విజయం ఎవరిని వరిస్తుందో?

7 Oct, 2016 02:08 IST|Sakshi
విజయం ఎవరిని వరిస్తుందో?

విజయదశమికి నాలుగు రోజుల ముందుగానే కోలీవుడ్‌కు పండగ వచ్చేసింది. సాధారణంగా దసరా, దీపావళి, క్రిస్మ్‌స్, సంక్రాంతి పర్వదినాల్లో ప్రజల్లో ఎంత పండగ వాతావరణం నిండుకుంటుందో, అంతే సందడి చిత్ర పరిశ్రమలోనూ ఏర్పడుతుంది. ఆయా రోజులు సెలవు దినాలు కావడంతో జనం ముఖ్యంగా యువత సినిమాలు చూడడానికి అధిక ఆసక్తి చూపుతుంటారు.
 
 అందుకు తగ్గట్టుగానే సినీ దర్శక నిర్మాతలు తమ చిత్రాలు ఆ సమయాల్లో విడుదల చేయాలని కోరుకుంటారు.ప్రత్యేకించి దసరాకు పాఠశాలలు అధిక సెలవులు రావడంతో చదువుకునే పిల్లలు కూడా సినిమాలపై దృష్టి పెడతారు. ఇక సినిమా ప్రియులు ఉండనే ఉంటారు. దీంతో థియేటర్లు పిన్నపెద్దలతో కళకళలాడుతుంటాయి. నిర్మాతలు, బయ్యర్ల గల్లాపెట్టెలు గలగలలాడుతుండడానికి ఇన్ని కారణాలున్నాయి. అలా కలెక్షన్లను దోచుకోవడానికి ఈ దసరా పండగను పురస్కరించుకుని రెమో, రెక్క, దేవి మూడు తమిళ చిత్రాలతో పాటు ప్రేమమ్ అనే తెలుగు చిత్రం కూడా సిద్ధం అయ్యింది. ఇక వీటి వివరాలు చూస్తే..
 
రెమో... నటుడు శివకార్తికేయన్ నటించిన తాజా చిత్రం ఇది.పలు ప్రత్యేకతలతో శుక్రవారం తెరపైకి రానుంది. శివకార్తికేయన్ అందమైన నర్సుగా కనిపించడం రెమోలోని ప్రధాన ప్రత్యేకత. ఇక రజనీమురుగన్ చిత్రం తరువాత మరో సారి చిరునవ్వుల చిన్నది కీర్తీసురేశ్ శివకార్తికేయన్‌తో జత కట్టిన చిత్రం ఇది. ఈ చిత్రానికి నవ దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు.అనిరుద్ సంగీతాన్ని, పీసీ.శ్రీరామ్ వంటి ప్రముఖ చాయాగ్రహకుడు ఈ చిత్రానికి పని చేయడం మరో విశేషం.
 
 రెమో చిత్రంపై ఇటు పరిశ్రమలోనూ,అటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండో చిత్రం రెక్క.  నటుడు విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటించిన చిత్రం రెక్క. ఇందులో ఆయనకు జంటగా నటి లక్ష్మీమీనన్ తొలి సారిగా జత కట్టారు. రతన్‌శివ దర్శకుడు.డి.ఇమాన్ సంగీతాన్ని అందించారు. విజయ్‌సేతుపతి నటించిన పక్కా మాస్ కథా చిత్రం కనుక సహజంగానే రెక్కపై అంశనాలు భారీగానే ఉంటాయి. ఇక మూడో చిత్రం దేవి. డాన్సింగ్ కింగ్ ప్రభుదేవా సుధీర్ఘ విరామం తరువాత కథానాయకుడిగా నటించి, ఐ.గణేశ్‌తో కలిసి సొంతంగా నిర్మించిన చిత్రం దేవి.
 
 ఇందులో మిల్కీబ్యూటీ నాయకిగా నటించారు. విజయ్ దర్శకత్వం వహించిన తొలి హారర్‌తో కూడిన విభిన్న ప్రేమ కథా చిత్రం దేవి. దీంతో దేవి చిత్రం కూడా రెమో, రెక్క చిత్రాలతో పోటీ పడుతోంది. ఈ ముక్కోణపు పోటీలో ఏ చిత్రానికి ప్రేక్షక దేవుళ్లు బ్రహ్మరథం పడతారో అన్నది మరి కొద్ది గంటల్లోనే తెలిపోనుందన్నమాట. ఇక నాలుగో చిత్రంగా తెలుగు చిత్రం ప్రేమమ్ తమిళనాట ఇదే రోజు విడుదల కానున్నదన్నది గమనార్హం.
 
టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్య హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రుతిహాసన్,అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ నాయికలుగా నటించారు. ఈ చిత్రం ప్రత్యేకత గురించి చెప్పనక్కర్లేదు. ఇది మలయాళంలో ఇదే పేరుతో విడుదలై అనూహ్య విజయాన్ని సాధించింది. ఇది చెన్నైలోనూ అధిక థియేటర్లలో విడుదల కానండడం విశేషం.
 

>