శ్రుతిపై టాలీవుడ్ గుర్రు?

24 May, 2014 00:30 IST|Sakshi
శ్రుతిపై టాలీవుడ్ గుర్రు?

నటి శ్రుతిహాసన్‌పై టాలీవుడ్ గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సంచలన నటిగా పేరొందిన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. గబ్బర్‌సింగ్, ఎవడు, రేసుగుర్రం వంటి వరుస హిట్‌లను తన ఖాతాలో వేసుకున్న శ్రుతిహాసన్ హిందీ, తమిళ చిత్రాల్లోను నటిస్తూ యమ బిజీగా ఉన్నారు.

అందాలారబోతలోనూ ముందున్న ఈ ముద్దుగుమ్మ ఈ తరహా ఫోటోలతో కలకలం పుట్టిస్తున్నారు. డిడే అనే హిందీ చిత్రంలో వేశ్య పాత్రలో ఒలకపోసిన శృంగారం విమర్శకుల చేతికి పెద్ద పనే చెప్పింది. ఆ తరువాత ఎవడు అనే తెలుగు చిత్రంలో దుస్తుల విషయంలో చాలా పొదుపు పాటించి సంచలనం రేపారు. అయితే ఆ చిత్రంలోని ఆమె శృంగారభరిత చిత్రాలు ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేశాయి. ఈ సంఘటన శృతిహాసన్‌కు కాస్త ఎక్కువ ఆగ్రహాన్నే కలిగించింది.
 
తన అనుమతి లేకుండా ఈ ఫొటోలను నెట్‌లో పొందుపరచారంటూ ఆ చిత్ర నిర్మాతపై ఫైర్ అయ్యారు. ఆ నిర్మాత ఆ ఫొటోలతో తనకెలాంటి సంబందం లేదంటూ వివరణ ఇచ్చారు. అయి నా శ్రుతి కోపం చల్లారలేదు. తన ఇమేజ్‌ను డామేజ్ చేయడానికి ప్రయత్నించిన వారిని ఊరికే వదలి పెట్టకూడదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని టాలీవుడ్‌లోని పదిమంది ఫొటోగ్రాఫర్‌లను విచారిస్తున్నారు.
 
శ్రుతిహాసన్ సెక్సీగా నటించడం కొత్తేమీ కాదు. ఆమె తొలి చిత్రం లక్ (హిందీ) లోనే ఈత దుస్తులు ధరించి అందాలారబోతకు శ్రీకారం చుట్టారు. అలాంటిది పోలీసులకు ఫిర్యాదు చేస్తారా? అంటూ టాలీవుడ్‌లో ఆమెపై వ్యతిరేకత వ్యక్తం అవుతోందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయంలో కొందరు తెలుగు నిర్మాత మండలి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.