'పిల్లలు ఏవైతే చూడకూడదో అవే చూస్తున్నారు'

8 Nov, 2016 20:18 IST|Sakshi
'పిల్లలు ఏవైతే చూడకూడదో అవే చూస్తున్నారు'

ముంబయి: సినిమాల్లోగాని, టీవీ కార్యక్రమాల్లోగానీ పిల్లలకు తగిన అంశాలేవీ కూడా ఉండటం లేదని ప్రముఖ నటుడు, చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ చైర్పర్సన్ ముఖేశ్ ఖన్నా(శక్తిమాన్) అన్నారు. 'భారతదేశంలో వీక్షించడానికి పిల్లలకు తగిన అంశమేది లేదు. వారు ఏమైతే చూడకూడదో అదే చూడాల్సి వస్తోంది. వారు ఇప్పుడు చూస్తున్న సీరియల్స్గానీ, సినిమాలుగానీ నిజంగా వారికోసం కావు' అని అన్నారు.

మంగళవారం చిదియాఖానా అనే బాలల చిత్రం షూటింగ్ వద్దకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. 'నేను చైర్మన్గా బాధ్యతలు చేపట్టగానే నిర్ణయించుకున్నాను. కేవలం పండుగల సందర్భాల్లోనే కాకుండా మిగితా సమయాల్లో కూడా పిల్లలకు సంబంధించిన సినిమాలు థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాను. థియేటర్లలో ఈ సినిమాలు విడుదల చేయకుంటే అవి ఎప్పటికీ వారిని చేరుకోలేవు' అని చెప్పారు.