నడిగర్‌సంఘం నిర్వాహకులకు బెదిరింపులు

30 Aug, 2016 02:04 IST|Sakshi
నడిగర్‌సంఘం నిర్వాహకులకు బెదిరింపులు

 తమిళసినిమా: నడిగర్‌సంఘం నిర్వాహకులకు బెదిరింపులు వస్తున్నట్లు ఆ సంఘ అధ్యక్షుడు నాజర్, మనోబాలా, పొన్‌వన్నన్, శరవణన్ తదితరులు సోమవారం ఉదయం నగర పోలీస్ కమిషనర్ టీకే.రాజేందర్‌ను కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందించారు. వారాహి అనే న డిగర్ సంఘం సభ్యుడు గత 27వ తేదీన సంఘ నిర్వాహకులు అవినీతికి పాల్పడినట్లు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆయన 50 మంది సహాయ నటీనటులతో కలిసి సంఘం ఆవరణలో ఆందోళనకు దిగారు. ఈ సంఘటన చిత్ర పరిశ్రమలో పెద్ద కలకలాన్నే సృష్టించింది.
 
  అయితే వారాహి ఆరోపణలకు స్పంధించిన సంఘం కార్యద ర్శి విశాల్, కోశాధికారి కార్తీ ఉద్దేశపూర్వకంగానే వారాహి సంఘంపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయనపై తగిన చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ఉదయం సంఘం అధ్యక్షుడు నాజర్, మనోబాలా, పొన్‌వన్నన్, శరవణన్ తదితరులు నగర పోలీస్ కమిషనర్ టీకే రాజేంద్రన్‌కు ఫిర్యాదు పత్రాన్ని అందించారు. అనంతరం విలేకులతో నాజర్ మాట్లాడుతూ సంఘానికి సంబంధించిన విషయాలను ఎవరు ఎప్పుడు వచ్చి అడిగినా వివరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వారాహి అనే వ్యక్తి దురుద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారన్నారు.
 
 అయితే సంఘంపై ఎలాంటి మరక పడకుండా చేయడానికి ప్రాణాలైనా ఒడ్డుతామన్నారు. తాము ప్రస్తుతం సంఘం సభ్యుల సంక్షేమం కోసం పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అందుకు సభ్యులతో పాటు, ఇతరులను కలుపుకుని పోతున్నామని తెలిపారు. సంఘ భవన నిర్మాణాన్ని 6 వేల చదరపు అడుగులలో కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అందుకు ఇంకా అనుమతి పొందాల్సి ఉందని అన్నారు. 27వ తారీకున సంఘం ఆవరణలో ఆందోళనకు దిగిన వారు సంఘం ఉద్యోగి ఫోన్ లాక్కుని విసిరేశారనీ తెలిపారు.
 
  హత్యా బెదిరింపులు చేశారనీ అన్నారు. బెదిరింపులకు పాల్పడిన చెంగయ్య, రాజు, ఉషా, కోవైలక్ష్మి, అఖిల, రాణి, దేవి తదితరులపై  తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశామని తెలిపారు. సంఘ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని అందులో పేర్కొన్నట్లు నాజర్ తెలిపారు. వారాహి కూడా పోలీస్ కార్యాలయంలో నడిగర్ సంఘం సభ్యులకు వ్యతిరేకంగా ఫిర్యాదు లేఖను అందించారన్నది గమనార్హం.