మేమూ మనుషులమే!

16 Mar, 2017 03:08 IST|Sakshi
మేమూ మనుషులమే!

లేచింది మహిళా లోకం ఇది చాలా ఏళ్ల క్రితం పాట. అప్పటి నుంచే స్త్రీ అబలను కాను సబలనని నిరూపించుకుంటూ సమాజంలో తన ప్రతిభను, శక్తిని పెంచుకుంటున్నారు. పురుషులకు తాము ఎందులోనూ తక్కువ కాదని ఇంకా చెప్పాలంటే కాస్త ఎక్కువేనని నిరూపించుకుంటున్నారు. అయితే దీనికి మరో కోణం ఉంది. అదే మగ మృగాలకు బలవుతున్న అబలలు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు వంటి అరాచకాల సంస్కృతికి ఇకనైనా విడనాడండి అంటోంది నేటి స్త్రీజాతి. మహిళా వేధింపుల గురించి ప్రముఖ సినీ తారలు తమన్నా, తాప్సీ, అమలాపాల్, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ లాంటి వారు ఎలా స్పందిస్తున్నారో చూద్దాం.

ఎన్నో చేదు అనుభవాలు:
సమాజంలో ప్రతి మహిళ శారీరకంగా, మానసికంగా ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొంటూనే ఉంటుంది. బస్సుల్లో పయనిస్తున్నప్పుడు, రోడ్డుపై నడుస్తున్నప్పు డు,  అసభ్యకరమైన సంఘటనల గురించి వారు బయటకు చెప్పుకోలేరన్న ధైర్యమే మగవారి దుశ్చర్యలు కొనసాగడానికి కారణం. అయితే స్త్రీలు వారి ఆగడాలను ధైర్యంగా ఎదిరించాలి. అప్పుడే ఆడవారిపై అత్యాచారాలు, నేరాలు తగ్గుతాయి.ఇకపై మగువలకు తల దించుకునే పరిస్థితి తలెత్తకూడదు. ఇతరుల కోసం మన ఇష్టాలను, కలలను హరించుకోకూడదు. చరిత్రలో ఉన్నతమైన స్త్రీలను స్ఫూర్తిగా తీసుకుని నేటి మహిళ ప్రగతి పథంలో సాగాలి అని నటి తాప్సీ పేర్కొన్నారు.

స్త్రీలంటే చిన్న చూపు :
మహిళలను ఇప్పటికీ చాలా మంది చిన్న చూపు చూస్తున్నారు. సున్నితంగా ప్రవర్తిం చడం, నిజాయితీగా నడుచుకోవడం మహిళల బలహీనతగా భావిస్తున్నారు. కానీ అవే వారి బలం అని గుర్తెరగాలి. నా జీవితం చాలా పాఠాలు నేర్పింది. కొన్ని అపజయాలు జీవితాన్నే మార్చేస్తాయి. అలాంటివి నా జీవిత మలుపునకు కారణం అయ్యాయి. ఓటమిని గెలవడానికి చివరి వరకూ పోరాడే వారంటే నాకు గౌరవం అని నటి అమలాపాల్‌ పేర్కొన్నారు.

ఒకరు ఇవ్వడం కాదు :
గతంతో పోల్చుకుంటే మహిళల్లో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ఇంతకు ముందులా వారు అణగదొక్కబడడం లేదు. సినిమాల్లో కూడా స్వాతంత్య్రం లభిస్తోంది. ఇక్కడ కథానాయికలను ఉన్నతంగా చూపిస్తున్నారు. ఒకప్పుడులా పలాన దుస్తులే ధరించాలన్న ఒత్తిడి ఇప్పుడు లేదు. నాకు డ్రస్‌ సౌకర్యంగా లేకపోతే వాటిని ధరించను. మహిళలు ఆత్మాభిమానాన్ని కోల్పోరాదు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్లను ఒకరు ఇస్తే పొందకూడదు. మనమే సాధించుకోవాలి అని నటి తమన్నా పేర్కొన్నారు.

పోరాట గుణాన్ని పెంపొందించుకోవాలి :
ఇటీవల నటి భావన లైంగిక వేధింపులకు గురైన సంఘటన మనసును బాధించింది. మమ్మల్ని మనుషులుగా భావించండి. స్త్రీలు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. చాలా భయానక సంఘటనలు జరుగుతున్నాయి. అలాంటి వాటి నుంచి మహిళలు తమను తాము కా పాడుకోవాలి. అందుకు మనోధైర్యాన్ని పెంపొందించుకోవాలి అని నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ అన్నారు.

>