మంత్రి తలసానితో తెలుగు సినీపెద్దలు భేటీ

21 Apr, 2018 20:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :మహిళలపై వేధింపులు, లైంగిక దాడుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని  తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఫిర్యాదుల కోసం ఎఫ్‌డీసీ (ఫిల్మ్‌ డివిజన్‌ కార్పొరేషన్‌)లో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో తెలుగు సినీ పెద్దలు శనివారం సమావేశం అయ్యారు. టాలీవుడ్‌లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై మంత్రితో చర్చించారు. సచివాలయంలోని మంత్రి తలసాని ఛాంబర్‌లో జరిగిన ఈ సమావేశంలో దర్శకుడు శంకర్‌, నటి జీవితా రాజశేఖర్‌, తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత సి కళ్యాణ్‌, మా అధ్యక్షుడు శివాజీ రాజా, నరేష్‌, పరుచూరి వెంకటేశ్వరరావు తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ రామ్మోహన్‌ రావు, హోం సెక్రటరీ రాజీవ్‌ త్రివేది తదితరులు పాల్గొన్నారు.

ఈ సమావేశం అనంతరం తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఫిల్మ్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్స్‌ను ప్రక్షాళన చేస్తామని తెలిపారు. టాలీవుడ్‌లో జరుగుతున్న వివాదాన్ని ఇంతటితో ముగించాలని సూచించారు. 'మా' సభ్యత్వంపై వివాదాలు వెల్లువెత్తుతుండటంతో ఇక చలనచిత్ర అభివృద్ధి సంస్థ ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించామని, అలాగే నటులకు నిర్మాతలే నేరుగా పారితోషికం ఇవ్వాలని, కోఆర్డినేటర్లు లేకుండా మేనేజర్ ద్వారానే నేరుగా బ్యాంకు ఖతాలకు చెల్లింపులు జరిపేలా చూడాలని ఆయన సూచనలు చేశారు. ఇక మీడియాపై దాడి చేయడాన్ని మంత్రి తలసాని ఖండించారు.

కాగా సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై 24 గంటల్లో స్పందించాలని జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ సినీ పెద్దలకు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో సినీ పరిశ్రమలోని 24 విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు సమావేశమయ్యారు. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో కాస్టింగ్ కౌచ్, టాలీవుడ్ సమస్యలు, ఇతర అంశాలపై కూలంకశంగా చర్చించారు. సినీ పరిశ్రమ అంతా యూనిటీగా ఉండాలని, సమస్యల పరిష్కారానికి ఒక కమిటీ వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ కమిటీ ఫిల్మ్‌చాంబర్ నియంత్రణలో పనిచేయనుంది. దాంతోపాటు ప్రస్తుత పరిణామాలపై, సినీ పరిశ్రమ తీసుకున్న నిర్ణయాలపై మంత్రి తలసానితో చర్చించారు.

మరిన్ని వార్తలు