తమిళనాడులో నన్నంతా సెంథిల్ కొడుకు అనుకుంటారు - సుమన్‌శెట్టి

5 Nov, 2013 23:50 IST|Sakshi
తమిళనాడులో నన్నంతా సెంథిల్ కొడుకు అనుకుంటారు - సుమన్‌శెట్టి

చిత్రమైన శారీరక భాష, విభిన్నమైన సంభాషణా చాతుర్యం. నవ్వు తెప్పించే హావభావాలు... వెరసి సుమన్ శెట్టి. నటుడవుతానని కలలో కూడా ఊహించని సుమన్ శెట్టి ఏకంగా ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బిజీ హాస్యనటుడు. ఈ జనరేషన్‌లో అలాంటి అరుదైన అవకాశం తనకే దక్కింది. భవిష్యత్తులో ఇంకా మరిన్ని నవ్వులు కురిపిస్తానని ఆత్మవిశ్వాసం కనబరుస్తున్న సుమన్ శెట్టితో ‘సాక్షి’ జరిపిన సంభాషణ...

 కెరీర్ ఎలా ఉంది?
 చాలా బిజీగా ఉందండీ.. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, భోజ్‌పురి భాషల్లో కూడా నటిస్తున్నాను. ఇంత బిజీ ఆర్టిస్టుని అవుతానని నేను అస్సలు ఊహించలేదు.
 
 అసలు నటనపై ఆసక్తి ఎలా మొదలైంది?
 ‘నువ్వు సినిమాల్లో పనికొస్తావురా’ అని చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ అంటూ ఉండేవారు. నేను లైట్‌గా తీసుకునేవాణ్ణి. వైజాగ్‌లో మాది రైస్, ఆయిల్ హోల్‌సేల్ వ్యాపారం. ఆ రోజు నాన్నకు పనుండి బయటకు వెళ్లడంతో నేనే  షాపులో కూర్చున్నా. అప్పుడే... ‘చిత్రం’ సినీ వారపత్రిక చూశాను. ‘జయం’ సినిమా కోసం నూతన నటీనటులు కావలెను అనే ప్రకటన అందులో కనిపించింది. వెంటనే నా ఫొటోలను, బయోడేటాను పంపించాను. నాకైతే పిలుపు వస్తుందని నమ్మకం లేదు. కానీ... అనుకోకుండా తేజగారి నుంచి కబురొచ్చింది. ఆ క్షణాలు నా జీవితంలో మరిచిపోలేను.
 
 నటనపై అవగాహన లేని మీరు ఒక్కసారిగా కెమెరా ముందుకెళ్లినప్పుడు భయం అనిపించలేదా?
 చచ్చేంత భయం వేసింది. పైగా తేజగారు కోపిష్టి. కొట్టేస్తారని చాలా మంది భయపెట్టారు. ఆ భయంలోనే తొలి షాట్‌కే 14 టేకులు తిన్నాను. ఇంకేముంది... తేజ కొట్టేస్తారేమో అనుకున్నా. కానీ ఆయన ఒక్క మాట కూడా అనలేదు. పైగా 15వ టేక్ ఓకే అవ్వగానే... తాను క్లాప్స్ కొట్టి, యూనిట్ అందరితో క్లాప్స్ కొట్టించారు. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఆయనే.
 
 రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోయారు కదా, మీ ఊళ్లో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి?
 మా తాతగారి పేరు పూసల్ల సూరిబాబు. చాలా ఫేమస్. మా నాన్నగారి పేరు గుప్తా. మా నాన్నగారిక్కూడా వైజాగ్‌లో చాలా మంచి పేరుంది. నన్నందరూ ‘గుప్తాగారబ్బాయి’ అని పిలిచేవారు. కానీ ఇప్పుడు అందరూ మా నాన్నను ‘సుమన్‌శెట్టి నాన్న’ అంటున్నారు. ఇంతకంటే ఏం సాధించాలి. మాది పెద్ద వ్యాపారం. మా షాపు ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంటుంది. కానీ ‘జయం’ తర్వాత మా షాపుకు సరుకు కోసం వచ్చేవారికంటే నన్ను చూడ్డానికి వచ్చిన వాళ్లు ఎక్కువ అయిపోయారు. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోయాం.
 
 తమిళంలో కూడా మీకు మంచి స్టార్‌డమ్ ఉన్నట్టుంది?
 ఇక్కడ లాగే అక్కడ కూడా నన్ను చాలా అభిమానిస్తారండీ. తమిళ ‘జయం’, ‘7/జి బృందావన్ కాలనీ’ చిత్రాలు అక్కడ కూడా నాకు మంచి పేరు తెచ్చాయి. దాదాపు తమిళ స్టార్స్ అందరితో నటించా. నన్ను తమిళియన్ అనుకునేవారు అక్కడ కోకొల్లలు. కొందరైతే ‘నువ్వు ప్రముఖ హాస్యనటుడు సెంథిల్ కొడుకువా..’ అని అడుగుతుంటారు. చాలామంది నన్ను అలాగే అనుకుంటారు కూడా.
 
 మీరేం చెబుతారు?
 ‘నేను తెలుగువాణ్ణి. మాది వైజాగ్..’ అని గర్వంగా చెబుతా. ఏ భాషలో నటిస్తున్నా... నా భాషను, నా ప్రాంతాన్ని గౌరవించుకోవడం నా ధర్మం.
 
 ప్రస్తుతం చేస్తున్న సినిమాలు?
 ఆడు మగాడ్రా బుజ్జీ, మసాలా సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి. రింగ్‌టోన్, మనుషులతో జాగ్రత్త సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా ఇతర భాషల్లో కూడా బిజీగా ఉన్నాను.
 
 డ్రీమ్ కేరక్టర్ ఏమైనా ఉందా?
 నవ్విస్తూ ఏడిపించే పాత్ర చేయాలని ఉంది. అలాగే నవ్విస్తూ... కోపం తెప్పించే పాత్ర చేయాలని ఉంది.