అస్తిత్వం, వ్యక్తిత్వం లేని వాళ్ల పని ఇది: ఉత్తేజ్‌

31 May, 2020 11:29 IST|Sakshi

హైదరాబాద్‌: సోషల్‌ మీడియా వేదికగా కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. సినీ సెలబ్రెటీల పేరుతో నకిలీ అకౌంట్లను సృష్టించి వివాదస్పద పోస్టులు చేస్తున్నారు. ఇప్పటికే విలక్షణ నటుడు రావు రమేశ్‌ పేరుతో ట్విటర్‌లో ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ చేసి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై, టాలీవుడ్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై వివాదస్పదంగా ట్వీట్లు చేశారు. క్షణాల్లోనే ఈ ట్వీట్లు వైరల్‌ అయ్యాయి. దీంతో ఈ ట్వీట్లపై రావు రమేశ్‌ స్పందించారు. ‘సోషల్ మీడియాలో నా పేరుతో వచ్చిన పోస్టులకు నాకెలాంటి సంబంధం లేదు. నా పేరుతో సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్‌ క్రియేట్ చేసి.. పోస్టులు చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా’అని రావు రమేష్‌ మీడియాకు వెల్లడించారు. 

తాజాగా నటుడు ఉత్తేజ్‌ కూడా నకిలీ అకౌంట్ల సమస్య బారిన పడ్డారు. ఆయన పేరుతో ఫేక్‌ ట్విటర్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసి పలు అ‍భ్యంతకర పోస్టులు చేస్తున్నారు. దీంతో ఈ ట్వీట్లపై ఉత్తేజ్‌ స్పందించారు. ‘నమస్తే!! సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో నాకు ట్విటర్ అకౌంట్ లేనే లేదు. నా పేరుతో వస్తున్న తప్పుడు వార్తల్ని ఖండిస్తున్నాను. సంఘంలో ఓ అస్తిత్వం, వ్యక్తిత్వం లేని వాళ్లు మాత్రమే ఇలాంటి చీప్ ట్రిక్స్ తో వాగుతుంటారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నాను’ అని ఉత్తేజ్ మీడియాకు వివరించారు. ఇక నకిలీ ఆకౌంట్లపై టాలీవుడ్‌ ప్రముఖులు అందోళన చెందుతున్నారు. నకిలీ ఖాతాలను నియంత్రించేలా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  

చదవండి:
ట్విటర్‌ పోస్టులపై క్లారిటీ ఇచ్చిన రావు రమేష్
మహేశ్‌ సర్‌ప్రైజ్‌ వచ్చింది.. ట్రెండింగ్‌లో టైటిల్‌

మరిన్ని వార్తలు