ఆమిర్‌ సినిమాకు పెట్టుబడి కూడా రాదా..?

13 Nov, 2018 17:20 IST|Sakshi

మిస్టర్‌ పర్ఫెక్షనిస్టు ఆమిర్‌ ఖాన్‌, బిగ్‌ బీ అమితాబ్‌ కలిసి మొట్టమొదటిసారిగా నటించిన ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ సినిమా ఫేల్యూర్‌ బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాహుబలి రికార్డులను బ్రేక్‌ చేయొచ్చని ఆశపడ్డ ఆమిర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ప్రపంచవ్యాప్తంగా 5000 స్క్రీన్లలో.. భారీ స్థాయిలో రిలీజ్‌ అయిన ఈ సినిమాకు దారుణమైన టాక్‌ వచ్చింది.  సినిమా విడుదలైన ఫస్ట్‌షో నుంచే నెగెటివ్‌ టాక్‌ మొదలై.. కలెక్షన్లకు గండిపడింది. బాహబలి రికార్డులను తిరగరాయడం మాట అటుంచితే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేట్టు లేదు. ఈ మూవీ ఇప్పటి వరకు 100 కోట్ల మార్కును మాత్రమే దాటిందని ప్రముఖ ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. గత నాలుగు రోజులుగా ఈ సినిమా కలెక్షన్లు ఎంత దారుణంగా పడిపోయాయో వెల్లడించారు. (‘థగ్స్‌’కు అంత సీన్‌ లేదు..!)

హిందీ పరిశ్రమ వసూళ్లు (కోట్లలో) : 
గురువారం- 50.75; శుక్రవారం- 28.25; శనివారం- 22.75; ఆదివారం- 17.25; సోమవారం- 5.50
మొత్తం : 124.50 కోట్లు

తెలుగు+తమిళం వసూళ్లు (కోట్లలో) :
గురువారం- 1.50 కోట్లు; శుక్రవారం- 1 కోటి; శనివారం-75 లక్షలు; ఆదివారం- 75 లక్షలు; సోమవారం- 50 లక్షలు
మొత్తం : 4.5 కోట్లు

ఇక థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌ కథ, కథనం సీరియల్‌ తరహాలో సాగడంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించలేకపోయారని సినీ విమర్శకులు రివ్యూలు రాశారు. విమర్శకుల రివ్యూలు పక్కనబెడితే.. సోషల్‌ మీడియా వేదికగా ఈ సినిమాపై అభిమానులు చేస్తున్న కామెంట్లు ప్రస్తుతం ట్విటర్‌లో ట్రెండింగ్‌ అవుతుండటం విశేషం. ట్విటరటీలు చేసిన కొన్ని ఆసక్తికర కామెంట్లు మీకోసం..

ఈ సినిమా మొదలైన 20 నిముషాల తర్వాత.. ఓ యువతి ‘నన్ను వెళ్లనీయండి ప్లీజ్‌.. నేను వెళ్లాలి’  అంటూ దీనంగా అర్థించే వీడియో ఒకరు పోస్టు చేయగా..  టికెట్‌ డబ్బులు తిరిగి చెల్లించాలని మరొకరు ట్వీట్‌ చేశారు. సినిమా చూసొచ్చిన అభిమానులంతా కట్టగట్టుకుని బావిలో దూకే వీడియో పెట్టి మరొకరు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ సినిమాకు షారుఖ్‌ఖాన్‌ తాజా మూవీ... ‘జీరో’ రేటింగ్‌ ఇస్తున్నామని ఇంకొకరు వ్యంగ్యాస్త్రం వేశారు. ఇంకోవైపు.. థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌ అద్భుతంగా ఉందనీ, ఆమిర్‌, అమితాబ్‌ నటనకు జేజేలు పలుకుతున్నారు కొందరు అభిమానులు. కాగా, విజయ్‌ కృష్ణ ఆచార్య తెరకెక్కించిన ఈ సినిమాలో కత్రినా కైఫ్‌, దంగల్‌ ఫేం.. ఫాతిమా సనా షేక్‌ నటించారు.

మరిన్ని వార్తలు