బయో పీక్‌

3 Jul, 2020 03:59 IST|Sakshi

రెండేళ్లుగా వెండితెరపై బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఈ ఏడాది కూడా కొన్ని బయోపిక్‌లు థియేటర్స్‌కు రావాల్సింది కానీ కరోనా కారణంగా ఆగాయి. షూటింగ్‌లకు ఆయా ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్న నేపథ్యంలో సెట్స్‌పైకి వెళ్లేందుకు కొన్ని బయోపిక్‌లు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ను పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు మరికొన్ని బయోపిక్‌లు ముస్తాబు అవుతున్నాయి. ఇటు దక్షిణాది అటు ఉత్తరాదిన ఈ ఏడాది బయోపిక్‌ల హవా పీక్‌లో ఉంది. 20 సినిమాల వరకూ ఉండటం విశేషం. ఇక ప్రముఖుల జీవితాల ఆధారంగా రానున్న ఈ చిత్రాల గురించి తెలుసుకుందాం. 

విశ్వదర్శనం 
‘స్వాతిముత్యం, శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం, స్వయంకృషి , శృతిలయలు’.... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రముఖ దర్శకులు, కళా తపస్వి కె.విశ్వనాథ్‌ తెరకెక్కించిన ఘనవిజయాల జాబితాకు ఫుల్‌స్టాప్‌ పెట్టడం కాస్త కష్టమే. ఆణిముత్యాల్లాంటి చిత్రాలను అందించారు. ఆయన గురించి ఎవరికీ తెలియని తెరవెనక దాగి ఉన్న సంగతులు, ఆయన గుండెల్లో నిలిచిపోయిన జ్ఞాపకాలు ‘విశ్వదర్శనం’ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. విశ్వనాథ్‌ జీవితం ఆధారంగా ప్రముఖ రచయిత జనార్థన మహర్షి ఈ ‘విశ్వదర్శనం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

కాళన్న 
సాహిత్యానికి కాళోజీ నారాయణరావు చేసిన కృషి అక్షరాలతో కుదించి రాయలేనిది. తెలుగులోనే కాదు ఉర్దూ, హిందీ, కన్నడ, ఇంగ్లిష్‌.. ఇలా పలు భాషల్లో రచనలు చేసిన ఘనత కాళోజీది. కాళన్నగా సుపరిచితులైన కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. సామాజిక కార్యక్రమల్లో కూడా ఉత్సాహంగా పాల్గొన్న కాళోజీ స్వాతంత్య్ర పోరాటంలోనూ పాలుపంచుకున్నారు. ఇన్ని గొప్ప విశేషాలు దాగి ఉన్న కాళోజీ జీవిత చరిత్ర వెండితెరకు రానుంది. ‘కాళన్న’ టైటిల్‌తో డాక్టర్‌ ప్రభాకర్‌ జైనీ దర్శకత్వం వహిస్తున్నారు.
మిస్సైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా 
పేపర్‌బాయ్‌ నుంచి ప్రెసిడెంట్‌ స్థాయి వరకూ ఎదిగిన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. తమిళనాడులోని ఓ మారుమూల గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన మన దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పెంచారు. డీఆర్‌డీఓ (డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌), ఇస్రో (ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌) సంస్థల్లో ఆయన పోషించిన పాత్ర విశ్వానికి మనల్ని దగ్గర చేసింది. కలాంను ‘మిస్సైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా పిలుస్తున్నారంటే ఆయన గొప్పదనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా స్ఫూర్తిదాయకంగా సాగిన కలాం జీవితం ఆధారంగా ‘కలాం: ది మిస్సైల్‌ మ్యాన్‌’ అనే చిత్రం తెరకెక్కుతోంది. దర్శక ద్వయం జగదీష్‌ తానేటి, జానీ మార్టిన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కలాం పాత్రలో అలీ నటిస్తున్నారు. మరోవైపు బాలీవుడ్‌ దర్శక–నిర్మాత వివేక్‌ అగ్నిహోత్రి కూడా కలాం బయోపిక్‌ను ప్రకటించారు.
చాంపియన్‌ 
ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ (2001)ను సాధించి, చరిత్ర సృష్టించారు పుల్లెల గోపీచంద్‌.  ఈ ఘనత సాధించిన రెండో భారతీయ వ్యక్తి (తొలి వ్యక్తి ప్రకాష్‌ పదుకొనే) ఆయనే కావడం విశేషం. గోపీచంద్‌ జీవితం కూడా తెరకు రానుంది. ఆయన బయోపిక్‌లో సుధీర్‌బాబు నటిస్తారు. ప్రవీణ్‌ సత్తారు దర్శకుడు. సినిమాల్లోకి రాకముందు సుధీర్‌బాబు బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ కావడం విశేషం.

శభాష్‌ మిథూ 
ఇల్లు వదిలి గ్రౌండ్‌లోకి అడుగుపెట్టి తమలో దాగి ఉన్న క్రీడా సత్తాను నిరూపించుకునేందుకు కొందరు అమ్మాయిలు ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నారు. ఆ కష్టాలను ఆత్మవిశ్వాసంతో గ్రౌండ్‌ అవతలికి కొట్టారు క్రికెటర్‌ మిథాలీ రాజ్‌. భారతీయ మహిళా క్రికెట్‌లో తన పేరు ఎప్పటికీ నిలిచిపోయేలా కొన్ని రికార్డులను సాధించారు. భారత మహిళల వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ బయోపిక్‌ ‘శభాష్‌ మిథూ’గా తెరపైకి రానుంది. మిథాలీ రాజ్‌గా తాప్సీ నటిస్తారు. రాహుల్‌ ధోలాకియా దర్శకత్వం వహిస్తారు.
సైనా 
బ్యాడ్మింటన్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ స్థాయికి చేరుకున్న ఘనత సైనా నెహ్వాల్‌ది. అంతేకాదు.. ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున మూడుసార్లు ప్రాతినిధ్యం వహించిన సైనా ఓ ఒలింపిక్‌ మెడల్‌ను కూడా సాధించారు. సైనా జీవితం ‘సైనా’ పేరుతో ఆవిష్కృతం కానుంది. అమోల్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. పరిణీతీ చోప్రా టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు.

తలైవి 
తమిళ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత. ఆమె బయోపిక్‌ తలైవి (హిందీలో ‘జయ’)గా తెరకెక్కుతోంది. జయలలితగా కంగనా రనౌత్‌ నటిస్తున్నారు. ఏఎల్‌ విజయ్‌ దర్శకుడు. జయలలిత జీవితంపై రూపొందనున్న మరో చిత్రం ‘ది ఐరన్‌ లేడీ’లో జయలలితగా కనిపించనున్నారు నిత్యామీనన్‌. దర్శకురాలు ప్రియదర్శిని డైరెక్ట్‌ చేస్తున్నారు. అలాగే జయలలిత జీవితంపై రూపొందిన వెబ్‌సిరీస్‌ ‘క్వీన్‌’లో జయలలితగా నటించారు రమ్యకృష్ణ. తొలి పార్ట్‌ విడుదలైంది. రెండో భాగానికి రంగం సిద్ధమౌతోంది.

మల్లేశ్వరి 
తొలి ఒలింపిక్‌ మెడల్‌ (వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో) సాధించిన కరణం మల్లేశ్వరి బయోపిక్‌ తెరకెక్కనుంది. ఒలిపింక్స్‌లో మెడల్‌ సాధించక ముందు రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచారు మల్లేశ్వరి. కరణం మల్లేశ్వరి బయోపిక్‌ను దర్శకురాలు సంజన తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు ప్రముఖ రచయిత కోన వెంకట్‌ ఓ నిర్మాత కావడం విశేషం. ప్యాన్‌ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందనుంది. 

మరికొన్ని...
ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా బయోపిక్‌ను నిర్మించనున్నారు రోనీ స్క్రూవాలా. నటుడు, నిర్మాత సోనూ సూద్‌ ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు బయోపిక్‌ హక్కులను సొంతం చేసుకున్నారు. ‘కలియుగ భీమ, ఇండియన్‌ హెర్క్యూలెస్‌’ కోడి రామ్మూర్తి బయోపిక్‌లో రానా నటించబోతున్నారు. ‘క్వీన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రాక్‌’గా చెప్పుకునే పీటీ ఉష బయోపిక్‌ గురించి గతంలో ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. 26/11 ముంబై దాడుల్లో పోరాడి మరణించిన ఎన్‌ఎస్‌జీ కమాండో సందీప్‌ ఉన్నికృష్ణన్‌ బయోపిక్‌ ‘మేజర్‌’గా తెరపైకి వస్తోంది. సందీప్‌ పాత్రను అడివి శేష్‌ చేస్తున్నారు. పుట్టుకతోనే అంధుడైనా ఉన్నత చదువులు చదివి వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు మచిలీపట్నంకు చెందిన బొళ్ల శ్రీకాంత్‌. ఆయన బయోపిక్‌ను బాలీవుడ్‌ దర్శక–నిర్మాత తుషార్‌ హీరానందన్‌ రూపొందించనున్నారు. ‘ఎల్‌టీటీఈ’ ప్రభాకరన్‌ బయోపిక్‌ ‘సీరుమ్‌ పులి’గా రూపొందనుంది. జి. వెంకటేష్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాబీ సింహా టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు.

భారతీయ మొదటి ఫీల్డ్‌ మార్షల్‌ శ్యాం మానెక్‌ షా బయోపిక్‌లో నటిస్తున్నారు విక్కీ కౌశల్‌. ‘రాజీ’ ఫేమ్‌ మేఘనా గుల్జార్‌ ఈ చిత్రానికి  దర్శకురాలు. పరమ్‌వీర చక్ర విక్రమ్‌ బాత్ర జీవితం ఆధారంగా విష్ణువర్ధన్‌ తెరకెక్కిస్తోన్న ‘షేర్షా’లో నటిస్తున్నారు సిద్దార్ధ్‌ మల్హోత్రా. ‘భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రంలో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అధికారి విజయ్‌ కార్నిక్‌గా నటించారు అజయ్‌ దేవగన్‌. త్వరలో ఈ చిత్రం ఓటీటీలో విడుదల కాబోతోంది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ బయోపిక్‌ను తెరకెక్కించునున్నట్లు నిఖిల్‌ ఆనంద్‌ తెలిపారు. అలాగే సుశాంత్‌ జీవితం ఆధారంగా ఒక సినిమాను సంజోయ్‌ మిశ్రా, మరో సినిమాను నిర్మాత విజయ్‌శేఖర్‌ గుప్తా రూపొందించనున్నట్లు ప్రకటించారు.

మరోవైపు పలువురు ప్రముఖుల జీవితాల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రాల్లో క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌గా రణ్‌వీర్‌సింగ్‌  (’83), ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌గా అజయ్‌ దేవగన్‌ (‘మైదాన్‌’), కింగ్‌ పృథ్వీరాజ్‌ చౌహాన్‌గా అక్షయ్‌ కుమార్‌ (‘పృథ్వీరాజ్‌’), పంజాబ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఉద్దామ్‌సింగ్‌గా విక్కీ కౌశల్‌ (‘సర్దార్‌ ఉద్దామ్‌సింగ్‌’) నటిస్తున్నారు. 1999 కార్గిల్‌ యుద్ధంలో గాయపడిన సైనికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించిన భారత ఎయిర్‌ ఫోర్స్‌ మహిళా పైలెట్‌ గుంజన్‌ సక్సేనా జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గాళ్‌’. గుంజన్‌ పాత్రను జాన్వీ కపూర్‌ చేశారు. ఈ చిత్రం త్వరలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని బయోపిక్స్‌ కూడా తెరపైకి వచ్చేందుకు ముస్తాబు అవుతున్నాయి. – ముసిమి శివాంజనేయులు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా