దేవదాస్‌ కనకాలకు చిరంజీవి నివాళి

3 Aug, 2019 11:29 IST|Sakshi

సీనియర్‌ నటుడు, దర్శకుడు దేవదాస్‌ కనకాల శుక్రవారం తుదిశ్వాస విడిచారు. తన ఫిలిం ఇన్సిస్టిట్యూట్‌ ద్వారా ఎంతో మంది స్టార్స్‌ను అందించిన ఆయనకు తెలుగు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. దేవదాస్‌ కనకాల దగ్గర నటనలో శిక్షణ పొందిన మెగాస్టార్ చిరంజీవి ఆయన భౌతికకాయనికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాధ్, దర్శకుడు రాజమౌళి, గాయకుడు బాలసుబ్రమణ్యం, బ్రహ్మాజీ, హేమ, అనితా చౌదరిలతో పాటు పలువురు టీవీ నటులు కూడానివాళులర్పించిన వారిలో ఉన్నారు. యువ కథానాయకుడు మంచు మనోజ్‌ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ‘వేలాదిమంది ఆర్టిస్టులను తయారు చేసిన గురువుగారు మా దేవదాస్ కనకాల గారు. ఆ వేల మందిలో నేనూ ఒకడిని. ఎందరికో మార్గదర్శి అయిన మా గురువు గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. రాజీవ్ కనకాల గారికి, ఇతర కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించమని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను’ అం‍టూ ట్వీట్ చేశారు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సంతాపం
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ దేవదాస్‌ కనకాల మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో ‘దేవదాస్ కనకాల గారి మరణం సినీ పరిశ్రమకు తీరనిలోటు. ఆయన గొప్ప నటుడు మాత్రమే కాదు. ఎంతోమందికి నటనలో శిక్షణ ఇచ్చి, వాళ్లు నటులుగా పేరు సంపాదించుకోవడంలో పాలు పంచుకున్న గురువు కూడా. ఇటీవలే ఆయనను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ సత్కరించింది. ఇంతలోనే ఆయన ఇలా అందర్నీ వదిలి వెళ్లిపోవడం బాధాకరం. దేవదాస్ కనకాల గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి’ అని తెలిపింది.

>
మరిన్ని వార్తలు