అప్పటి నుంచి మా ప్రయాణం మొదలైంది

29 Oct, 2019 01:28 IST|Sakshi
విజయ్‌ కృష్ణ, రిజ్వాన్, నిక్కీ తంబోలి, శ్రీవిష్ణు, అచ్యుత రామారావు

– శ్రీవిష్ణు

‘‘అసుర’ సినిమా నుంచి విజయ్‌ కృష్ణ, నా ప్రయాణం కొనసాగుతోంది. మాకు ఒక ప్లాట్‌ఫామ్‌ కావాలని రెండు మూడు సినిమాలు నిర్మించాం. అందులో నేను చిన్న చిన్న వేషాలు వేశాను. నేను కొంచెం మంచి సినిమాలు చేశాక ఇద్దరం సినిమా చేద్దామనుకున్నాం. తను ఇచ్చిన మాట కోసం నాతో ‘తిప్పరా మీసం’ సినిమా చేశాడు’’ అని శ్రీవిష్ణు అన్నారు. ‘అసుర’ ఫేమ్‌ విజయ్‌ కృష్ణ ఎల్‌. దర్శకత్వంలో శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి జంటగా తెరకెక్కిన చిత్రం ‘తిప్పరా మీసం’. శ్రీ హోమ్‌ సినిమాస్‌ సమర్పణలో రిజ్వాన్‌ నిర్మించిన ఈ సినిమా నవంబర్‌ 8న గ్లోబల్‌ సినిమాస్‌ ద్వారా విడుదలవుతోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో దర్శకుడు విజయ్‌ కృష్ణ మాట్లాడుతూ– ‘‘ఒక మంచి సినిమా చేద్దామని నేను, శ్రీవిష్ణు ‘తిప్పరామీసం’ స్టార్ట్‌ చేశాం. ఆ తర్వాత నా ఫ్రెండ్‌ అచ్యుత రామారావు, రిజ్వాన్‌ జాయిన్‌ అయ్యారు. శ్రీవిష్ణు, నిక్కి బాగా నటించారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన రిజ్వాన్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు నిక్కీ తంబోలి. ‘‘ఈ సినిమాకి విజయ్‌ హార్ట్‌ అయితే, శ్రీవిష్ణు ప్రాణం. వారిద్దరూ కష్టపడి ఈ సినిమా చేశారు’’ అన్నారు రిజ్వాన్‌. సహనిర్మాత అచ్యుత రామారావు, హాస్యనటుడు నవీన్, సంగీత దర్శకుడు సురేష్‌ బొబ్బిలి, ఎడిటర్‌ ధర్మేంద్ర, పాటల రచయిత పూర్ణచారి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు