ఐదుపైసల సోడా గుర్తొచ్చింది: రాజేంద్రప్రసాద్‌

15 Oct, 2019 00:28 IST|Sakshi
విశ్వంత్, రాజేంద్ర ప్రసాద్, హర్షిత, విశ్వనాథ్‌ మాగంటి

‘‘నా 42 ఏళ్ల  నటజీవితంలో మొదటి ఐదు సినిమాల వరుసలో నిలిచే చిత్రం ‘తోలుబొమ్మలాట’. ఇందులో సోడాల రాజు పాత్రలో నటించా. ఐదు పైసలతో సోడాలు తాగిన రోజులను ఈ సినిమా గుర్తు చేసింది’’ అని నటుడు రాజేంద్రప్రసాద్‌ అన్నారు. విశ్వనాథ్‌ మాగంటి దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్, విశ్వంత్, ‘వెన్నెల’ కిశోర్, హర్షిత ముఖ్యతారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘తోలుబొమ్మలాట’. దుర్గా ప్రసాద్‌ మాగంటి నిర్మించిన ఈ సినిమా నవంబర్‌లో విడుదల కానుంది.

హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఏమేం చేశాం? మన మూలాలు ఏంటి? అని తెలియజెప్పడానికైనా ఓ మంచి సినిమా ఉండాలి. ఆ లోటును తీర్చే సినిమా ‘తోలుబొమ్మలాట’. సాధారణంగా ఇలాంటి కథని 50 సినిమాల అనుభవం ఉన్న దర్శకుడు చేయాలి. కానీ, విశ్వనాథ్‌ వంటి కుర్ర దర్శకుడు ఈ కథ చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. ‘ఆ నలుగురు’ సినిమా చేశాక ఇంతకంటే ఇంకేముంటుందిలే అనుకున్నా. ఒళ్లు దగ్గర పెట్టుకో అని నన్ను మళ్లీ హెచ్చరించిన కథ ఇది.

నా నటజీవితంలో మరుపురాని సినిమా ఈ ‘తోలుబొమ్మలాట’ అన్నారు. ‘‘ఈ కథను రాసుకుని రాజేంద్రప్రసాద్‌గారి దగ్గరకు వెళ్లినపుడు ఓ గురువులా నన్ను ప్రోత్సహించారు’’ అన్నారు విశ్వనాథ్‌ మాగంటి. ‘‘కుటుంబ భావోద్వేగాలతో ఈ సినిమా తెరకెక్కింది’’ అన్నారు విశ్వంత్‌. ‘‘ఈ చిత్రంలో సోడాలరాజు స్నేహితుని పాత్ర చేశా’’ అన్నారు సీనియర్‌ నటుడు నారాయణరావు. నటుడు దేవీప్రసాద్, పాటల రచయిత చైతన్యప్రసాద్, హీరోయిన్‌ హర్షితాచౌదరి, నర్రా శ్రీనివాస్, కల్పన, సంగీతదర్శకుడు సురేష్‌ బొబ్బిలి, కెమెరామన్‌ సతీష్‌ ముత్యాల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ రమేష్‌ నూకవల్లి, ఆర్ట్‌డైరెక్టర్‌ మోహన్‌ కె.తాళ్లూరి తదితరులు పాల్లొన్నారు. 

మరిన్ని వార్తలు