ అంటున్నారు.

థియేటర్‌ ఫుల్‌ అయినా కాకపోయినా కరెంట్‌ బిల్‌ అదే వస్తుంది. స్టాఫ్‌ జీతాలు ఇవ్వాల్సిందే. ఇంకా శానిటైజేషన్, ఇతర మెయిన్‌టెనెన్స్‌ ఖర్చులు ఎలానూ ఉంటాయి. ఈ విషయం గురించి చారీని అడుగుదాం. నైజాంలోని పలు థియేటర్ల నిర్వహణ చారి ఆధ్వర్యంలో ఉంది. ఆయన మాట్లాడుతూ –‘‘భార్య ఒకచోట, భర్త ఒకచోట, పిల్లలు మరోచోట కూర్చుని సినిమా చూడ్డానికి ఎందుకు ఇష్టపడతారు? సీట్ల మధ్య గ్యాప్‌ సిస్టమ్‌ పెడితే ఫ్యామిలీస్‌ రావడానికి ఇష్టపడరు. నలుగురైదుగురు స్నేహితులు సినిమాకి రావాలనుకున్నప్పుడు పక్కపక్కనే కూర్చుని సినిమా చూడాలనుకుంటారు కానీ విడివిడిగా కాదు కదా.

సీట్ల మధ్య గ్యాప్‌ అనేది వసూళ్లపై ప్రభావం చూపుతుంది. కరోనా భయంతో అసలు ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారా? రారా? అనే పరిస్థితిలో సీట్ల మధ్య గ్యాప్‌ పెంచి రీ ఓపెన్‌ చేయడం అనేది సరైన నిర్ణయం కాదని నా అభిప్రాయం. పైగా అదనపు ఖర్చు కూడా అవుతుంది. ఎలాగంటే షో షోకీ శానిటైజేషన్‌ చేయాలి. ఒక సింగిల్‌ థియేటర్‌ శానిటైజేషన్‌కి నెలకు సుమారు లక్ష రూపాయలవుతుంది. ఇప్పుడైతే కరెంట్‌ బిల్‌ మినిమమ్‌ టారిఫ్‌ కట్టొచ్చు. సినిమా ఆడటం మొదలుపెట్టాక పవర్‌ బిల్‌ పెరుగుతుంది. అలాగే ఇప్పుడు కొందరు ఎగ్జిబిటర్లు స్టాఫ్‌కి జీతాల్లో కోత విధించారు.

రీ ఓపెన్‌ అయ్యాక ఫుల్‌ జీతం ఇవ్వాల్సిందే. పెరిగే ఖర్చులతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు.. ఎవరికీ సీట్లు తగ్గించి, థియేటర్‌ ఓపెన్‌ చేస్తే పెద్దగా ఉపయోగం ఉండదు. సినిమా అనేది కంపల్సరీ కాదు. మద్యం షాపులు, బార్లు, పబ్బులు ఓపెన్‌ చేస్తే... బాధలో ఉన్నవాళ్లూ వెళతారు. సంతోషంగా ఉన్నా మందు కొనుక్కుంటారు. సినిమా అంటే ఎక్కువ శాతం మంది మూడ్‌ బాగున్నప్పుడు, ఖాళీ దొరికినప్పుడే వస్తారు. పైగా కరోనా వైరస్‌ భయంతో సినిమాలు చూడ్డానికి వచ్చే అవకాశం తక్కువ. అందుకే పరిస్థితులన్నీ చక్కబడి ఏ భయం లేకుండా సినిమా చూడొచ్చు అనుకున్నప్పుడే థియేటర్లు రీ ఓపెన్‌ చేస్తే బాగుంటుంది. సీట్లలో మార్పనేది మంచి నిర్ణయం కాదు’’ అన్నారు చారి.

రైట్‌ టైమ్‌ ముఖ్యం
ఈ విషయం గురించి ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు డి. సురేష్‌బాబు ‘సాక్షి’తో మాట్లాడుతూ – ‘‘సరైన సమయంలో తీసుకునే సరైన నిర్ణయమే ఏ వ్యాపార విజయానికైనా ప్రధాన కారణం. ‘రైట్‌ టైమ్‌..’ అనేది చాలా ముఖ్యం. వ్యాపారం దెబ్బతింటోంది కదా అని తొందరపడి థియేటర్లు రీ ఓపెన్‌ చేస్తే నష్టమే. సీటు సీటుకి మధ్య గ్యాప్‌ ఇచ్చి సినిమాలు ఆడిస్తామంటే ఎగ్జిబిటర్‌కి లాభం రావడం అనేది జరగదు. భయపడుతూ సినిమా చూడాలా? అని ప్రేక్షకులు అనుకుంటారు. అంతెందుకు? చైనాలో థియేటర్లు రీ ఓపెన్‌ చేస్తే, ఎవరూ రాలేదు. దాంతో మూసేశారు.

దుబాయ్‌లోనూ అంతే! థియేటర్‌ తెరవగానే ప్రేక్షకులు వస్తారనుకున్నారు. నిరాశే ఎదురైంది. ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు? ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్‌ దగ్గరికి వెళదామనుకుంటారు. నిత్యావసరాలు కొనుక్కోవడానికి వెళతారు. అంతేకానీ ధైర్యం చేసి థియేటర్‌కి వెళతారనుకోను. రెండు నెలలుగా థియేటర్లు మూసి ఉంచాం. పరిస్థితులు చక్కబడేవరకూ ఓపిక పడదాం. పరిస్థితులన్నీ చక్కబడ్డాక సీటు సీటుకి మధ్య స్పేస్‌ అవసరంలేదనుకున్నప్పుడే రీ ఓపెన్‌ చేయాలి. లేకపోతే చైనా, దుబాయ్‌ పరిస్థితే మనకూ ఎదురవుతుంది.

ఇప్పుడు ఒక రోగికి ఆపరేషన్‌ జరిగాక అతను పూర్తిగా రికవర్‌ అయ్యేవరకూ రెస్ట్‌ తీసుకోవాలి. అలా కాకుండా రొటీన్‌లో పడ్డాడనుకోండి.. రోగం తిరగబెట్టొచ్చు. థియేటర్స్‌ విషయంలోనూ అంతే. అన్నీ అనుకూలించాకే తెరవాలి. పైగా వచ్చే రెండు మూడు నెలల్లో విడుదలకు సిద్ధమయ్యే సినిమాలు చాలా లేవు. షూటింగ్స్‌ మొదలయ్యాక ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియదు. అందుకే థియేటర్ల రీ ఓపెన్‌కి టైమ్‌ తీసుకుంటే బెటర్‌. ఇంకో విషయం ఏంటంటే... మా ఇండస్ట్రీ తరఫు నుంచి ప్రభుత్వాన్ని మేం ఏం కోరుతున్నామంటే... ‘పవర్‌ రేట్‌’ కమర్షియలైజ్డ్‌గా కాకుండా ‘ఇండస్ట్రియల్‌ టారిఫ్‌’ ఇవ్వాలి. అలాగే కొన్నాళ్ల పాటు సినిమాలపరంగా ‘జీఎస్‌టీ’కి హాలిడే ఇవ్వాలి, తక్కువ వడ్డీకి ఎక్కువ మారటోరియం పీరియడ్‌తో బ్యాంకు రుణాలు ఇచ్చే ఏర్పాటు చేయాలి. ఇవి చేస్తే నిర్మాతలు, ఎగ్జిబిటర్లు... ఇలా అందరికీ ఎంతో కొంత ఊరట ఉంటుంది’’ అన్నారు.

‘ఏషియన్‌ మల్టీప్లెక్స్‌ థియేటర్స్‌’ గ్రూప్‌ అధినేత, ‘ఏఎంబి’ థియేటర్‌కి ఓ అధినేత, ప్రముఖ పంపిణీ దారుడైన సునిల్‌ నారంగ్‌ మాట్లాడుతూ– ‘‘సీట్లు తగ్గించడం అనేది జరగని పని.
పెద్ద సినిమాల ప్రొడ్యూసర్లు ఎవరూ అందుకు ఒప్పుకోరు. ఇక డిస్ట్రిబ్యూటర్స్‌ సరేసరి. వాళ్లూ ఒప్పుకోరు. అలాగే థియేటర్‌కి వచ్చే ప్రేక్షకులను దూరం దూరంగా కూర్చుని సినిమాలు చూడమని చెప్పలేం. సీట్ల మధ్య దూరం అనేది ప్రాక్టికల్‌గా సాధ్యం కాని పని. ఫుల్‌ సీటింగ్‌ ఉన్నప్పుడే థియేటర్లు రీ ఓపెన్‌ చేయడం బెటర్‌’’ అన్నారు.

సునిల్‌ నారంగ్‌

గుంటూరు డిస్ట్రిబ్యూటర్‌ వీఎంఆర్‌ మాట్లాడుతూ –‘‘అన్నీ బాగున్నప్పుడే సినిమా థియేటర్లు తెరవాలి. గుంటూరులాంటి ఏరియాలో మెయిన్‌ థియేటర్లో 350 నుంచి 400 సీట్లు ఉంటాయి. భౌతిక దూరం పేరుతో సీట్లు తగ్గించేస్తే ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్‌ నష్టపోక తప్పదు. లేట్‌ అయినా ఫుల్‌ సీటింగ్‌ అనే పరిస్థితి ఉన్నప్పుడే థియేటర్లు ఓపెన్‌ చేయాలి. సీట్ల తగ్గింపుతో ఇప్పుడు ఓపెన్‌ చేసినా ప్రయోజనం లేదు’’ అన్నారు.

ప్రముఖులు చెప్పిన మాటలు వింటుంటే... ఇప్పట్లో థియేటర్లు రీ ఓపెన్‌ అయ్యే అవకాశం కనిపించడంలేదు. ఆగస్ట్‌ నుంచి ఓపెన్‌ అవుతాయని ఎవరికి వారు అనుకుంటున్నప్పటికీ మరో రెండు నెలలు అదనంగా అయ్యే పరిస్థితే కనబడుతోంది. 2020 ఎండింగ్‌కి అయినా పరిస్థితులు చక్కబడి ఫుల్‌ సీట్లతో థియేటర్లు రీ ఓపెన్‌ అయి, 2021కి మంచి ప్రారంభం కావాలని కోరుకుందాం.


– డి.జి. భవాని

మరిన్ని వార్తలు