పని ఉంటే మస్తు.. లేదంటే పస్తు

19 Mar, 2020 00:26 IST|Sakshi

సినిమా ఒక అందమైన హరివిల్లు. హరివిల్లులోని ఏడు రంగులు తళతళలాడాలంటే దాని వెనక ఇరవై నాలుగు విభాగాల్లో కొన్ని వందల మంది గడియారంలా నిరంతరం శ్రమించాలి.  ప్రేక్షకుడికి సినిమా కేవలం ఉల్లాసాన్నిచ్చే వినోదం కావొచ్చు. కానీ తెర వెనక.. కొన్ని వందల మంది ఉపాధి.  ప్రస్తుతం కరోనా సినిమా ఇండస్ట్రీని పని చేయనీకుండా చేసింది. అంటే చాలామందికి పని లేకుండా చేసినట్టే.

రీల్‌ (రెక్క) ఆడితే  కానీ డొక్కాడని జీవితాలు కృష్ణానగర్‌ వీధుల్లో తారసపడుతూనే ఉంటాయి. ‘నేనింతే’ సినిమాలో ఓ పాటలో అన్నట్టు ‘పని (షూటింగ్‌) ఉంటే మస్తుర మావా.. లేదంటే పస్తుర మావా’ అన్నట్లుంది ప్రస్తుత పరిస్థితి. స్పాట్‌బాయ్, లైట్‌మేన్, జూనియర్‌ ఆర్టిస్ట్‌లు, ఫైటర్స్, కాస్ట్యూమ్స్, ఆర్టిస్టుల అసిస్టెంట్స్, కెమెరా డిపార్ట్‌మెంట్, ప్రొడక్షన్‌ టీమ్, డ్రైవర్లు, మహిళా వర్కర్స్‌.. ఇలా 24 క్రాఫ్ట్స్‌లో ఉన్న చిన్న స్థాయి కార్మికుల మీద కరోనా ప్రభావం పడింది. స్టూడియోలు ఖాళీగా ఉంటున్నాయి.

24 క్రాఫ్ట్స్‌లో ఎక్కువ శాతం మంది ఏ రోజు జీతం ఆ రోజు తీసుకునేవాళ్లే.  అనుకో కుండా వచ్చిన ఈ బ్రేక్‌ వల్ల ఎందరో బడ్జెట్‌ పద్మనాభాల ఆర్థిక ప్రణాళికను కుప్పకూల్చింది. చెప్పాపెట్టకుండా ఊడిపడ్డ ఈ ఇబ్బంది వల్ల ఇంటి బండిని లాగడానికి ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు పలువురు కార్మికులు. రెండున్నర గంటల నిడివి ఉన్న సినిమా పూర్తికావడానికి కొన్ని నెలల నుంచి సంవత్సరాలు పడుతుంది. ఒకరోజు షూటింగ్‌లో ఆర్టిస్ట్‌ మీద కెమెరా రన్‌ అయ్యే ముందు కొన్ని వందల మంది అటూఇటూ పరుగులు తీయాలి.

ప్రొడక్షన్‌ వాళ్లు సెట్లో అడుగుపెట్టడంతో లొకేషన్‌ పొద్దు పొడుస్తుంది. ఆ తర్వాత లైటింగ్‌ డిపార్ట్‌మెంట్, సెట్‌ అస్టిస్టెంట్లు ఒకరి తర్వాత ఒకరు వస్తారు. సినీ సర్వీస్‌ సెంటర్లనుంచి కెమెరాలు వస్తుంటాయి. దర్శకుడు తన డైరెక్షన్‌ టీమ్‌తో ఆ రోజు తీయాల్సిన సన్నివేశాన్ని డిస్కస్‌ చేసుకుంటారు. ఈలోగా ఆర్టిస్టులు వచ్చి సన్నివేశానికి అనుగుణంగా తయారయి షాట్‌ రెడీ అయినప్పుడు క్యారవేన్‌ నుంచి బయటకు వస్తారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకూ ఒక కాల్షీట్, అదే సాయంత్రం 9 వరకూ షూటింగ్‌ చేస్తే ఒకటిన్నర కాల్షీట్‌ కింద లెక్క కడతారు.

రాత్రి పన్నెండు వరకు షూటింగ్‌ కొనసాగితే రెండు కాల్షీట్‌ల కింద లెక్క పెడతారు. ఇలా ఒక్కరోజు షూటింగ్‌ కాల్షీట్‌ని బట్టి చాలా విభాగాల వారికి ఏ రోజు పారితోషికం ఆ రోజు అందుతుంటుంది. కుదరని పక్షాన వారం రోజులది ఒకేరోజు పే చేస్తారు. కరోనా కారణంగా లొకేషన్లు పొద్దు పొడవట్లేదు. సెట్లు కాంతివిహీనమయ్యాయి. లొకేషన్లు ఆకలి కేకలు పెడుతున్నాయి. సెట్లో ఎప్పుడూ ఉండే సందడి ప్రస్తుతం లేదు. మళ్లీ షూటింగ్‌ ఎప్పుడు మొదలవుతుందో సరిగ్గా తెలియదు. ఇండస్ట్రీ షూటింగ్స్‌నే బతుకు‘తెర’వుగా పెట్టుకున్న వాళ్లు విలవిలలాడుతున్నారు. ‘వైరస్‌తో పోతామనే భయం కంటే ఆకలి చావులతో పోకుండా ఉండాలి కదా?’ అని కొందరు పేర్కొన్నారు.

మా ‘మహిళా వర్కర్స్‌ యూనియన్‌’లో మొత్తం 130 మంది ఉన్నాం. నెలకు పది పదిహేను రోజులు పని దొరుకుతుంది. గిన్నెలు కడగడం, అవసరమైతే వంట చేయడం, భోజనాలు వడ్డించడం, వాటర్‌ క్యాన్లు మోయడం మా పని. ఈ 130 మందిలో కొన్నేళ్లుగా పని చేసి చేసి అలసిపోయినవాళ్లు, ఆరోగ్యం బాగాలేక పని చేయలేనివాళ్లు ఉన్నారు. మిగతావారిలో కొందరికే పని దొరుకుతుంది. ఉదయం 6 గంటలకు మొదలయ్యే కాల్షీట్‌ రాత్రి 7 వరకూ ఉంటుంది. రోజుకి 785 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు షూటింగ్‌లు బంద్‌ కావడంతో అదీ లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో యూనియన్‌ వైపు నుంచి ఏదైనా చేద్దామన్నా మా దగ్గర అంత ఫండ్‌ ఉండదు. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే 5 నుంచి 10 వేలు వరకూ ఇవ్వగలుగుతాం. 130 మందిలో మరీ రోజు గడవని పరిస్థితుల్లో 10 మందికి పైనే ఉన్నారు. ఇప్పుడు పని లేక పరిస్థితి దారు ణంగా ఉంది. ఎప్పుడు షూటింగులు మొదలవుతాయా అని ఎదురు చూస్తున్నాం.

– టి. లలిత
సినీ మరియు టీవీ ప్రొడక్షన్‌ మహిళా కార్మికుల సంఘం అధ్యక్షురాలు

షూటింగ్స్‌ ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నాం  
24 క్రాఫ్ట్స్‌కి చెందిన అందరికీ ఇబ్బందే. వీళ్లందరిలో చాలా మందికి సినిమా తప్ప వేరే పని తెలియదు.. రాదు. అనూహ్యంగా ఎదురైన ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో చాలామందికి అర్థం కావడంలేదు. మార్చి 31 వరకూ షూటింగ్స్‌ నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ అన్ని రోజులు అంటే అన్ని విభాగాల వారికీ ఇబ్బందే. అందుకే ఈ నెల 21 నుంచి షూటింగ్స్‌ని మళ్లీ జరుపుకునేలా పర్మిషన్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరనున్నాం. కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ, తక్కువమంది యూనిట్‌తో షూటింగ్‌ జరుపుకునేందుకు ప్లాన్‌ చేస్తున్నాం. 20 రోజులు షూటింగ్స్‌ లేకుండా ఉంటే సినిమా తయారవడానికి పని చేసే ప్రతి ఒక్కరికీ నష్టమే.  

– కొమర వెంకటేష్‌
జూనియర్‌ ఆర్టిస్ట్స్‌ ఏజెంట్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు 

ఏం చేయాలో తెలియని పరిస్థితి
మా యూనియన్‌లో దాదాపు 1300 మంది ఉన్నారు. నెలలో పదిహేను రోజులే మాకు పని ఉంటుంది. అదీ అందరికీ ఉండదు. రోజుల తరబడి పనిలేనివారు కూడా ఉంటారు. ఇప్పుడు కరోనా వల్ల షూటింగ్స్‌ ఆగిపోయాయి. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మాకు వేరే ఆదాయ మార్గం కూడా లేదు. ఒక సినిమా షూటింగ్‌ జరగాలంటే ఆర్టిస్టులు, జూనియర్‌ ఆర్టిస్టులు, లైట్‌మెన్స్‌.. ఇలా కనీసం రెండొందలమందైనా సెట్‌లో ఉండాలి. కరోనా వైరస్‌ కారణంగా గుంపులుగా ఉండి పని చేయకూడదని చెప్పారు. చేతిలో పని లేదు. ఊరికి వెళదామన్నా డబ్బులు లేవు. నిర్మాతలు మాత్రం ఏం చేస్తారు. షూటింగ్స్‌ అకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల నిర్మాతలు కూడా డబ్బులు సర్దుబాటు చేయలేని పరిస్థితి. సినిమా షూటింగ్స్‌ ఈ నెల 31వరకు ఆగిపోయాయి. నాకు తెలిసి మా యూనియన్‌లో దాదాపు 75శాతం మంది అద్దెలు కట్టుకునేవారే. ఒకటో తారీఖు అద్దె, పాల బిల్లు.. ఇలా కట్టాల్సినవి చాలా ఉంటాయి. చాలామంది ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు.

– ఎ. శ్రీనివాస్‌
లైట్‌మెన్‌ యూనియన్‌ అధ్యక్షుడు

మరిన్ని వార్తలు