నాలుగేళ్ల తర్వాత...

2 Jun, 2019 05:13 IST|Sakshi
రానా,గుణశేఖర్‌

అదిగో ఇదిగో అంటూ సినీప్రేక్షకులను ఊరిస్తూ వస్తున్న రానా ‘హిరణ్యకశ్యప’ సినిమా అధికారిక ప్రకటన రానే వచ్చింది. దర్శకుడు గుణశేఖర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ‘‘మైథలాజికల్‌ ఫిల్మ్‌ ‘హిరణ్యకశ్యప’పై నేను వర్క్‌ చేస్తున్నాను. నటుడు రానా దగ్గుబాటి టైటిల్‌ రోల్‌ చేయనున్నారు. విస్తృత స్థాయిలో మూడేళ్లుగా ఈ సినిమా ప్రీ–ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవును.. మూడేళ్లుగా చేస్తూనే ఉన్నాం. చాలా ఉత్తేజంగా ఉన్నాం. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం.

రానాతో ఇది ఎగై్జటింగ్‌ జర్నీగా ఉండబోతోంది’’ అని దర్శకుడు గుణశేఖర్‌ వెల్లడించారు. ఈ సినిమాను సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అలాగే మైథలాజికల్‌ సినిమా కాబట్టి గ్రాఫిక్స్‌ వర్క్‌ కూడా బాగానే ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సంగతి ఇలా ఉంచితే ... 2015లో వచ్చిన పీరియాడికల్‌ మూవీ ‘రుద్రమదేవి’ తర్వాత గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ప్రస్తుతం ‘అరణ్య’ సినిమాతో రానా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు