కమర్షియల్ ఫార్ములాలో తొప్పి

17 Jul, 2014 01:34 IST|Sakshi
కమర్షియల్ ఫార్ములాలో తొప్పి

పక్కా కమర్షియల్ ఫార్ములాలో జనరంజక అంశాలతో తెరకెక్కిస్తున్న చిత్రం తొప్పి అంటున్నారు చిత్ర దర్శకుడు యురేకా. ఇంతకుముందు మదురై సంభవం, త్వరలో తెరపైకి రానున్న సిగప్పు ఎనక్కు పిడిక్కుం చిత్రాలను తెరకెక్కించిన ఈయన మంచి సాహితీవేత్త కూడా కావడం విశేషం. అలాగే దుబాయ్, మలేషియా వంటి దేశాల్యల వ్యాపారవేత్తలుగా ఎదిగి చిత్ర నిర్మాణంలోకి రంగ ప్రవేశం చేస్తున్న వారి సంఖ్య అధికం అవుతోంది. ఈ చిత్ర నిర్మాత పరమరాజ్ 30 ఏళ్ల క్రితం న్యూజిలాండ్‌కెళ్లి హోటల్ అధినేతగా ఎదిగి తాజాగా చిత్ర రంగ ప్రవేశం చేసి రాయల్ స్క్రీన్స్ పతాకంపై తొప్పి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రం నిర్మించాలన్నది తన 30 ఏళ్ల కల అని అంటున్న ఈయన తన కల సాకారానికి తన భార్య సహకారం ఎంతో ఉందన్నారు.

మురళిరాం, రక్షరాజ్‌లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జీఎం కుమార్, అరుళ్‌దాస్, తిలకర్, మునారు మణి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నిర్మాత పరమ్‌రాజ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్ర వివరాలను దర్శకుడు యురేకా మాట్లాడుతూ, తరతరాలుగా దొంగతనమే వృత్తిగా జీవిస్తున్న ఒక కుటుంబానికి చెందిన యువకుడు పోలీసు అధికారి కావాలని ఆశిస్తారని చెప్పారు.

ఆ ఆశతో పోలీసు ఇన్‌ఫార్మర్‌గా కొంతకాలం పని చేస్తాడని చెప్పారు. అయితే పోలీసు అధికారి కావాలనే అతని కోరికకు కుటుంబ నేపథ్యం పెద్ద సమస్యగా మారుతుందన్నారు. ఆ యువకుడు చివరకు లక్ష్యం సాధించాడా? లేదా? అన్నదే  కథ అని దర్శకుడు తెలిపారు. 47 రోజుల్లో చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసినట్టు చెప్పారు. తొప్పి చిత్రానికి కథే హీరో అని కథనం చాలా కొత్తగా ఉంటుందని చెప్పారు. చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. చిత్రానికి ఛాయాగ్రహణంను ఎం.సుకుమార్, సంగీతాన్ని రాంప్రసాద్ సుందర్ అందించారు.

>