తెలుగు తెరకు సిసలైన పండగ

5 Feb, 2015 23:11 IST|Sakshi
తెలుగు తెరకు సిసలైన పండగ

సందర్భం: తెలుగుసినిమా పుట్టినరోజు
తెలుగు సమాజంపై అమితంగా ప్రభావం చూపుతున్న మాధ్యమం అంటే, నిస్సందేహంగా సినిమానే! కట్టూబొట్టూ, మాట, పాట, మనిషి తీరూ- ఇలా అన్నిటిపైనా ముద్ర వేసిన పాపం, పుణ్యం మన సినిమాలదే. అలాంటి తెలుగు సినిమాకు ఇవాళ పుట్టినరోజు, ప్రేక్షకులకు పండగ రోజు. తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్తప్రహ్లాద’ 83 ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజున విడుదలైంది. ప్రముఖ దర్శకుడు హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలో తయారై,1932 ఫిబ్రవరి 6న రిలీజవడంతో పూర్తి స్థాయి తెలుగు చిత్రాలు మొదలయ్యాయి.
 
అంతకు ముందు దాకా భాషతో ప్రమే యం లేని మూగచిత్రాలు (మూకీలు) వచ్చేవి. తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ 1931 మార్చి 14న విడుదలవడంతో ఆయా భాషల వారీగా వాక్చిత్రాలు (టాకీలు) రావడం మన దేశంలో మొదలైంది. ‘ఆలమ్ ఆరా’కు దర్శకత్వ శాఖలో పని చేసిన హెచ్.ఎం. రెడ్డే ఆ తరువాత సరిగ్గా ఏడున్నర నెలలకు తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్’ను రూపొందించారు. ప్రధానంగా తమిళం, కొన్ని  తెలుగు మాటలు -పాటలు, అక్కడక్కడా హిందీ డైలాగులతో తయారైన సినిమా ‘కాళిదాస్’.

ఆ చిత్రం 1931 అక్టోబర్ 31న విడుదలైంది. దర్శక - నిర్మాతలు అప్పట్లో ‘‘తొలి తమిళ - తెలుగు టాకీ’’ అంటూ ‘కాళిదాస్’కు ప్రకటనలు జారీ చేశారు. ఆ సగం తెలుగు సినిమా విడుదలై, విజయవంతం కావడంతో, ఈ సారి పూర్తిగా తెలుగులోనే తీయాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు మళ్ళీ హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలోనే పూర్తి తెలుగు టాకీగా ‘భక్త ప్రహ్లాద’ రూపొందింది. ఆ చిత్ర నిర్మాణం, సెన్సారింగ్, తొలి విడుదల కూడా బొంబాయిలోనే!
 
నిజానికి, సగం తెలుగున్న‘కాళిదాస్’ కన్నా ముందే, ఈ పూర్తి తెలుగు టాకీ 1931 సెప్టెంబర్ 15న వచ్చిందని కొద్దికాలం ఆధారరహిత ప్రచారం జరిగింది. అయితే, అది వాస్తవం కాదని సీనియర్ జర్నలిస్టు, పరిశోధకుడు డాక్టర్ రెంటాల జయదేవ కొన్నేళ్ళ పరిశ్రమతో, సాక్ష్యాధార సహితంగా ఆ మధ్య నిరూపించారు. ‘భక్త ప్రహ్లాద’ 1932 జనవరి 22న సెన్సార్ పూర్తి చేసుకొని, ఫిబ్రవరి 6న విడుదలైనట్లు అసలు నిజాలు వెలికితీశారు.  
 
ఈ తొలి పూర్తి తెలుగు సినిమా కేవలం 18 వేల రూపాయల పెట్టుబడితో, 18 రోజుల్లో నిర్మాణమైంది. మొత్తం 9,762 అడుగుల నిడివిగల 10 రీళ్ళ సినిమా ఇది. ధర్మవరం రామకృష్ణమాచార్యుల నాటకం ఆధారంగా, సురభి నాటక సంస్థ నటులతో సినిమా తీశారు. హిరణ్యకశిపుడిగా మునిపల్లె సుబ్బయ్య, అతని భార్య లీలావతిగా ‘సురభి’ కమలాబాయి, వారి బిడ్డ ప్రహ్లాదుడిగా మాస్టర్ కృష్ణారావు ముఖ్యపాత్రధారులు.

అలా మొదలైన సినిమా హంగామా ఇవాళ్టికీ తెలుగునాట అప్రతిహతంగా సాగుతోంది. కానీ, మనవాళ్ళ అశ్రద్ధ వల్ల ఈ చిత్రాల ప్రింట్లే లేవు. ఇప్పటికైనా మన సినిమా పెద్దలు కళ్ళు తెరిచి పుణే ఫిల్మ్ ఆర్కైవ్స్ లాంటి చోట్ల మిగిలిన మన కొద్దిపాటి పాత తెలుగు చిత్రాల ప్రింట్లనైనా డిజిటలైజ్ చేయిస్తారా? మన సినిమాకు అసలైన బర్‌‌తడే గిఫ్టి స్తారా? లేక మన తెలుగు ప్రభుత్వాలు పరస్పర విభేదాల్లో పడి వాటినీ గాలిలో కలిపేస్తాయా?