టైటిల్‌ పెట్టావ్‌ సరే... జాగ్రత్తగా తియ్‌ అన్నారు

12 Feb, 2018 04:07 IST|Sakshi
వెంకీ అట్లూరి

‘‘జ్ఞాపకం, స్నేహగీతం చిత్రాల్లో నటించాను. రైటర్‌గా ‘ఇట్స్‌ మై లవ్‌స్టోరీ, స్నేహగీతం, కేరింత’ చేశాను. రాయటం స్టార్ట్‌ చేసిన దగ్గర్నుంచి యాక్టింగ్‌వైపు ఇంట్రెస్ట్‌ తగ్గింది. యాక్టింగా? రైటింగా? అని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు రైటింగ్‌ టు డైరెక్షన్‌ అని డిసైడ్‌ అయ్యాను’’ అన్నారు వెంకీ అట్లూరి. వరుణ్‌ తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీయస్‌యన్‌ ప్రసాద్‌ నిర్మించిన ‘తొలిప్రేమ’ శనివారం విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెంకీ చెప్పిన విశేషాలు...

► దర్శకులు రాఘవేంద్రరావుగారు ఆదివారం మార్నింగ్‌ బెస్ట్‌ కాంప్లిమెంట్‌ ఇచ్చారు. ఆయన తెలుగు ఇండస్ట్రీకి ఫస్ట్‌ షో మ్యాన్‌. అలాంటి ఆయన దగ్గర్నుంచి కాంప్లిమెంట్‌ రావడం ఫుల్‌ హ్యాపీ. ఆర్‌.నారాయణమూర్తిగారు కాంప్లి్లమెంట్‌ ఇచ్చారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌గారు సినిమా చూసి, ట్విట్టర్‌లో రియాక్ట్‌ అవ్వడం చాలా సంతోషాన్నిచ్చింది.

► ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌లో ఫ్యాన్స్‌కు ప్రామిస్‌ చేశా. పవన్‌ కల్యాణ్‌గారి ‘తొలిప్రేమ’ సినిమా అంత కాకపోయినా ఆ సినిమా గౌరవాన్ని కాపాడేలా మా ‘తొలిప్రేమ’ చిత్రం ఉంటుందని. కాపాడాననే అనుకుంటున్నాను. ‘తొలిప్రేమ’ టైటిల్‌ పెట్టినప్పుడు ఫ్యాన్స్‌ నుంచి ఏమైనా కాల్స్‌ వస్తాయేమో అనుకున్నాను. కానీ లేదు. ‘టైటిల్‌ పెట్టావ్‌ సరే .. జాగ్రత్తగా తియ్‌’ అని కొందరు ఫ్యాన్స్‌ అన్నారు. టైటిల్‌ పోస్టర్‌ను లాంచ్‌ చేసినప్పుడు వాళ్లు బాగా వెల్‌కమ్‌ చేశారు. ఎందుకు పెట్టావ్‌? అని ఏ సైడ్‌ నుంచి రాలేదు.

► నిజానికి ఈ సినిమా స్క్రిప్ట్‌ రాసినప్పుడు వరుణ్‌ తేజ్‌ తొలి సినిమా ‘ముకుంద’ కూడా రిలీజ్‌ కాలేదు. టీజర్‌ రిలీజైంది. అప్పుడు ఇలాంటి హీరో మన సినిమాలో ఉంటే బాగుంటుందనిపించింది. వరుణ్‌ ‘కంచె’ చూసినప్పుడు ఏ రోల్‌ అయినా చేయగలడనిపించింది. ‘లోఫర్‌’ సినిమా టైమ్‌లో తనకు కథ చెప్పా. ఓకే అన్నారు. ఈ కథను ముందు ‘దిల్‌’ రాజుగారికి చెప్పాను. ఆయన చాలా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటంతో ప్రసాద్‌గారిని కలిశాను. ప్రసాద్‌ తనయుడు బాపీనీడు నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌. అలా ఈ ప్రాజెక్ట్‌ సెట్‌ అయ్యింది.

► త్రీ వేరియేషన్స్‌ ఉన్న క్యారెక్టర్స్‌ కోసం వరుణ్, రాశీఖన్నా లుక్స్‌ పరంగా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇద్దరూ సూపర్‌గా నటించారు.  తమన్‌ సొంత కథలా ఫీలయ్యి మంచి సంగీతం ఇచ్చాడు.

► సినిమా కాస్త లేట్‌ అయ్యింది. అది మంచికే జరిగిందనుకుంటున్నాను. స్క్రిప్ట్‌ను మరింత బాగా రెడీ చేసుకున్నా. డిస్కషన్స్‌ బాగా జరిగాయి. కానీ ‘ఫిదా’ రిలీజ్‌ తర్వాత ‘తొలిప్రేమలో’ ఏ మార్పూ చేయలేదు. ‘ఫిదా’ సినిమా రిలీజైన 10 డేస్‌ తర్వాత ‘తొలిప్రేమ’ సినిమా షూటింగ్‌ను స్టార్ట్‌ చేశాం.

► లవ్‌స్టోరీ, డ్రామా, కాస్త పొలిటికల్‌ ఇంపాక్ట్‌ ఉన్న సినిమాలు, బయోపిక్‌ జోనర్‌లు అంటే ఇష్టం. పొలిటికల్‌ ఇంపాక్ట్‌ అంటే.. సోషల్‌ మేసేజ్‌ రిలవెంట్‌ ఉన్నవి. నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ ఇంకా ఫిక్స్‌ కాలేదు. ప్రసాద్‌గారి బ్యానర్‌లో ఓ సినిమా చేయాలి. ‘దిల్‌’ రాజుగారి నిర్మాణంలో సినిమా ఉంటుంది.

మరిన్ని వార్తలు